వంగా గీత, చలమశెట్టి సునీల్
రాజకీయంగా చైతన్యవంతమైన తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ లోక్‌సభ నియోజకవర్గానిది ప్రత్యేకస్థానం. తీర, మెట్ట ప్రాంతాల కలయికతో కూడిన ఈ నియోజకవర్గం రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుంది. ముగ్గురు కేంద్ర మంత్రుల్ని అందించిన ఘనత ఈ నియోజకవర్గానిదే. మూడేసి పర్యాయాలు ముగ్గురు నేతలను లోక్‌సభకు పంపించిన చరిత్ర కాకినాడది.
కేంద్రమంత్రులుగా తండ్రీకొడుకులు
అన్ని శాసనసభా నియోజకవర్గాలు జనరల్ స్థానాలు కావడం కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం విశేషం. ఇక్కడ కాపు కులస్తులు అధికంగా ఉండటం వల్ల అన్ని రాజకీయ పార్టీలు ఆ వర్గానికే టికెట్లు అత్యధిక సార్లు కేటాయించాయి. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన మల్లిపూడి రామసంజీవరావు, ఆయన కుమారుడు పళ్లంరాజు, బీజేపీ తరఫున గెలిచిన కృష్ణంరాజు, కేంద్రమంత్రులుగా పనిచేశారు.
తొలి ఎంపీగా సీపీఐ నేత
1952లో ఏర్పాటైన కాకినాడ లోక్‌సభ పరిధిలో కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పిఠాపురం, పెద్దాపురం, తుని, జగ్గంపేట, ప్రత్తిపాడు నియోజకవర్గాలు ఉన్నాయి. 1952లో సీపీఐ అభ్యర్థిగా పనిచేసిన సీహెచ్‌వీ రామారావు తొలి ఎంపీగా గెలుపొందారు. ఇప్పటివరకు 16 పర్యాయాలు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ అభ్యర్థులు 9 సార్లు, టీడీపీ ఐదు సార్లు, సీపీఐ ఒకసారి, బీజేపీ అభ్యర్థి ఒకసారి విజయం సాధించారు. మొసలికంటి తిరుమలరావు, మల్లిపూడి శ్రీరామ సంజీవరావు వరుసగా మూడు పర్యాయాలు ఎన్నికయ్యారు. మూడు పర్యాయాలు ఎన్నికైన మరో నేతగా మల్లిపూడి పళ్లంరాజు నిలిచారు. వీరి తర్వాత తోట గోపాలకృష్ణ రెండు సార్లు, తోట సుబ్బారావు, కృష్ణంరాజు, ముద్రగడ ఒక్కోసారి గెలిచారు. గడిచిన ఎన్నికల్లో టీడీపీ తరఫున తోట నర్సింహం సమీప ప్రత్యర్థి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌పై విజయం సాధించారు.
రెండు పార్టీల మధ్యే పోటీ
ఈసారి బరిలో రాజకీయ పక్షాలన్నీ ఉన్నప్పటికీ ప్రధాన పోటీ వైఎస్సార్‌సీపీ, టీడీపీ మధ్యనే ఉండనుంది. వైఎస్సార్‌సీపీ తరపున మాజీ ఎంపీ వంగా గీత పోటీ చేస్తుండగా.. టీడీపీ తరపున చలమలశెట్టి సునీల్ బరిలో ఉన్నారు. జనసేన తరఫున జ్యోతుల వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నుంచి పళ్లంరాజు పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిపై ఇంకా క్లారిటీ రాలేదు. వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేస్తున్న వంగా గీత నియోజకవర్గ మంతటికీ సుపరిచితురాలు. ఆమె గతంలో జెడ్పీ చైర్‌పర్సన్‌గా, రాజ్యసభ సభ్యురాలిగా, ఎంపీగా పనిచేశారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.
టీడీపీపై వ్యతిరేకత..
గడిచిన ఎన్నికల్లో కాకినాడ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీ నాలుగు, వైఎస్సార్‌సీపీ మూడు స్థానాలను కైవసం చేసుకుంది. ఇందులో ఇద్దరు ఎమ్మెల్యేలను టీడీపీ ప్రలోభాలకు గురిచేసి ఫిరాయింపులను ప్రోత్సహించింది. అయితే, ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రజా వ్యతిరేకత విధానాలతో టీడీపీ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. అనేక హామీలిచ్చి, పొత్తులతో కలిసి అధికారంలోకి వచ్చిన బాబు జిల్లా ప్రజలను నిండా ముంచేశారు. నీరు చెట్లు అక్రమాలు, ఇసుక, మట్టి, గ్రావెల్ మాఫియా, మరుగుదొడ్ల అవినీతి,ఇలా ఒకటేంటి అనేక రకాలుగా దోపిడీకి పాల్పడ్డారు.
వైఎస్సార్ హయాంలో..
వైఎస్సార్ సీఎంగా ఉన్నంత కాలం నియోజక వర్గం అభివృద్ధి దిశగా సాగింది. సాగునీటి ప్రాజెక్టులను చేపట్టడమే కాకుండా రైతుల్ని ఆదుకున్నారు. పార్లమెంట్ పరిధిలో జేఎన్‌టీయూ యూనివరిటీ ఏర్పాటుతోపాటు విద్యాభివృద్ధికి పాటు పడ్డారు.
వంగా గీత బలాలు : నియోజకవర్గమంతటికీ సుపరిచితురాలు. గతంలో జెడ్పీ చైర్‌పర్సన్‌గా, రాజ్యసభ సభ్యురాలిగా పనిచేసిన అనుభవం. తన హయాంలో చేపట్టిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు. పార్టీలకు అతీతంగా ఆపద వచ్చినప్పుడు ఆదుకుంటారనే పేరు.
చలమశెట్టి సునీల్ బలాలు : ఆర్థికంగా స్థితిమంతుడు
బలహీనతలు : ఎన్నికలప్పుడే జనాల్లోకి వస్తారు. ఆ తర్వాత తన వ్యాపార వ్యవహారాలను చూసుకుంటారు. ప్రజలకు, క్యాడర్‌కు అందుబాటులో ఉండకపోవడం.
Comments
Please login to add a commentAdd a comment