weeklyoffs
-
ఒత్తిడి నుంచి ఉపశమనం..
సాక్షి, దెందులూరు: ఎట్టకేలకు పోలీసులకు వారంతపు సెలవు దొరికింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పోలీసులకు ఊరట కలిగించే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. పోలీసు శాఖలో 30 విభాగాలున్నాయి. క్షణం తీరికలేకుండా పగలు, రాత్రి, ఎండ, వాన అనకుండా 24 గంటలూ వి«ధినిర్వహణలో ఉండే ఏకైక ప్రభుత్వ శాఖ పోలీస్ శాఖ ఒక్కటే. వారంతపు సెలవు లేకపోవడంతో ఉద్యోగ రీత్య మానసికంగా, శారీరకంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. తీవ్ర అనారోగ్యాలపాలవుతున్నారు. కుటుంబజీవితాన్ని కోల్పోతున్నారు. ఇన్ని అవాంతరాలు ప్రతికూల పరిస్థితులతో దశాబ్ధాలుగా అన్ని విభాగాల పోలీసులు ప్రజాసేవలో నిమగ్నమై ఒక్కోసారి విధుల్లోనే మృత్యువాతకు గురవుతున్నారు. మరికొందరు దేశ రక్షణ కోసం, మరికొందరు అల్లర్లలో ప్రాణాలు కోల్పోతున్నారు. పోలీస్ శాఖలో పోలీసుల పరిస్థితులు గుర్తెరిగి అధ్యయనంచేసి వారికి ఊరట కలిగించి కుటుంబసభ్యులతో ఒక రోజంతా గడిపేలా వీక్లీ ఆఫ్‌ను ప్రకటించారు. అడిషనల్ డీజీ (లా అండ్ ఆర్డర్) డాక్టర్ రవిశంకర్ సీఎం ఆదేశాలను పోలీసులకు వీక్లీ ఆఫ్‌పై విధి విధానాలను వివరించారు. ఇప్పటికే విశాఖ, కడప జిల్లాల్లో ప్రయోగాత్మకంగా వీక్లీఆఫ్‌ను అమలుచేస్తున్నామని, నేటి నుంచి అమలుచేసే ఈ విధానంవల్ల లోటు పాట్లు జరగకుండా పోలీసుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పారదర్శకంగా వీక్లీ ఆఫ్ అమలుకు పటిష్టమైన చర్యలు తీసుకోనున్నారు. దీంతో అన్ని విభాగాల పోలీసులు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు, మేధావులు, స్వచ్చంద సంస్థలు, విద్యావేత్తలు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. సీఎం, హోంశాఖ మంత్రి,డీజీపీలకు కృతజ్ఞతలు.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వీక్లీ ఆఫ్లపై తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇవ్వటం వల్ల తీవ్ర మానసిక, శారీరక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. ఒక రోజు విశ్రాంతి అనంతరం సిబ్బంది ఉత్తేజంగా తిరిగి విధుల్లో చేరి బాధ్యతలు నిర్వహిస్తారు. – కె ఈశ్వరరావు, జిల్లా ఏఎస్పీ పోలీసులందరికీ మేలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన వీక్లీ ఆఫ్‌తో పోలీసులకి మేలు చేకూరుతుంది. సంవత్సరాల పాటు వారంతపు సెలవులు లేకుండా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు వారంతపు సెలవుతో ఉపశమనం లభిస్తుంది. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. – జి సూర్యనారాయన, సీఐ, వన్‌టౌన్, ఏలూరు మంచి ఆలోచన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మహోన్నతమైన వ్యక్తి. వేలాది మంది ఆరోగ్యం, కుటుంబ పరిస్థితులు, భవిష్యత్తు పరిరక్షణకు చర్యలు తీసుకోవటమే కాకుండా చేసిన ఆలోచన కూడా మహోన్నతమైనది. పోలీసులతో పాటు వారి కుటుంబ సభ్యులు, బంధువులు సీఎం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. – ఎన్ఆర్ కిషోర్ బాబు, ఎస్సై సక్రమంగా అమలు చేయాలి పోలీసులకు మేలు చేసే నిర్ణయాన్ని ప్రకటించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు. వీక్లీ ఆఫ్ నిర్ణయాన్ని సక్రమంగా అమలు చేయాలి. అదే సమయంలో లోటుపాట్లపై ఉన్నతాధికారులు పర్యవేక్షించాలి. సమీక్షలు నిర్వహించాలి. – శ్రీను, కానిస్టేబుల్, దెందులూరు -
పోలీసులకు వారాంతపు సెలవు
సీఐలు: 57 ఎస్ఐలు: 157 కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలు: 3,986 ఏరికోరి ఎంచుకున్న ఉద్యోగం.. అసాంఘిక శక్తులకు ఎదురొడ్డి నిలిచే గాంభీర్యం.. క్షణం తీరిక ఉండదు. కంటి నిండా నిద్ర కరువు. కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడుపుదామన్నా ఎప్పుడు, ఎక్కడ ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోననే ఆందోళన. డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్లేలోపు.. ఫోన్ మోగుతుంది. ముద్ద దిగక ముందే.. లాఠీ పట్టుకొని పరుగుతీయాల్సిన పరిస్థితి. శాంతి భద్రతల పరిరక్షణలో తలమునకలయ్యే పోలీసులకు.. సొంత జీవితం ఉందనే విషయం కూడా గుర్తుండదంటే అతిశయోక్తి కాదు. ఈ పరిస్థితుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు తీసుకొచ్చింది. వారంలో ఒక్క రోజు సెలవు ప్రకటన పోలీసుల జీవితాల్లో ఆనందం నింపుతోంది. సాక్షి, అనంతపురం సెంట్రల్: సరికొత్త చరిత్రకు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నాంది పలికింది. పని ఒత్తిడితో సతమతం అవుతున్న పోలీసులకు వారాంతపు సెలవును ప్రకటిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. క్షణం తీరిక లేకుండా గడిపే పోలీసులకు ఈ నిర్ణయం కొండంత ఊరటగా నిలుస్తోంది. పోలీసు శాఖలోని కొన్ని విభాగాల్లో పది రోజులకు ఒకసారి కూడా ఇళ్లకు వెళ్లలేని పరిస్థితి. పేరుకు ప్రభుత్వ ఉద్యోగమే అయినా.. ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడంతో పాటు రేయింబవళ్లు శ్రమించాల్సిందే. విశ్రాంతి లేని సేవలతో నాలుగు పదుల వయస్సు దాటగానే అనారోగ్యం బారిన పడుతున్న ఉద్యోగులు ఎందరో. పోలీసుల దీనావస్థను తెలుసుకున్న సీఎం జగన్ వారాంతపు సెలవులకు శ్రీకారం చుట్టడం పట్ల ఆ శాఖ ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి పోలీసులకు విధుల కేటాయింపులో మూడు షిఫ్టులు అమలు చేయాలని చట్టంలో ఉన్నా.. అమలు చేసిన దాఖలాల్లేవు. తొలిసారి పోలీసు సంక్షేమానికి పెద్దపీట వేసిన ఏకైక ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్రలో నిలిచిపోనున్నారు. భలే చాన్సులే.. ప్రభుత్వ శాఖలన్నింటిలోకి పోలీసు శాఖ ప్రత్యేకం. ఆదివారాలు, పండుగలు, పబ్బాలు, బంద్‌లు ఏమున్నా పోలీసులు మాత్రం విధుల్లో ఉండాల్సిందే. ఒక్కరోజు పోలీసులు లేకపోతే.. అని ఊహించుకోవడమే కష్టం. అలాంటి పోలీసులకు కూడా వారాంతపు సెలవులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో 4,200 మంది కానిస్టేబుల్ స్థాయి నుంచి హెడ్‌కానిస్టేబుల్, ఏఎస్ఐలు, ఎస్ఐలు, సీఐలకు ఈ నిర్ణయం వర్తించనుంది. ప్రస్తుతం వీరికి ఎలాంటి సెలవులు లేవు. అవసరాన్ని బట్టి సెలవులు తీసుకుంటున్నారు. ఒక్కోసారి ఇబ్బందులు ఏర్పడితే సెలవులో ఉన్నా డ్యూటీకి రావాల్సిన పరిస్థితి. ఒక్క డ్రైవర్ పోస్టులో ఉండే సిబ్బంది మాత్రమే రోజు మార్చి రోజు విధులకు హాజరవుతున్నారు. మిగిలిన ఉద్యోగులకు ఎలాంటి సెలవులు ఉండవు. ఇలాంటి పరిస్థితిలో మార్పు తీసుకొస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అమలు ఎలా ఉండబోతుందంటే.. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి పోలీసులకు వీక్లి ఆఫ్‌లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంగళవారం అమరావతిలో డీజీపీ గౌతమ్‌సవాంగ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా తీసుకున్న నిర్ణయం ప్రకారం కానిస్టేబుల్ నుంచి సీఐల వరకూ వీక్లీఆఫ్ మంజూరు చేయనున్నారు. ప్రస్తుతం జిల్లాలో దాదాపు 4,200 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో రోజూ 30శాతం మంది సెలవు తీసుకోనున్నారు. మిగిలిన 70శాతం మంది డ్యూటీలో ఉంటారు. అలాగే ప్రస్తుతం ఒక్కో విభాగంలో ఒక్కో రకంగా విధులు ఉన్నాయి. కొంతమందికి ఇప్పటికే సెలవులు వర్తిస్తున్నాయి. ముఖ్యంగా మండలస్థాయి పోలీసుస్టేషన్లలో పనిచేసే సిబ్బందికి సెలవులు ఉండట్లేదు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అందరికీ వారాంతపు సెలవు వర్తించనుంది. ఈ విషయమై త్వరలో విధివిధానాలు రూపొందించి ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం. ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తాం పోలీసులకు సెలవులను ప్రణాళికా బద్ధంగా, టెక్నాలజీ ఆధారంగా అమలు చేస్తాం. ప్రస్తుతం ఒక్కో విభాగంలో ఒక్కో రకంగా సెలవు తీసుకుంటున్నారు. ముఖ్యంగా పీఎస్ఓలు, డ్రైవర్లు, కోర్టు డ్యూటీ సిబ్బంది, సెంట్రీ డ్యూటీలు, ఏఆర్ సిబ్బంది సెలవులు తీసుకుంటున్నారు. మిగిలిన వారికి ప్రస్తుతం వీక్లీఆఫ్‌లు మంజూరు చేయాల్సి ఉంటుంది. వారికి ఎలా మంజూరు చేయాలనే అంశంపై చర్చిస్తాం. – బూసారపు సత్యయేసుబాబు, జిల్లా ఎస్పీ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అమలు జిల్లాలో ప్రస్తుతం దాదాపు 4,200 మంది పోలీసు సిబ్బంది ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో వారంలో ఒక రోజు సెలవు మంజూరు చేయాల్సి ఉంటుంది. కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్లు, ఎస్ఐలు, సీఐలకు ఏ విధంగా సెలవులు ఇవ్వాలనే విషయమై ఇంకా ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. పోలీసు సిబ్బంది సంక్షేమం దృష్ట్యా వారు సంతోషంగా గడిపేందుకు సెలవులు మంజూరు చేయడం అభినందనీయం. – కె.చౌడేశ్వరి, అదనపు ఎస్పీ హృదయపూర్వక కృతజ్ఞతలు పోలీసులకు మూడు షిఫ్టుల్లో డ్యూటీలు వేయాలనే నిబంధన ఉంది. అయితే ఏ ప్రభుత్వం కూడా అమలు చేయలేకపోయింది. కానీ ఏకంగా వీక్లీ ఆఫ్‌లు ప్రకటించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు. గతంలో కానిస్టేబుళ్లకు జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ కల్పించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కింది. ఈ నిర్ణయంతో పోలీసుల జీతాల్లో భారీ పెంపు వచ్చింది. పోలీసుల సంక్షేమానికి పెద్దపీట వేసిన సీఎంగా వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారు. – శివానంద, పోలీసు అధికారుల సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు -
పొట్ట.. ఎట్టెట్టా..!
సిటీ పోలీసుల్లో ‘బొజ్జ’ టెన్షన్.. పతకం పరేషాన్ సాక్షి, సిటీబ్యూరో: పోలీసు సిబ్బందికి షిఫ్ట్‌లు... ప్రతి వారం వీక్లీ ఆఫ్‌లు... ఏళ్లుగా వినిపిస్తున్న ఈ మాటలు నీటి మూటలుగా మారాయి. ఇది చాలదన్నట్లు ఇటీవల కేంద్రం తీసుకున్న నిర్ణయం ఈ గోరు చుట్టుపై రోకటి పోటులా మారిందని అధికారులు, సిబ్బంది వాపోతున్నారు. పొట్ట ఉన్న వారితో పాటు ఫిట్నెస్ లేని వారు కేంద్రం అందించే వివిధ పతకాలు పొందడానికి అనర్హులుగా పేర్కొంటూ కేంద్ర హోమ్ శాఖ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధిం చిన ఉత్తర్వులను అన్ని రాష్ట్రాలకూ పంపింది. పోలీసు విభాగం ఇటీవల నిర్వహించిన పరీక్షల నేపథ్యంలో 30 శాతం మంది పూర్తి ఫిట్నెస్తో లేరని తేలింది. పోలీసు సిబ్బందిలో ఈ పరిస్థితి నెలకొనడానికి అనేక కారణాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలోని ఇతర శాఖలతో పోలిస్తే ఫిట్నెస్ అనేది పోలీసు వారికి అత్యంత కీలకమైన అంశం. ఎంపిక, శిక్షణ, విధి నిర్వహణ ఇలా అన్ని స్థాయిల్లోనూ దీనిని పరిగణలోకి తీసుకుంటారు. ఎంపిక, శిక్షణ దశల్లో ఉన్న దారుఢ్యం ప్రస్తుతం 15 శాతం మందిలోనూ కనిపించట్లేదు. అప్పట్లో ఉన్న శ్రద్ధ, సమయం లేకపోవడంతో పాటు పని తీరు కూడా ఇందుకు దోహదం చేస్తోంది. 30 శాతం మందికి వర్తించని బీఎంఐ... ఎంత ఎత్తు ఉన్న వ్యక్తి ఎంత బరువు ఉండాలనే దానికి సంబంధించి అంతర్జాతీయ గణాంకాలు ఉన్నాయి. దీనినే సాంకేతికంగా బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) అంటారు. పోలీసు విభాగంలో కానిస్టేబుల్‌గా దరఖాస్తు చేసుకునే వారు పురుషులైతే కనిష్టంగా 167.6 సెంమీ, మహిళలైతే 152.5 సెంమీ ఎత్తు ఉండాలి. (రిజర్వేషన్ ప్రకారం కొందరికి మినహాయింపులు ఉంటాయి.) దీని ప్రకారం చూస్తే 58.3–68.2 కేజీల మధ్య మాత్రమే బరువు కలిగి ఉండాలి. ఎంపికయ్యే వారి గరిష్ట ఎత్తు 182.8 సెంమీ (ఆరు అడుగులు) అనుకున్నా... 63.6–79.5 కేజీల మధ్య మాత్రమే ఉండటం బీఎంఐ ప్రకారం తప్పనిసరి. అయితే ప్రస్తుతం నగర కమిషరేట్ పరిధిలో పని చేస్తున్న క్షేత్రస్థాయి సిబ్బందిలో కనిష్టంగా 30 శాతం మంది కూడా బీఎంఐ ప్రకారం ఎత్తుకు తగ్గ బరువుతో ఫిట్‌గా ఉండరన్నది అధికారులే అంగీకరిస్తున్న వాస్తవం. 60 శాతం మంది అధిక బరువు, మరో పది శాతం మంది ఒబేసిటీతో బాధపడుతుంటారని వారే చెబుతున్నారు. వీరి నుంచి కేంద్రం పేర్కొన్న ‘షేప్–1’ ఫిట్నెస్ ఆశించలేమని స్పష్టం చేస్తున్నారు. కారణాలు అనేకం... పోలీసు ఉద్యోగం కోసం ఎంపిక, శిక్షణలో ఉన్నప్పుడు తీసుకున్నంత ఆరోగ్య శ్రద్ధ విధుల్లో చేరిన తరవాత తీసుకోకపోవడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మరోపక్క సమయం, సందర్భం లేకుండా బం దోబస్తు, ఇతర విధులు నిర్వర్తించే సిబ్బందికి ఆహారం, నిద్ర సరైన సమయానికి సాధ్యం కావు. ఇది పొట్ట, ఊబకాయం పెరగడంతో పాటు అనేక ఇతర రుగ్మతలకూ కారణమవుతోందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఇబ్బందులతో పాటు మహిళా సిబ్బంది విషయంలో మరికొన్ని కారణాలతో ఊబకాయం సమస్యకు లోనవుతున్నారు. పురుష కానిస్టేబుళ్లతో పోలిస్తే మహిళా కానిస్టేబుళ్లతోనే ఈ సమస్య ఎక్కువగా ఉంటోందని పోలీసులే చెబుతున్నారు. బందోబస్తుల ‘భారం’... సిటీలో పని చేసే సిబ్బంది బందోబస్తులతో మరింత ‘భారం’గా మారుతున్నారు. నగరంలో పని చేసే వారిలో సగం కంటే ఎక్కు వ మంది దాదాపు 160 నుంచి 180 రోజుల వరకు ఈ విధుల్లో గడపాల్సిందే. ఇంద ులో భాగంగా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మినహాయిస్తే ఒకే ప్రాంతంలో గంటల తరబడి కూర్చోవడం, ఎక్కువగా బయట తయారు చేసిన, నూనె ఉత్పత్తులు తీసుకోవడం అనివార్యంగా మారుతోంది. ఈ కారణంగానే సిబ్బంది తమ బరువుపై అదుపు కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. వీటన్నింటికీ మించి ఇతర విభాగాలతో పోలిస్తే పోలీసులు చాలా తొందరగా, తేలిగ్గా దురలవాట్లకు బానిసలు అవుతుండటం కూడా ఒబెసిటీకి మరో కారణంగా కనిపిస్తోంది. కనిపించని డ్రిల్స్... పోలీసు విభాగంలో పని చేసే సిబ్బంది కచ్చితంగా ఫిట్నెస్తో ఉండాలన్న ఉద్దేశంతో డ్రిల్స్‌ను ప్రవేశపెట్టారు. గతంలో ఇవి పోలీసుస్టేషన్లు, డివిజన్ల వారికీ ప్రతి వారం జరిగేవి. ఇందులో భాగంగా దాదాపు మూడునాలుగు గంటల పాటు వ్యాయామం, ఇతర కసరత్తులు చేయించే వారు. అయితే ప్రస్తుతం బందోబస్తులు, ఇతర పనులకే సమయం చాలకపోవడంతో డ్రిల్స్ మూలన పడ్డాయి. ఎవరికి వారూ సొంతంగా చేసుకోవ డానికీ అవకాశం చిక్కట్లేదు. మిలటరీ విభాగాల్లో ఉన్నట్లు పోలీసు సిబ్బందికి నిత్యం ఫిట్నెస్ పరీక్షలు, వ్యాయామాలు లేకపోవడం, ఉన్నతాధికారుల మాదిరి మిడ్ కెరియర్ శిక్షణలు కరవు కావడం వీరికి శాపంగా మారుతోంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇటీవలే పోలీసుస్టేషన్లలో జిమ్స్ అందుబాటులోకి వచ్చినా వాటిని వినియోగించుకునే సమయం సిబ్బందికి దొరకట్లేదు. కేంద్రం ‘ఫిట్నెస్–పతకాలు’ నిర్ణయం తీసుకునే ముందు పోలీసులకు అవసరమైన సమయం, సదుపాయాలు కల్పించాలని సిబ్బంది స్పష్టం చేస్తున్నారు. 8 గంటల డ్యూటీ ఇవ్వండి సమయ పాలనతో పాటు సరైన నిద్ర, ఆహారం లేని విధులు నిర్వర్తించే పోలీసుల్లో ఫిట్నెస్ ప్రధాన సమస్యగా మారుతోంది. ముందుగా సిబ్బంది సంఖ్యను పెంచి, షిఫ్ట్ డ్యూటీలు, వీక్లీ ఆఫ్‌లు అమలు చేయాలి. ప్రధానంగా ప్రతి పోలీసు లకూ కేవలం ఎనిమిది గంటలు మాత్రమే డ్యూటీ టైమ్‌గా స్పష్టం చేసి, అమలు చేయాలి. ఆ తర్వాత మాత్రమే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కేవలం పొట్ట, ఫిట్నెస్ సమస్యలను చూపి పతకాలను తిరస్కరించడం సమంజసం కాదు. – వై.గోపిరెడ్డి, అధ్యక్షుడు, రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం