
సాక్షి, అమరావతి: సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడంలో రాష్ట్ర పోలీసులు మరో ముందడుగు వేశారు. రాష్ట్రంలో కరోనా కట్టడి అంతా బాగా జరుగుతున్న తరుణంలో ఢిల్లీ నుంచి వచ్చిన వారి నుంచి కరోనా వైరస్ ముప్పు పోలీసులకు పెను సవాల్‌గా మారింది. అసలు ఢిల్లీలో ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు ఎవరు? ఎంత మంది ఉన్నారు? వంటి ప్రాథమిక సమాచారం కూడా తెలియకపోవ డంతో తొలుత పోలీసులు డిజిటల్ డేటా విశ్లేషణతో కూపీలాగారు. దీంతో ఢిల్లీలో ప్రార్థనలకు దేశవ్యాప్తంగా 13,702 మంది వెళ్లా రని నిఘా వర్గాలు అంచనా వేశాయి. అనంతరం ఏపీకి చెందిన వారి ఫోన్‌ల ఆధారంగా ఆరా తీసి మన రాష్ట్రానికి చెందిన వారు 1,085 మంది అని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ సంఖ్య ఇంకా పెరగొచ్చని పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
టెక్నాలజీని ఎలా వాడుకున్నారంటే..
► ఢిల్లీ నుంచి వచ్చిన వారికి కరోనా వైరస్ సోకడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం హైఅలర్ట్ ప్రకటించింది.
► అప్రమత్తమైన ప్రభుత్వం వెంటనే ఢిల్లీకి వెళ్లినవారి వివరాలను సేకరిం చాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, నగర పోలీస్ కమిషనర్లను ఆదేశించింది.
► టవర్ డంప్ ఎనాలసిస్ టెక్నాలజీ ద్వారా సెల్ టవర్ పరిధిలో ఎన్ని మొబైల్ ఫోన్‌లు పనిచేశాయో వాటి సిగ్నల్స్‌ను బట్టి అంచనా వేశారు. ఎన్ని మొబైల్ ఫోన్‌లు ఉంటే అంత మందిగా ప్రాథమిక అంచనా కొస్తారు. ఇదే టెక్నాలజీని ఉపయోగించుకుని మార్చి 10 నుంచి 20 వరకు ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు? ఎవరెవరు ఉన్నారు? వంటి కీలక ఆధారాలు సేకరిం చారు. ఆ ప్రాంతంలో ఉన్న మొబైల్ నెట్‌వర్క్ టవర్ల పరిధిలో మొబైల్ ఫోన్‌ల సిగ్నల్స్‌ను విశ్లేషించారు.
► డిజిటల్ డేటా ఎనాలసిస్ ద్వారా గుర్తించిన వ్యక్తికి చెందిన మొబైల్ సిగ్నల్, కాల్ లిస్ట్‌ను బట్టి ఏ తేదీలో ఎక్కడ ఉన్నాడు? ఆయా తేదీల్లో టవర్ లొకేషన్, అదే టవర్ పరిధిలో ఎంత మంది మొబైల్ ఫోన్‌లు కలిగిన వారున్నారు అనేది ఎనాలసిస్ చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన గుంటూరుకు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో అప్రమత్తమయ్యారు. ఆ వెంటనే చీరాలలో మరో పాజిటివ్ కేసు రావడంతో పోలీసులు వారిద్దరి మొబైల్ నెంబర్‌ల ఆధారంగా డిజిటల్ డేటా విశ్లేషణ చేశారు. వారి కాల్ లిస్ట్ ఆధారంగా వారు ఏయే తేదీల్లో ఏ టవర్ పరిధిలో ఉన్నారు? వారికి సమీపంలో మొబైల్ ఫోన్‌లు కలిగిన వారు ఎంత మంది ఉన్నారు? వారు ఎంత మందితో మాట్లాడారు? వారి ఫోన్ లొకేషన్‌లో ఇంకా ఎన్ని మొబైల్స్ ఫోన్‌లు పనిచేశాయి? వంటి వివరాలు సేకరించారు. ఆయా మొబైల్ ఫోన్ నంబర్ల ఆధారంగా వారి వివరాలను డిజిటల్ డేటా పరిజ్ఞానంతో విశ్లేషించి వివరాలు తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment