
సాక్షి, తూర్పు గోదావరిః దేవీపట్నం మండలంలో వరద ప్రభావిత ప్రాంతాలను మంత్రులు ఆళ్ల నాని, పిల్లి సుభాష్ చంద్రబోస్, పినిపే విశ్వరూప్, కన్నబాబు పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోకి ట్రాక్టర్లపై వెళ్లిన మంత్రులు.. వీరవరంలో నిర్వాసిత శిబిరాలను పరిశీలించి, భోజన సదుపాయాలను పర్యవేక్షించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను ఆదుకుంటామని తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరంగా చేపడుతున్నామని తెలిపారు. వరద తగ్గిన తరువాత వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నిర్వాసితులకు భోజనం, మందులు, పాలు ఎప్పటికప్పుడు అందే విధంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలోని ఊడిముడి లంక, బూరుగు లంక,గంటి పెదపూడి లంక, అరిగెల వారిపేటలో అధికారుల పర్యవేక్షణలో గ్రామస్తులు రాకపోకలు సాగిస్తున్నారు.
కొనసాగుతున్న వరద ఉధృతిః
అప్పనపల్లి, పెదపట్నం లంక, దొడ్డవరంలో వరద ఉధృతి కొనసాగడంతో స్థానికులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినవిల్లి మండలంలోని అయినవిల్లి, కొండుకుదురు, ముక్తేశ్వరంలలో పంటపొలాలు నీటమునిగాయి.
Comments
Please login to add a commentAdd a comment