తెలంగాణ ఎంసెట్‌లో మన విద్యార్థులే టాప్‌ | AP students are Are the Telangana EAMCET Toppers | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఎంసెట్‌లో మన విద్యార్థులే టాప్‌

Published Mon, Jun 10 2019 4:11 AM | Last Updated on Mon, Jun 10 2019 4:11 AM

AP students are Are the Telangana EAMCET Toppers - Sakshi

కె. రవి

సాక్షి, అమరావతి/సాక్షి, హైదరాబాద్‌/తిరుపతి ఎడ్యుకేషన్‌: తెలంగాణ ఎంసెట్‌–2019 ఫలితాల్లో మన రాష్ట్ర విద్యార్థులు ‘టాప్‌’ లేపారు. ఇంజనీరింగ్, అగ్రి, మెడికల్‌ విభాగాల్లో టాప్‌ ర్యాంకులు సాధించి సత్తా చాటారు. ఇంజనీరింగ్‌ విభాగంలో ఏపీ విద్యార్థులు టాప్‌ టెన్‌లో మొదటి, రెండో ర్యాంకుతో కలిపి మొత్తం ఐదు ర్యాంకులు సాధించి తమ ప్రతిభ చూపారు. అదేవిధంగా అగ్రి, మెడికల్‌ విభాగంలోనూ టాప్‌ టెన్‌లో ఐదు ర్యాంకులు సాధించారు. ఆదివారం హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో విడుదలైన ఈ ఫలితాల్లో ఇంజనీరింగ్‌ విభాగంలో ప్రథమ ర్యాంక్‌ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన కురిశెట్టి రవి శ్రీతేజకు దక్కింది.

ఇదే విభాగంలో రెండో ర్యాంకు విజయవాడకు చెందిన డి.చంద్రశేఖర ఎస్‌ఎస్‌ హేతహవ్యకు, నాలుగో ర్యాంకు నెల్లూరుకు చెందిన బట్టేపాటి కార్తికేయకు, ఐదో ర్యాంకు భీమవరానికి చెందిన గొర్తి భానుదత్తాకు, 8వ ర్యాంకు ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన గౌరుపెద్ది హితేందర్‌ కాశ్యప్‌కు లభించాయి. ఇక అగ్రి, మెడికల్‌ విభాగంలో రాజమహేంద్రవరంకు చెందిన దాసరి కిరణ్‌కుమార్‌రెడ్డి రెండో ర్యాంకును దక్కించుకున్నాడు. ఇదే విభాగంలో మూడో ర్యాంకు కాకినాడకు చెందిన మార్కాని వెంకట సాయి అరుణ్‌తేజకు, నాలుగో ర్యాంకు తిరుపతికి చెందిన సుంకర సాయి స్వాతికి, 8వ ర్యాంకు విశాఖపట్నానికి చెందిన సిద్ధార్థ భరద్వాజ్‌ బృందావనంకు, 9వ ర్యాంకు తిరుపతికి చెందిన పూజకు లభించాయి. అగ్రికల్చర్, మెడికల్‌ విభాగంలో మొదటి ర్యాంకు తెలంగాణకు చెందిన ఎంపటి కుశ్వంత్‌కు దక్కింది. 

ఏపీ ఎంసెట్‌లోనూ అతడే టాప్‌ 
తెలంగాణ ఎంసెట్‌లో ర్యాంకులు పొందిన పలువురు విద్యార్థులు ఇటీవల వెల్లడైన ఏపీ ఎంసెట్‌–2019 ఫలితాల్లోనూ సత్తా చాటడం విశేషం. ఏపీ ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో కురిశెట్టి రవి శ్రీతేజ మొదటి ర్యాంక్‌ దక్కించుకోవడం విశేషం. అదేవిధంగా గొర్తి భానుదత్తా ఏపీ ఎంసెట్‌లో మూడో ర్యాంక్‌ పొందాడు. అలాగే ఏపీ ఎంసెట్‌లో అగ్రి, మెడికల్‌ విభాగంలో రెండో ర్యాంక్‌ దక్కించుకున్న దాసరి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ఎంసెట్‌లోనూ అదే స్థానంలో నిలిచాడు. అదేవిధంగా తిరుపతికి చెందిన సుంకర స్వాతి ఏపీ ఎంసెట్‌ మెడికల్‌ విభాగంలో మొదటి ర్యాంకు దక్కించుకుంది. 

ఈ నెల 20 తర్వాత ఇంజనీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ 
తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలను విడుదల చేసిన ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 20 తర్వాత ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామన్నారు. జేఎన్‌టీయూ, ఉస్మానియా, కాకతీయ వర్సిటీల పరిధిలో ఇంజనీరింగ్‌లో 90 వేల వరకు సీట్లు ఉన్నాయన్నారు. ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ యాదయ్య మాట్లాడుతూ ఎంసెట్‌ ప్రాథమిక ‘కీ’లపై అభ్యంతరాలను స్వీకరించగా 330 అభ్యంతరాలు వచ్చాయన్నారు. వాటిని నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో పరిశీలించి ఫైనల్‌ ‘కీ’ని విడుదల చేశామన్నారు. 

ఏపీ ఎంసెట్‌ ప్రవేశాలపై అధికారుల మల్లగుల్లాలు 
ఏపీ ఎంసెట్‌ ఫలితాలు వెలువడినా ప్రవేశాలకు షెడ్యూల్‌ ఖరారుపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నెల 18 లోపు ప్రవేశాలు కల్పించాలని భావించినా అందుకు సమయం చాలకపోవచ్చని అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ కాలేజీల అఫ్లియేషన్‌కు సంబంధించిన ప్రక్రియను కాకినాడ జేఎన్‌టీయూ, అనంతపురం జేఎన్‌టీయూలు కొనసాగిస్తున్నాయి. ఈ ప్రక్రియ ముగియడానికి మరో నాలుగు రోజులు పడుతుంది. అలాగే జేఈఈ మొదటి విడత ప్రవేశాలు చేపడితే జేఈఈతోపాటు ఎంసెట్‌లో టాప్‌ ర్యాంకులు సాధించినవారు ఐఐటీ, ఎన్‌ఐటీ ఇతర జాతీయ విద్యాసంస్థల్లో చేరతారు. అది పూర్తయ్యాక ఎంసెట్‌ ప్రవేశాలు ప్రారంభించాలన్న ఆలోచనతో ఉన్నత విద్యామండలి అధికారులు ఉన్నారు. అయితే.. ఇప్పటికే ప్రవేశాలు ఆలస్యమయ్యాయని, జేఈఈ ప్రవేశాల కంటే ముందే వీటిని ప్రారంభించడం మంచిదన్న అభిప్రాయంతో సాంకేతిక విద్యా శాఖ ఉంది. మొదటి విడతలో సీట్లు పొంది చేరని వారుంటే ఆ స్థానాల్లో రెండోసారి కౌన్సెలింగ్‌ సమయంలో అందరికీ అవకాశం కల్పిస్తే సరిపోతుందన్న ఆలోచనతో ఉంది. దీన్ని విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్‌ దృష్టికి తెచ్చి ఆయన సూచనల మేరకు ముందుకు వెళ్తామని మండలి వర్గాలు వివరించాయి. 

పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తా 
మాది కాకినాడ. నేను నీట్‌లో 1,292వ ర్యాంక్, ఏపీ ఎంసెట్‌లో 107వ ర్యాంకు సాధించాను. జాతీయ వైద్య విద్య కళాశాలల్లో చదువుకుని పేద ప్రజలకు సేవలందిస్తాను. 
–ఎం.వెంకట అరుణ్‌ తేజ, తెలంగాణ ఎంసెట్‌ అగ్రికల్చర్, మెడిసిన్‌ విభాగం మూడో ర్యాంకర్‌

ఐఐటీలో సీటు సాధిస్తా.. 
నాకు ఇంటర్‌లో 985 మార్కులొచ్చాయి. ఏపీ ఎంసెట్‌లో నాలుగో ర్యాంకు వచ్చింది. జేఈఈ మెయిన్‌లో 33వ ర్యాంకు వచ్చింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నా. ఐఐటీలో సీటు సాధిస్తా. 
– చంద్రశేఖర ఎస్‌ఎస్‌ హేతహవ్య, తెలంగాణ ఎంసెట్‌ (ఇంజనీరింగ్‌) రెండో ర్యాంకర్‌ 

ఐఐటీయే లక్ష్యం 
మా నాన్న సురేష్‌ నాయుడు ఆక్వా రైతు, అమ్మ అమరావతి గృహిణి. పదో తరగతిలో 10 గ్రేడ్‌ పాయింట్లు సాధించా. ఇంటర్‌లో 981 మార్కులు వచ్చాయి. ఏపీ ఎంసెట్‌లో, జేఈఈ మెయిన్‌లో 5వ ర్యాంకు సాధించా. ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యం. 
– బట్టేపాటి కార్తికేయ, తెలంగాణ ఎంసెట్‌ (ఇంజనీరింగ్‌) నాలుగో ర్యాంకర్‌ 

పరిశోధనలంటే ఇష్టం.. 
మా నాన్న నాగ వెంకట విశ్వనాథం ప్రైవేటు ఉద్యోగి. అమ్మ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. పదో తరగతిలో, ఇంటర్‌లో 10 జీపీఏ సాధించా. ఏపీ ఎంసెట్‌లో, జేఈఈ మెయిన్‌లో 3వ ర్యాంకు వచ్చింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల కోసం చూస్తున్నా. నాకు పరిశోధనలంటే ఇష్టం. 
– భాను దత్త, తెలంగాణ ఎంసెట్‌ (ఇంజనీరింగ్‌) 

ఐదో ర్యాంకర్‌ సివిల్స్‌ సాధిస్తా.. 
నా తల్లిదండ్రులు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు.  జేఈఈ మెయిన్‌లో 125వ ర్యాంకు సాధించా. సివిల్స్‌లో విజయం సాధించడమే నా లక్ష్యం. 
– గౌరిపెద్ది హితేందర్‌ కాశ్యప్, తెలంగాణ ఎంసెట్‌ (ఇంజనీరింగ్‌) ఎనిమిదో ర్యాంకర్‌  

కార్డియాలజిస్టునవుతా.. 
నాన్న సూర్యభాస్కర రెడ్డి రైల్వే ఉద్యోగి. అమ్మ విజయశాంతి గృహిణి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇచ్చిన స్ఫూర్తితో తెలంగాణ ఎంసెట్‌లో రెండో ర్యాంక్‌ సాధించగలిగాను. పదో తరగతిలో, ఇంటర్మీడియట్‌లో పదికి పది జీపీఏ సాధించాను. ఏపీ ఎంసెట్‌లో కూడా రెండో ర్యాంక్‌ వచ్చింది. కార్డియాలజిస్టునవుతా. 
– దాసరి కిరణ్‌కుమార్‌ రెడ్డి, తెలంగాణ ఎంసెట్‌ అగ్రికల్చర్, మెడిసిన్‌ విభాగం రెండో ర్యాంకర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement