సాక్షి, తాడేపల్లి: ఏపీలో వర్షాలకు వరదల కారణంగా విజయవాడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో జన జీవనం స్తంభించి పోయింది. ఈ నేపథ్యంలో బాధితులకు పలువురు అండగా నిలుస్తున్నారు. తమ వంతు సాయంగా ఎంతో డబ్బును విరాళంగా ఇస్తున్నారు.
తాజాగా విజయవాడ వరద సహాయక చర్యల నిమిత్తం సాయం చేసేందుకు ఓ చిన్నారి ముందుకు వచ్చాడు. తాడేపల్లిలోని క్యాంపు ఆఫీసులో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ఉయ్యూరుకు చెందిన రాజులపాటి అభయ్ రామ్ కలిశాడు. ఈ సందర్భంగా విరాళం అందజేశాడు. తన వంతు సాయంగా కిడ్డీ బ్యాంక్‌లో ఉన్న నగదు రూ. 10వేలను వైఎస్ జగన్‌కు అందించాడు. వరద బాధితులకు సాయం చేయాలనే లక్ష్యంతోనే తాను ఈ డబ్బు ఇస్తున్నట్టు చెప్పుకొచ్చాడు.
ఈ సందర్భంగా పెద్ద మనసుతో ముందుకు వచ్చిన అభయ్ రామ్‌ను వైఎస్ జగన్ అభినందించారు. భవిష్యత్‌లో ఉన్నత చదువులు చదువుకుని సమాజానికి ఉపయోగపడాలని సూచించారు. కాగా, అభయ్ ఉయ్యూరులో ఒకటో తరగతి చదువుతున్నాడు. విరాళం అందజేసిన సందర్భంగా బాలుడితో అభయ్ రామ్ కుటుంబ సభ్యులు, పెనమలూరు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి వైఎస్ జగన్‌ను కలిశారు.
మరోవైపు.. రాష్ట్రంలో వరదల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ భారీ విరాళం ప్రకటించింది. వరద బాధితుల సహాయార్థం పార్టీ తరఫున కోటి రూపాయల విరాళం ఇవ్వాలని పార్టీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం జరిగిన పార్టీ సమావేశంలో ఈ ప్రకటన చేశారు. అంతేకాకుండా పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు కూడా తమ వంతుగా విరాళాలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం దేవపూడికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత కట్టా మహేష్ తన వంతు సాయంగా వరద సహాయక చర్యల నిమిత్తం రూ. 50వేలు ఇచ్చారు. దీనికి సంబంధించిన చెక్‌ను వైఎస్ జగన్‌కు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment