సాక్షి ప్రతినిధి, కాకినాడ : వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికల పంరంపర సాగుతోంది. టీడీపీకి షాక్ మీద షాక్ తగులుతుండడంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. బుధవారం ఒక్క రోజే టీడీపీ కీలక నేతలు పెద్ద ఎత్తున వైఎస్సార్‌సీపీలో చేరారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం ఫ్యామిలీ, ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే పర్వత బాపనమ్మ ఫ్యామిలీ వైఎస్సార్‌సీపీలో చేరిపోయింది. ఇప్పుడా నేతల కేడరంతా వైఎస్సార్‌సీపీ బాట పట్టనుంది. కాకినాడ ఎంపీ, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత తోట నరసింహం, ఆయన సతీమణి వాణి, వారి కుమారుడు రామ్‌జీ బుధవారం హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో చేరారు. ముందుగా వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు జగన్ నరసింహం క్షేమసమాచారాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబమంతటికీ వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని, నరసింహం ఆరోగ్య విషయాన్ని నేను చూసుకుంటామని వైఎస్ జగన్ భరోసా ఇవ్వడంతో ఆ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
కొత్తగా పార్టీలోకి వచ్చిన వారిపై ఇంతగా ఆప్యాయత చూపించిన నేతను నేను చూడలేదని వాణి అన్నారు. తోట ఫ్యామిలీ చేరిక సమయంలో పార్టీ సమన్వయకర్త ద్వారంపూడి చంద్రశేఖర్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయ భాస్కర్ తదితర జిల్లా నేతలు హాజరయ్యారు. పార్టీలోకి చేరిన తర్వాత బయటికొచ్చి మీడియాతో చంద్రబాబు చేసిన అన్యాయాన్ని వివరించారు. హోంమంత్రి చినరాజప్ప, జిల్లా నాయకులు తమను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని, హోంమంత్రి రాజప్ప అయితే తన భర్తను ఎదగనివ్వకుండా యత్నించారని ఆరోపించారు. కబ్జాలు చేసే వారికి, మైనింగ్ దొంగలకు సర్వే పేరు చెప్పి టీడీపీ టిక్కెట్ ఇస్తుందని వాణి మరోసారి విరుచుకుపడ్డారు. ఎంపీ నరసింహం కూడా పార్టీలో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు.
పార్టీలో చేరనున్న కీలక నేతల అనుచరులు
బుధవారం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో చేరిన ఎంపీ నరసింహం, మాజీ ఎమ్మెల్యే పర్వత బాపనమ్మల అనుచరవర్గమంతా వైఎస్సార్‌సీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ నుంచి రాగానే చేరికల పర్వాన్ని కొనసాగించనున్నారు.
పర్వత బాపనమ్మతోపాటు పార్టీలో చేరిన రాజబాబు, జానకీదేవి
ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత పర్వత బాపనమ్మతోపాటు అన్నవరం దేవస్థానం పాలక మండలి సభ్యుడు, టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త పర్వత రాజబాబు, లయన్స్‌క్లబ్ అధ్యక్షురాలు పర్వత జానకీదేవి బుధవారం లోట‹స్‌పాండ్‌లోని కార్యాలయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త పర్వత పూర్ణచంద్రప్రసాద్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన తర్వాత బయటికొచ్చిన వారు మీడియాతో మాట్లాడుతూ 30ఏళ్లుగా టీడీపీలో పనిచేసి అలిసిపోయామని, చంద్రబాబు తమ కుటుంబానికి అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం చంద్రబాబు తీరుపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment