మందులోడా.. ఓరి మాయలోడా! | AP to offer inferior drugs to msids | Sakshi
Sakshi News home page

మందులోడా.. ఓరి మాయలోడా!

Published Fri, Sep 12 2014 1:39 AM | Last Updated on Fri, May 25 2018 2:38 PM

మందులోడా.. ఓరి మాయలోడా! - Sakshi

మందులోడా.. ఓరి మాయలోడా!

ప్రజలకు నాసిరకం మందులు అందిస్తున్న ఏపీఎంఎస్‌ఐడీసీ
ఏడాదిలో నాసిరకం అని తేల్చిన మందులు 23 రకాలు
ఆర్టీఐ దరఖాస్తుతో అవినీతి  బట్టబయలు

 
హైదరాబాద్: రోగులకు నాణ్యమైన మందులను సరఫరా చేయాల్సిన సర్కారే నాసిరకం మందులు మింగిస్తూ వారి ప్రాణాలతో ఆడుకుంటోంది. మందుల సరఫరాదార్లతో కుమ్మక్కైన అధికారులు నాసిరకం మందులను ఇష్టారాజ్యంగా ఆస్పత్రులకు సరఫరా చేస్తున్నారు. అవి నాసిరకమని పరీక్షల్లో తేలినా వెనక్కు తెప్పించలేదు, ఒక్క కంపెనీని కూడా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టలేదు. పైగా ఆ మందులు మంచివని డ్రగ్ ఇన్‌స్పెక్టర్లతో సర్టిఫికెట్లు ఇప్పించి మరీ ప్రజలతో మింగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీ) సీలో జరిగిన ఈ భారీ అవినీతి ‘సాక్షి ప్రతినిధి’ సమాచారం హక్కు చట్టం (ఆర్టీఐ)ద్వారా సేకరించిన సమాచారంతో బట్టబయలైంది. ఏపీఎంఎస్‌ఐడీసీ సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు 2014లో సరఫరా చేసిన మందుల్లో 23 రకాల మందులు నాసిరకం అని తేలాయి. ఇందులో రోజూ లక్షలాది మంది బీపీకి వాడే అటెన్‌లాల్ ఐపీ 50 ఎంజీ, కడుపునొప్పి నియంత్రణకు వాడే డైసైక్లోమైన్ 10 ఎంజీ తదితర మందులను ఎలాంటి పరీక్షలు లేకుండానే జనంలోకి పంపుతున్నారు. ఇవి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, తూర్పు గోదావరి, మెదక్ జిల్లాల్లో ఎక్కువ వినియోగమైనట్టు తేలింది.

అవినీతి బట్టబయలు

సమాచార హక్కు చట్టం ద్వారా కొన్ని వివరాలు సేకరించగా, అధికారులు, కాంట్రాక్టర్ల బండారం బయటపడింది. ఇలాంటివి కొన్ని పరిశీలిస్తే....

►రక్తపోటు నియంత్రణకు ఉపయోగించే అటెన్‌లాల్ 50 ఎంజీ ట్యాబ్‌లెట్ (గ్రీన్‌ల్యాండ్ ఆర్గానిక్స్) బీటీహెచ్ అనే లేబరేటరీకి పరీక్షలకు పంపిస్తే 2013 ఫిబ్రవరి 4న నాసిరకం అని తేలింది. అయితే అదేనెల 18వ తేదీన ఓ డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌తో నాణ్యమైనవని చెప్పించుకుని మందుల సరఫరా కొనసాగించారు.

► కడుపునొప్పి నియంత్రణకు ఉపయోగించే డైసైక్లోమైన్ 10 ఎంజీ మాత్రలు డీసీఎల్ లేబరేటరీకి పంపించగా 2013 జులై 15న నాసిరకం అని తేలింది. ఆ తర్వాత దీన్ని కోల్‌కతాలోని సీడీఎల్‌కు లేబరేటరీకి పంపించి మంచివని తేల్చారు.

►మానసిక రోగులకు ఇచ్చే కార్బమొజెపైన్100 ఎంజీ మాత్రలు డీసీఎల్ లేబరేటరీకి పరిశీలనకు పంపిస్తే 2013 జులై 25న నాసికరం అని తేల్చా రు. కానీ ఈ కంపెనీని ఎందుకు బ్లాక్‌లిస్టులో పెట్టలేదని ఆర్టీఐ కింద అడిగితే.. 14 నెలలుగా ఫైలు సర్క్యులేషన్‌లో ఉందని సమాధానమిచ్చారు.

► పెయిన్ కిల్లర్‌గా వాడే డైక్లొఫినాక్ సోడియం 50 ఎంజీ మాత్రలు నాసిరకమని 2013జులై 25న డీసీఎల్ లేబరేటరీ తేల్చింది. ఈ కంపెనీని కూడా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టే విషయంలో 14 నెలలుగా ఫైలు ప్రాసెస్‌లో ఉందని చెబుతున్నారు.

►పైన పేర్కొన్న అన్ని మాత్రలు నాసిరకం అని తేలాక కూడా ఆ బ్యాచ్‌లకు సంబంధించిన ఒక్క మాత్రను వెనక్కు తెప్పించకపోగా, అన్నిటినీ రోగులకు ఇచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement