కాట్రేనికోన మండలం చిర్రయానాంలో హేచరీ ఏర్పాటుకు శ్రీకారం
మరో ఆరు నెలల్లో ఉత్పత్తికి సిద్ధం
సాగుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రోత్సాహం
కోనసీమ నుంచి మలేసియా, థాయిలాండ్‌లకు ఎగుమతి
ధర కేజీ రూ.1,100 నుంచి రూ.2 వేలు
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని తీర ప్రాంత మత్స్యకారులకు ఒకప్పుడు కాసుల వర్షం కురిపించిన పసుపు పచ్చ పీతకు మళ్లీ పూర్వ వైభవం రానున్నది. అంతర్జాతీయ మార్కెట్‌లో దీనికున్న డిమాండ్.. సాగు విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించిన గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ పీతల సాగు ప్రోత్సాహానికి ప్రణాళిక సిద్ధంచేసింది.
దీనిలో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పచ్చపీతల హేచరీ పెట్టేందుకు ప్రణాళికలు రూపొందించి నిధులు మంజూరు చేసింది. త్వరలో ఇది సాకారం కాబోతోంది. – సాక్షి, అమలాపురం
విదేశాల్లో డిమాండ్
పచ్చ పీత (పసుపు పీత)కు అమెరికా, చైనా, థాయ్‌లాండ్, సింగపూర్‌లో మంచి డిమాండ్ ఉంది. ఔషధ గుణాలు కలిగిన వృక్షజాతులు పెరిగే చిట్టడవి (మడ అడవులు)లో అధికంగా ఇది దొరుకుతుంది. దీనిలో రాగి, ఫాస్ఫరస్, ఒమేగా–3 అధికంగా ఉంటాయి. వీటిని వినియోగిస్తే గుండె సమస్యలు, అల్జీమర్స్ (మతిమరుపు) లాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువ.
కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లం, చిర్రయానాం, కొత్తపాలెం, పండి, పొర, ఐ.పోలవరం మండలం భైరవపాలెం, కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చినవలసల, పెదవలసల, చినబొడ్డు వెంకటాయపాలెం, పెదబొడ్డు వెంకటాయపాలెం, గాడిమొగ, రామన్నపాలెం గ్రామాల మత్స్యకారులు ఎక్కువగా పీతల వేట చేస్తారు.
ఏటిమొగతోపాటు నదీపాయలు సముద్ర సంగమ ప్రాంతాలు, తీరంలో సహజ సిద్ధంగా ఏర్పడే పర్ర భూముల్లో వీటి లభ్యత అధికం. వీటిని తొలుత చెన్నై, కోల్‌కతా నగరాలకు, అక్కడ నుంచి విదేశాలకు ఎగుమతవుతాయి.
తగ్గిన లభ్యత.. పెరిగిన ధర
చమురు సంస్థల కార్యకలాపాలు, ఆక్వా చెరువుల వ్యర్థాలవల్ల పీత లభ్యత తగ్గిపోతోంది. గడిచిన ఐదేళ్లుగా దీని లభ్యత చాలా అరుదుగా మారిపోయింది. గతంలో రోజుకు ఐదు టన్నుల నుంచి ఆరు టన్నుల వరకు పీత చెన్నై వెళ్లి అక్కడ నుంచి ఇతర దేశాలకు ఎగుమతయ్యేది. ఇప్పుడు రోజుకు అర టన్ను కూడా పీత లభ్యత లేదు. మూడేళ్ల క్రితం పచ్చ పీత కేజీ ధర రూ.500ల వరకు ఉండేది. ఇప్పుడు కేజీ రూ.1100 నుంచి రూ.2 వేల వరకు పలుకుతోంది.
సాగుకు ఊతమిచ్చేలా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చర్యలు
అంతర్జాతీయంగా డిమాండ్ ఉండడం.. స్థానికంగా పసుపు పచ్చపీత లభ్యత చాలా తక్కువగా ఉండడంతో కోనసీమ జిల్లాలో కొంతమంది రైతులు ప్రయోగాత్మకంగా సాగుచేపట్టారు. కాట్రేనికోన మండలం పల్లం, చిర్రయానాం, ఉప్పలగుప్తం మండలం ఎన్.కొత్తపల్లి వంటి ప్రాంతాల్లో పెద్దఎత్తున సాగుచేశారు. వైరస్ సోకడంతో పీత ఎదుగుదల ఆశించిన స్థాయిలో రావడంలేదు. పీత పిల్లలు (సీడ్)ను తమిళనాడులోని రాజీవ్‌గాంధీ సెంటర్ ఆఫ్ ఆక్వా కల్చర్ వద్ద ఉన్న హేచరీ నుంచి తీసుకొస్తున్నారు.
పిల్లకు రూ.12, రవాణాకు రూ.మూడు చొప్పున ఒక పీత పిల్లకు రూ.15 వరకు అవుతోంది. అది కూడా ఆర్డరు ఇచ్చిన నాలుగు నుంచి ఆర్నెల్లపాటు పీత సీడ్ కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ఇక పీత పిల్లలు ఒకదానిని మరొకటి తినే గుణం ఉండడం, సుదూర ప్రాంతం నుంచి రవాణావల్ల నలిగిపోయి పెద్దఎత్తున చనిపోతున్నాయి. ఈ కారణంగా రైతులు సాగుకు ముందుకు రావడంలేదు.
వెనామీ తరహాలో విదేశీ మారకద్రవ్యం అధికంగా వచ్చే అవకాశమున్నందున తీరంలో పీతల సాగు ప్రోత్సహించాలని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా కాట్రేనికోన మండలం చిరయానాం వద్ద ఐదు ఎకరాల స్థలాన్ని గుర్తించారు. ఇక్కడ అధునాతన పద్ధతిలో హేచరీ ఏర్పాటుచేసేందుకు రూ.3.75 కోట్ల మంజూరుకు అనుమతిచ్చింది. ఎన్నికలవల్ల ఆలస్యమైన హేచరీ నిర్మాణ పనులు ఇప్పుడు ఊపందుకున్నాయి.
ఇక్కడ ఏడాదికి పది లక్షల పీత పిల్లలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరో నాలుగు నుంచి ఆర్నెలల్లో ఇక్కడ ఉత్పత్తి మొదలయ్యే అవకాశముంది. తమిళనాడులోనిది మొదటిది కాగా.. దేశంలో ఇది రెండో హేచరీగా గుర్తింపు సంతరించుకోనుంది. హేచరీ నుంచి పచ్చపీత పిల్ల ఉత్పత్తి మొదలైతే తీరంలో పీతల సాగుకు ఊతం లభించినట్లవుతుందని మత్స్యకారులు, ఆక్వా రైతులు ఆశలు పెట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment