పొట్ట.. ఎట్టెట్టా..!
- సిటీ పోలీసుల్లో ‘బొజ్జ’ టెన్షన్..
- పతకం పరేషాన్
సాక్షి, సిటీబ్యూరో: పోలీసు సిబ్బందికి షిఫ్ట్‌లు... ప్రతి వారం వీక్లీ ఆఫ్‌లు... ఏళ్లుగా వినిపిస్తున్న ఈ మాటలు నీటి మూటలుగా మారాయి. ఇది చాలదన్నట్లు ఇటీవల కేంద్రం తీసుకున్న నిర్ణయం ఈ గోరు చుట్టుపై రోకటి పోటులా మారిందని అధికారులు, సిబ్బంది వాపోతున్నారు. పొట్ట ఉన్న వారితో పాటు ఫిట్‌నెస్ లేని వారు కేంద్రం అందించే వివిధ పతకాలు పొందడానికి అనర్హులుగా పేర్కొంటూ కేంద్ర హోమ్ శాఖ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధిం చిన ఉత్తర్వులను అన్ని రాష్ట్రాలకూ పంపింది. పోలీసు విభాగం ఇటీవల నిర్వహించిన పరీక్షల నేపథ్యంలో 30 శాతం మంది పూర్తి ఫిట్‌నెస్‌తో లేరని తేలింది.
పోలీసు సిబ్బందిలో ఈ పరిస్థితి నెలకొనడానికి అనేక కారణాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలోని ఇతర శాఖలతో పోలిస్తే ఫిట్‌నెస్ అనేది పోలీసు వారికి అత్యంత కీలకమైన అంశం. ఎంపిక, శిక్షణ, విధి నిర్వహణ ఇలా అన్ని స్థాయిల్లోనూ దీనిని పరిగణలోకి తీసుకుంటారు. ఎంపిక, శిక్షణ దశల్లో ఉన్న దారుఢ్యం ప్రస్తుతం 15 శాతం మందిలోనూ కనిపించట్లేదు. అప్పట్లో ఉన్న శ్రద్ధ, సమయం లేకపోవడంతో పాటు పని తీరు కూడా ఇందుకు దోహదం చేస్తోంది.
30 శాతం మందికి వర్తించని బీఎంఐ...
ఎంత ఎత్తు ఉన్న వ్యక్తి ఎంత బరువు ఉండాలనే దానికి సంబంధించి అంతర్జాతీయ గణాంకాలు ఉన్నాయి. దీనినే సాంకేతికంగా బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) అంటారు. పోలీసు విభాగంలో కానిస్టేబుల్‌గా దరఖాస్తు చేసుకునే వారు పురుషులైతే కనిష్టంగా 167.6 సెంమీ, మహిళలైతే 152.5 సెంమీ ఎత్తు ఉండాలి. (రిజర్వేషన్ ప్రకారం కొందరికి మినహాయింపులు ఉంటాయి.) దీని ప్రకారం చూస్తే 58.3–68.2 కేజీల మధ్య మాత్రమే బరువు కలిగి ఉండాలి. ఎంపికయ్యే వారి గరిష్ట ఎత్తు 182.8 సెంమీ (ఆరు అడుగులు) అనుకున్నా... 63.6–79.5 కేజీల మధ్య మాత్రమే ఉండటం బీఎంఐ ప్రకారం తప్పనిసరి.
అయితే ప్రస్తుతం నగర కమిషరేట్ పరిధిలో పని చేస్తున్న క్షేత్రస్థాయి సిబ్బందిలో కనిష్టంగా 30 శాతం మంది కూడా బీఎంఐ ప్రకారం ఎత్తుకు తగ్గ బరువుతో ఫిట్‌గా ఉండరన్నది అధికారులే అంగీకరిస్తున్న వాస్తవం. 60 శాతం మంది అధిక బరువు, మరో పది శాతం మంది ఒబేసిటీతో బాధపడుతుంటారని వారే చెబుతున్నారు. వీరి నుంచి కేంద్రం పేర్కొన్న ‘షేప్–1’ ఫిట్‌నెస్ ఆశించలేమని స్పష్టం చేస్తున్నారు.
కారణాలు అనేకం...
పోలీసు ఉద్యోగం కోసం ఎంపిక, శిక్షణలో ఉన్నప్పుడు తీసుకున్నంత ఆరోగ్య శ్రద్ధ విధుల్లో చేరిన తరవాత తీసుకోకపోవడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మరోపక్క సమయం, సందర్భం లేకుండా బం దోబస్తు, ఇతర విధులు నిర్వర్తించే సిబ్బందికి ఆహారం, నిద్ర సరైన సమయానికి సాధ్యం కావు. ఇది పొట్ట, ఊబకాయం పెరగడంతో పాటు అనేక ఇతర రుగ్మతలకూ కారణమవుతోందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఇబ్బందులతో పాటు మహిళా సిబ్బంది విషయంలో మరికొన్ని కారణాలతో ఊబకాయం సమస్యకు లోనవుతున్నారు. పురుష కానిస్టేబుళ్లతో పోలిస్తే మహిళా కానిస్టేబుళ్లతోనే ఈ సమస్య ఎక్కువగా ఉంటోందని పోలీసులే చెబుతున్నారు.
బందోబస్తుల ‘భారం’...
సిటీలో పని చేసే సిబ్బంది బందోబస్తులతో మరింత ‘భారం’గా మారుతున్నారు. నగరంలో పని చేసే వారిలో సగం కంటే ఎక్కు వ మంది దాదాపు 160 నుంచి 180 రోజుల వరకు ఈ విధుల్లో గడపాల్సిందే. ఇంద ులో భాగంగా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మినహాయిస్తే ఒకే ప్రాంతంలో గంటల తరబడి కూర్చోవడం, ఎక్కువగా బయట తయారు చేసిన, నూనె ఉత్పత్తులు తీసుకోవడం అనివార్యంగా మారుతోంది. ఈ కారణంగానే సిబ్బంది తమ బరువుపై అదుపు కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. వీటన్నింటికీ మించి ఇతర విభాగాలతో పోలిస్తే పోలీసులు చాలా తొందరగా, తేలిగ్గా దురలవాట్లకు బానిసలు అవుతుండటం కూడా ఒబెసిటీకి మరో కారణంగా కనిపిస్తోంది.
కనిపించని డ్రిల్స్...
పోలీసు విభాగంలో పని చేసే సిబ్బంది కచ్చితంగా ఫిట్‌నెస్‌తో ఉండాలన్న ఉద్దేశంతో డ్రిల్స్‌ను ప్రవేశపెట్టారు. గతంలో ఇవి పోలీసుస్టేషన్లు, డివిజన్ల వారికీ ప్రతి వారం జరిగేవి. ఇందులో భాగంగా దాదాపు మూడునాలుగు గంటల పాటు వ్యాయామం, ఇతర కసరత్తులు చేయించే వారు. అయితే ప్రస్తుతం బందోబస్తులు, ఇతర పనులకే సమయం చాలకపోవడంతో డ్రిల్స్ మూలన పడ్డాయి. ఎవరికి వారూ సొంతంగా చేసుకోవ డానికీ అవకాశం చిక్కట్లేదు. మిలటరీ విభాగాల్లో ఉన్నట్లు పోలీసు సిబ్బందికి నిత్యం ఫిట్‌నెస్ పరీక్షలు, వ్యాయామాలు లేకపోవడం, ఉన్నతాధికారుల మాదిరి మిడ్ కెరియర్ శిక్షణలు కరవు కావడం వీరికి శాపంగా మారుతోంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇటీవలే పోలీసుస్టేషన్లలో జిమ్స్ అందుబాటులోకి వచ్చినా వాటిని వినియోగించుకునే సమయం సిబ్బందికి దొరకట్లేదు. కేంద్రం ‘ఫిట్‌నెస్–పతకాలు’ నిర్ణయం తీసుకునే ముందు పోలీసులకు అవసరమైన సమయం, సదుపాయాలు కల్పించాలని సిబ్బంది స్పష్టం చేస్తున్నారు.
8 గంటల డ్యూటీ ఇవ్వండి
సమయ పాలనతో పాటు సరైన నిద్ర, ఆహారం లేని విధులు నిర్వర్తించే పోలీసుల్లో ఫిట్‌నెస్ ప్రధాన సమస్యగా మారుతోంది. ముందుగా సిబ్బంది సంఖ్యను పెంచి, షిఫ్ట్ డ్యూటీలు, వీక్లీ ఆఫ్‌లు అమలు చేయాలి. ప్రధానంగా ప్రతి పోలీసు లకూ కేవలం ఎనిమిది గంటలు మాత్రమే డ్యూటీ టైమ్‌గా స్పష్టం చేసి, అమలు చేయాలి. ఆ తర్వాత మాత్రమే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కేవలం పొట్ట, ఫిట్‌నెస్ సమస్యలను చూపి పతకాలను తిరస్కరించడం సమంజసం కాదు.
– వై.గోపిరెడ్డి, అధ్యక్షుడు, రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం