అనంతపురం : ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలు ఇదే కోరుకుంటున్నారు. చంద్రబాబునాయుడికి ఖలేజా ఉంటే.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదని ఆయన భావిస్తే.. ఆ విషయాన్ని ప్రజలకు బహిరంగంగా చెప్పాలని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం అనంతపురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒక ప్రాజెక్టుని పూర్తి చేసి నీరు పారించి జాతికి అంకితం ఇవ్వడం సర్వసాధారణం. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం పట్టిసీమ పూర్తి కాకుండానే ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ విషయంలో ఆయనను గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో చోటివ్వాలని ఎద్దేవా చేశారు. పట్టిసీమ ద్వారా రాయలసీమకి చుక్క నీరు రాదని కరాఖండిగా చెప్పారు. కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకు మాట్లాడుతున్నారన్నారు. నిజంగా రాయలసీమకు నీరు ఇవ్వాలని ఉంటే ఆ విషయాన్ని జీవోలో ఎందుకు పొందుపర్చలేదని ప్రశ్నించారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి తీరాల్సిందేనన్నారు. రాజధాని పేరుతో ఇప్పటికే 34 వేల ఎకరాలు సేకరించారు. ఇంకా తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మూడు పంటలు పండే భూములను తాకితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వేల ఎకరాలను సేకరించి పరాయి దేశాలకు భూములను లీజుకు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధపడ్డారని, రాష్ట్రాన్ని దోచుకోమని మరోసారి ఈస్ట్ ఇండియా కంపెనీకి లెసైన్స్ ఇస్తున్నట్లుగా ఉందని దుమ్మెత్తి పోశారు. ఒకవైపు కరువు విలయతాండం చేస్తోంది. ఇలాంటి పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొని రైతుకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసిందని మండిపడ్డారు. ఓటుకు నోటు వ్యవహారంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటున్నారు. నిజంగా వీరికి చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే నేరుగా కేంద్ర హోం శాఖకు లేఖ రాసి సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ కోరాలన్నారు.
'ఖలేజా ఉంటే.. ప్రత్యేక హోదా అవసరంలేదని బహిరంగంగా చెప్పు'
Published Thu, Aug 20 2015 7:15 PM | Last Updated on Sat, Aug 18 2018 9:13 PM
Advertisement