
పోలీసుల సేవలకు అభివాదం చేస్తున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, దెందులూరు: ఎట్టకేలకు పోలీసులకు వారంతపు సెలవు దొరికింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పోలీసులకు ఊరట కలిగించే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మంగళవారం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. పోలీసు శాఖలో 30 విభాగాలున్నాయి. క్షణం తీరికలేకుండా పగలు, రాత్రి, ఎండ, వాన అనకుండా 24 గంటలూ వి«ధినిర్వహణలో ఉండే ఏకైక ప్రభుత్వ శాఖ పోలీస్ శాఖ ఒక్కటే. వారంతపు సెలవు లేకపోవడంతో ఉద్యోగ రీత్య మానసికంగా, శారీరకంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. తీవ్ర అనారోగ్యాలపాలవుతున్నారు. కుటుంబజీవితాన్ని కోల్పోతున్నారు.
ఇన్ని అవాంతరాలు ప్రతికూల పరిస్థితులతో దశాబ్ధాలుగా అన్ని విభాగాల పోలీసులు ప్రజాసేవలో నిమగ్నమై ఒక్కోసారి విధుల్లోనే మృత్యువాతకు గురవుతున్నారు. మరికొందరు దేశ రక్షణ కోసం, మరికొందరు అల్లర్లలో ప్రాణాలు కోల్పోతున్నారు. పోలీస్ శాఖలో పోలీసుల పరిస్థితులు గుర్తెరిగి అధ్యయనంచేసి వారికి ఊరట కలిగించి కుటుంబసభ్యులతో ఒక రోజంతా గడిపేలా వీక్లీ ఆఫ్‌ను ప్రకటించారు. అడిషనల్ డీజీ (లా అండ్ ఆర్డర్) డాక్టర్ రవిశంకర్ సీఎం ఆదేశాలను పోలీసులకు వీక్లీ ఆఫ్‌పై విధి విధానాలను వివరించారు.
ఇప్పటికే విశాఖ, కడప జిల్లాల్లో ప్రయోగాత్మకంగా వీక్లీఆఫ్‌ను అమలుచేస్తున్నామని, నేటి నుంచి అమలుచేసే ఈ విధానంవల్ల లోటు పాట్లు జరగకుండా పోలీసుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పారదర్శకంగా వీక్లీ ఆఫ్ అమలుకు పటిష్టమైన చర్యలు తీసుకోనున్నారు. దీంతో అన్ని విభాగాల పోలీసులు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు, మేధావులు, స్వచ్చంద సంస్థలు, విద్యావేత్తలు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.
సీఎం, హోంశాఖ మంత్రి,డీజీపీలకు కృతజ్ఞతలు..
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వీక్లీ ఆఫ్‌లపై తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇవ్వటం వల్ల తీవ్ర మానసిక, శారీరక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. ఒక రోజు విశ్రాంతి అనంతరం సిబ్బంది ఉత్తేజంగా తిరిగి విధుల్లో చేరి బాధ్యతలు నిర్వహిస్తారు.
– కె ఈశ్వరరావు, జిల్లా ఏఎస్పీ
పోలీసులందరికీ మేలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన వీక్లీ ఆఫ్‌తో పోలీసులకి మేలు చేకూరుతుంది. సంవత్సరాల పాటు వారంతపు సెలవులు లేకుండా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు వారంతపు సెలవుతో ఉపశమనం లభిస్తుంది. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.
– జి సూర్యనారాయన, సీఐ, వన్‌టౌన్, ఏలూరు
మంచి ఆలోచన
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మహోన్నతమైన వ్యక్తి. వేలాది మంది ఆరోగ్యం, కుటుంబ పరిస్థితులు, భవిష్యత్తు పరిరక్షణకు చర్యలు తీసుకోవటమే కాకుండా చేసిన ఆలోచన కూడా మహోన్నతమైనది. పోలీసులతో పాటు వారి కుటుంబ సభ్యులు, బంధువులు సీఎం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– ఎన్‌ఆర్ కిషోర్ బాబు, ఎస్సై
సక్రమంగా అమలు చేయాలి
పోలీసులకు మేలు చేసే నిర్ణయాన్ని ప్రకటించిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు. వీక్లీ ఆఫ్ నిర్ణయాన్ని సక్రమంగా అమలు చేయాలి. అదే సమయంలో లోటుపాట్లపై ఉన్నతాధికారులు పర్యవేక్షించాలి. సమీక్షలు నిర్వహించాలి.
– శ్రీను, కానిస్టేబుల్, దెందులూరు
Comments
Please login to add a commentAdd a comment