రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష ఏపీ సెట్‌ను రెండో పర్యాయం ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించనుందని ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు వెల్లడించారు.
30 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష ఏపీ సెట్‌ను రెండో పర్యాయం ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించనుందని ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు వెల్లడించారు. ఏయూ సెనేట్ మందిరంలో బుధవారం ఆయన విలేకరులకు ఈ వివరాలు వెల్లడించారు. ఈ నెల 19న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఈ నెల 30 నుంచి మే 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. రూ.వెయ్యి అపరాధ రుసుంతో మే 17 వరకు, రూ.2 వేల అపరాధ రుసుంతో మే 24 వరకు, రూ.5 వేల అపరాధ రుసుంతో జూన్ 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జూలై 30న ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 31 సబ్జెక్టులలో ఏపీ సెట్ నిర్వహిస్తారు. 8 సబ్జెక్టులకు తెలుగు, ఆంగ్ల భాషల్లో ప్రశ్నపత్రాలను అందిస్తారు.
ఏపీ వ్యాప్తంగా విశాఖ, రాజమహేంద్రవరం, గుంటూరు, అనంతపురం, నెల్లూరు, తిరుపతిలో ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దరఖాస్తు రుసుంగా జనరల్ విభాగంలో రూ.వెయ్యి, బీసీ విద్యార్థులు రూ.800, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ విద్యార్థులు రూ.500 చెల్లించాలి. దరఖాస్తు విధానం, ఫీజు చెల్లించడానికి www.apset.net.in, www.andhrauniverrity.edu.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. విద్యార్థుల సౌలభ్యంకోసం ప్రత్యేకంగా 0891–2730148, 2730147 నంబర్లను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.