
మత్తయ్య కేసులో ఏపీ పోలీసులకు చిక్కులు
ఓటుకు నోటు కేసులో నాలుగో నిందితుడైన మత్తయ్య కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసులకు న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యేలా ఉన్నాయి.
ఓటుకు నోటు కేసులో నాలుగో నిందితుడైన మత్తయ్య కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసులకు న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యేలా ఉన్నాయి. ఈనెల పదోతేదీన మత్తయ్య విజయవాడ సత్యన్నారాయణపురం పోలీసు స్టేషన్కు వచ్చారు. స్వయంగా ఆయనే వచ్చి సీఐకి ఫిర్యాదు చేయడంతో.. దీనిపై కేసు నమోదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇదే కేసును సీఐడీకి అప్పగించింది. దాంతో ఈ కేసు రికార్డులను సత్యన్నారాయణపురం పోలీసులు సీఐడీకి అప్పగించారు.
అయితే, మత్తయ్య మాత్రం తమ ఆధీనంలో లేడని సీఐడీ ఎస్పీ కోటేశ్వరరావు అంటున్నారు. వేరే రాష్ట్రంలో నిందితుడైన వ్యక్తిని ఎందుకు అరెస్టు చేయలేదంటూ ఇప్పుడు విమర్శలు తలెత్తుతున్నాయి. ఒక కేసులో నిందితుడైన వ్యక్తి నుంచి ఎలా ఫిర్యాదు తీసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మత్తయ్యను అదుపులోకి తీసుకుని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేసీఆర్ మనుషులమని చెప్పుకొన్న కొందరు తనను బెదిరించారంటూ తన ఫిర్యాదులో మత్తయ్య పేర్కొన్నారు. అయితే, ఈ ఫిర్యాదు ఆధారంగా ముందుకు వెళ్లలేమన్న భావనలో అధికారులున్నారు. మత్తయ్య ఫిర్యాదుపై మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు పోలీసులు సమాధానాలు దాటవేశారు.