ఇకపై ఏయూకి ఏపీ సెట్ బాధ్యతలు | AP set longer in charge of au | Sakshi
Sakshi News home page

ఇకపై ఏయూకి ఏపీ సెట్ బాధ్యతలు

Published Thu, Oct 16 2014 12:52 AM | Last Updated on Fri, Nov 9 2018 4:20 PM

AP set longer in charge of au

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం వివిధ సబ్జెక్టుల వారీగా నిర్వహించే కామన్ ఎలిజిబిలిటీ టెస్టు (సెట్)ను వచ్చే ఏడాదినుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయానికి (ఏయూ) అప్పగించనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కలిపి ప్రస్తుతం ఉస్మానియా వర్సిటీ ఈ సెట్‌ను నిర్వహిస్తోంది. అయితే ఏపీ విద్యార్థులతో కలిపి సెట్‌ను నిర్వహించరాదని రెండు రాష్ట్రాలకు వేర్వేరుగానే సెట్‌లు నిర్వహించాలని  తెలంగాణ ప్రాంత విద్యార్థి సంఘాలు పేర్కొంటున్నాయి. రెండింటికీ కలిపి ఒకే సెట్‌ను నిర్వహిస్తే తమకు అన్యాయం జరుగుతుందని వారు వాదిస్తున్నారు. అయితే ఉన్నత విద్యామండలి అధికారికంగా విభజన కాకపోవడం, యూజీసీ అనుమతి లేకుండా ఇప్పటికిప్పుడు  వేర్వేరుగా సెట్‌లు నిర్వహించేందుకు వీలుకాదని మండలి స్పష్టం చేసి ఒకే సెట్‌కు నిర్ణయించింది.

యూజీసీని కూడా సంప్రదించి గతంలో ఉమ్మడిగా ఉన్నసమయంలో నిర్ణయించిన మేరకు ఆ సంస్థ సూచనలతో ఉస్మానియా వర్సిటీకి బాధ్యతలు అప్పగించింది. సెట్ నిర్వహణకు సంబంధించి యూజీసీ నుంచి అనుమతులు రావడానికి చాలా సమయం పడుతుంది కనుక ఈ ఏడాదికి రెండు రాష్ట్రాలకు కలిపి సెట్‌ను ఉస్మానియా వర్సిటీనే సెట్‌ను నిర్వహిస్తోంది. వచ్చే ఏడాది జనవరి 4న జరిగే సెట్‌కు ఈనెల 10వ తేదీ నుంచి దరఖాస్తులు కూడా స్వీకరిస్తోంది. రెండు రాష్ట్రాలకు కలిపి ఒకేమాదిరి ప్రశ్నపత్రాలతో ఈ పరీక్షలు జరగనున్నాయి. రెండు రాష్ట్రాల అభ్యర్థులకు కలిపి ఉమ్మడి మెరిట్ జాబితాను రూపొందించనున్నారు. ఈసెట్‌ను ఇలా పూర్తిచేసినా  తాజా వివాదాన్ని దృష్టిలో పెట్టుకొని ఇకపై రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా టీఎస్ సెట్, ఏపీ సెట్‌లను నిర్వహించడం మంచిదని ఉన్నత విద్యామండలి వర్గాలంటున్నాయి. ఏపీ సెట్ బాధ్యతను ఏయూకు అప్పగించాలని భావిస్తున్నాయి. దీనిపై కసరత్తు ప్రారంభిస్తే వచ్చే ఏడాది సెట్‌కు యూజీసీ అనుమతులు వస్తాయని అంచనా వేస్తున్నాయి.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement