వరద బాధితులకు సరుకులు అందిస్తున్న ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి
సాక్షి, రాజమహేంద్రవరం(తూర్పు గోదావరి): ముమ్మిడివరం నియోజకవర్గ కాట్రేనికోన, ఐ.పోలవరం ముమ్మిడివరం తాళ్ళరేవు మండలాల్లో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. లంకల్లో వరదనీరు నివాసాలను చుట్టు ముట్టడంతో లంకవాసులు ఇళ్ల నుండి బయటకు రాలేని పరిస్థితి ఉంది. పశుగ్రాసం లేక పశువులు అల్లాడుతున్నాయి. వరద బాధితులకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. కే.గంగవరం మండలంలో ముంపు ప్రాంతాల్లో శనివారం ఆయన పర్యటించారు. గోదావరి మధ్యలో ఉన్న శేరిలంక, మసకపల్లి, కోటిపల్లి ముంపు ప్రాంతాల్లో బాధితులను పరామర్శించి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
నీట మునిగిన అరటితోటలు:
రామచంద్రాపురం నియోజకవర్గంలోని లంక గ్రామాలను వరద నీరు ముంచెత్తడంతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంగవరం మండలం కోటిపల్లిలో ఇళ్లలోకి కూడా వరద నీరు ప్రవేశించింది. మసకపల్లి గ్రామంలో అరటి తోటలు నీట మునగడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. కాజులూరు మండలం పెదలంకలో షిరిడి సాయిబాబా గోశాల పూర్తిగా నీట మునిగింది.
ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి పర్యటన:
కొత్తపేట: మండలంలోని నారాయణ లంక వరద ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పర్యటించారు. బాధితులను పరామర్శించి వారికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. నారాయణ లంక నక్కా వారి పేట, రావులపాలెం మండలం తోక లంక గ్రామాలలో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment