సీఐలు: 57
ఎస్‌ఐలు: 157
కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్లు, ఏఎస్‌ఐలు: 3,986
ఏరికోరి ఎంచుకున్న ఉద్యోగం.. అసాంఘిక శక్తులకు ఎదురొడ్డి నిలిచే గాంభీర్యం.. క్షణం తీరిక ఉండదు. కంటి నిండా నిద్ర కరువు. కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడుపుదామన్నా ఎప్పుడు, ఎక్కడ ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోననే ఆందోళన. డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్లేలోపు.. ఫోన్ మోగుతుంది. ముద్ద దిగక ముందే.. లాఠీ పట్టుకొని పరుగుతీయాల్సిన పరిస్థితి. శాంతి భద్రతల పరిరక్షణలో తలమునకలయ్యే పోలీసులకు.. సొంత జీవితం ఉందనే విషయం కూడా గుర్తుండదంటే అతిశయోక్తి కాదు. ఈ పరిస్థితుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు తీసుకొచ్చింది. వారంలో ఒక్క రోజు సెలవు ప్రకటన పోలీసుల జీవితాల్లో ఆనందం నింపుతోంది.
సాక్షి, అనంతపురం సెంట్రల్: సరికొత్త చరిత్రకు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నాంది పలికింది. పని ఒత్తిడితో సతమతం అవుతున్న పోలీసులకు వారాంతపు సెలవును ప్రకటిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. క్షణం తీరిక లేకుండా గడిపే పోలీసులకు ఈ నిర్ణయం కొండంత ఊరటగా నిలుస్తోంది. పోలీసు శాఖలోని కొన్ని విభాగాల్లో పది రోజులకు ఒకసారి కూడా ఇళ్లకు వెళ్లలేని పరిస్థితి. పేరుకు ప్రభుత్వ ఉద్యోగమే అయినా.. ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడంతో పాటు రేయింబవళ్లు శ్రమించాల్సిందే. విశ్రాంతి లేని సేవలతో నాలుగు పదుల వయస్సు దాటగానే అనారోగ్యం బారిన పడుతున్న ఉద్యోగులు ఎందరో. పోలీసుల దీనావస్థను తెలుసుకున్న సీఎం జగన్ వారాంతపు సెలవులకు శ్రీకారం చుట్టడం పట్ల ఆ శాఖ ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి పోలీసులకు విధుల కేటాయింపులో మూడు షిఫ్టులు అమలు చేయాలని చట్టంలో ఉన్నా.. అమలు చేసిన దాఖలాల్లేవు. తొలిసారి పోలీసు సంక్షేమానికి పెద్దపీట వేసిన ఏకైక ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోనున్నారు.
భలే చాన్సులే..
ప్రభుత్వ శాఖలన్నింటిలోకి పోలీసు శాఖ ప్రత్యేకం. ఆదివారాలు, పండుగలు, పబ్బాలు, బంద్‌లు ఏమున్నా పోలీసులు మాత్రం విధుల్లో ఉండాల్సిందే. ఒక్కరోజు పోలీసులు లేకపోతే.. అని ఊహించుకోవడమే కష్టం. అలాంటి పోలీసులకు కూడా వారాంతపు సెలవులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో 4,200 మంది కానిస్టేబుల్ స్థాయి నుంచి హెడ్‌కానిస్టేబుల్, ఏఎస్‌ఐలు, ఎస్‌ఐలు, సీఐలకు ఈ నిర్ణయం వర్తించనుంది. ప్రస్తుతం వీరికి ఎలాంటి సెలవులు లేవు. అవసరాన్ని బట్టి సెలవులు తీసుకుంటున్నారు. ఒక్కోసారి ఇబ్బందులు ఏర్పడితే సెలవులో ఉన్నా డ్యూటీకి రావాల్సిన పరిస్థితి. ఒక్క డ్రైవర్ పోస్టులో ఉండే సిబ్బంది మాత్రమే రోజు మార్చి రోజు విధులకు హాజరవుతున్నారు. మిగిలిన ఉద్యోగులకు ఎలాంటి సెలవులు ఉండవు. ఇలాంటి పరిస్థితిలో మార్పు తీసుకొస్తూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
అమలు ఎలా ఉండబోతుందంటే..
రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి పోలీసులకు వీక్లి ఆఫ్‌లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంగళవారం అమరావతిలో డీజీపీ గౌతమ్‌సవాంగ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా తీసుకున్న నిర్ణయం ప్రకారం కానిస్టేబుల్ నుంచి సీఐల వరకూ వీక్లీఆఫ్ మంజూరు చేయనున్నారు. ప్రస్తుతం జిల్లాలో దాదాపు 4,200 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో రోజూ 30శాతం మంది సెలవు తీసుకోనున్నారు. మిగిలిన 70శాతం మంది డ్యూటీలో ఉంటారు. అలాగే ప్రస్తుతం ఒక్కో విభాగంలో ఒక్కో రకంగా విధులు ఉన్నాయి. కొంతమందికి ఇప్పటికే సెలవులు వర్తిస్తున్నాయి. ముఖ్యంగా మండలస్థాయి పోలీసుస్టేషన్‌లలో పనిచేసే సిబ్బందికి సెలవులు ఉండట్లేదు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అందరికీ వారాంతపు సెలవు వర్తించనుంది. ఈ విషయమై త్వరలో విధివిధానాలు రూపొందించి ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం.
ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తాం
పోలీసులకు సెలవులను ప్రణాళికా బద్ధంగా, టెక్నాలజీ ఆధారంగా అమలు చేస్తాం. ప్రస్తుతం ఒక్కో విభాగంలో ఒక్కో రకంగా సెలవు తీసుకుంటున్నారు. ముఖ్యంగా పీఎస్‌ఓలు, డ్రైవర్లు, కోర్టు డ్యూటీ సిబ్బంది, సెంట్రీ డ్యూటీలు, ఏఆర్ సిబ్బంది సెలవులు తీసుకుంటున్నారు. మిగిలిన వారికి ప్రస్తుతం వీక్లీఆఫ్‌లు మంజూరు చేయాల్సి ఉంటుంది. వారికి ఎలా మంజూరు చేయాలనే అంశంపై చర్చిస్తాం.
– బూసారపు సత్యయేసుబాబు, జిల్లా ఎస్పీ
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అమలు
జిల్లాలో ప్రస్తుతం దాదాపు 4,200 మంది పోలీసు సిబ్బంది ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో వారంలో ఒక రోజు సెలవు మంజూరు చేయాల్సి ఉంటుంది. కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్లు, ఎస్‌ఐలు, సీఐలకు ఏ విధంగా సెలవులు ఇవ్వాలనే విషయమై ఇంకా ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. పోలీసు సిబ్బంది సంక్షేమం దృష్ట్యా వారు సంతోషంగా గడిపేందుకు సెలవులు మంజూరు చేయడం అభినందనీయం.
– కె.చౌడేశ్వరి, అదనపు ఎస్పీ
హృదయపూర్వక కృతజ్ఞతలు
పోలీసులకు మూడు షిఫ్టుల్లో డ్యూటీలు వేయాలనే నిబంధన ఉంది. అయితే ఏ ప్రభుత్వం కూడా అమలు చేయలేకపోయింది. కానీ ఏకంగా వీక్లీ ఆఫ్‌లు ప్రకటించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు. గతంలో కానిస్టేబుళ్లకు జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ కల్పించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కింది. ఈ నిర్ణయంతో పోలీసుల జీతాల్లో భారీ పెంపు వచ్చింది. పోలీసుల సంక్షేమానికి పెద్దపీట వేసిన సీఎంగా వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారు.
– శివానంద, పోలీసు అధికారుల సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment