
విజయవాడసిటీ: తన మాటలను వక్రీకరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ‘ఎల్లో మీడియా’పెద్దలు దుష్ప్రచారాలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి ప్రసాద్ వి. పొట్లూరి ధ్వజమెత్తారు. ఇంగ్లిష్ వచ్చిన వారిని చంద్రబాబు పక్కనబెట్టుకుంటే మంచిదని సూచించారు. తాను ఓ సదస్సులో మాట్లాడిన దాంట్లో రెండు పదాలను కట్ చేసి ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. చంద్రబాబుకు తన పక్కన ఉన్నవాళ్లు ‘బ్రీఫ్డ్’చేసినట్లుగా లేరని, గల్లా జయదేవ్‌తో తర్జుమా చేయించుకుంటే మంచిదని హితవు పలికారు.
విజయవాడలోని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో పీవీపీ గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. సీఐఐ సంస్థ అన్ని రాజకీయ పార్టీలను రాష్ట్ర, విజయవాడ అభివృద్ధిపై మాట్లాడమని పిలిస్తే ఆ సమావేశంలో తాను పాల్గొన్నానన్నారు. అప్పటికే వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఏడుగురు వక్తలు మాట్లాడిన తర్వాత తనకు అవకాశం వస్తే.. తాను ఎక్కువ బోర్ కొట్టించనని, ప్రత్యేక హోదాపై తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడతానని చెప్పానన్నారు. ప్రత్యేక హోదాపై మాట్లాడిన పూర్తి సారాంశాన్ని ప్రసారం చేయకుండా ఎల్లో మీడియా ఎడిట్ చేసి దుష్ప్రచారం చేసిందని మండిపడ్డారు.