'టీడీపీది విజయయాత్ర కాదు విఫలయాత్ర'
హైదరాబాద్: రైతులు, మహిళలను చంద్రబాబు హామీ నట్టేట ముంచిందని ఏపీసీసీ సీనియర్ కాంగ్రెస్ నేత డాక్టర్ ఎన్.తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను, మహిళలను రుణమాఫీ పేరుతో దారుణంగా మోసగించిన టీడీపీ ప్రభుత్వం రుణమాఫీ విజయయాత్ర చేయాలని పూనుకోవడం హాస్యాస్పదమని ఏపీసీసీ సీనియర్ కాంగ్రెస్ నేత డాక్టర్ ఎన్.తులసిరెడ్డి విమర్శించారు. రుణమాఫీ విజయయాత్రకు బదులుగా విఫలయాత్ర చేస్తే బాగుంటుందని ఆయన సూచించారు. తులసిరెడ్డి గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో.. అధికారంలోకి రాకముందు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిందొకటి వచ్చాక చేసిందొకటి అని విమర్శించారు.
టీడీపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించిందని పేర్కొనడంతో పాటుగా రైతుల రుణమాఫీపై తొలి సంతకం చేస్తామని చెప్పారని, అలాగే డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలన్నింటినీ కూడా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అయితే మేనిఫెస్టోలో ఎలాంటి షరతులు పేర్కొనలేదని కూడా ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు పదకొండు నెలల పాలన తరువాత రుణమాఫీ వ్యవహారాన్ని పంచపాండవులు మంచం కోళ్ల వలె ముగ్గురు అని రెండు వేళ్లు చూపించి బోర్డు మీద ఒకటి అని రాసేసి తుడిచేసినట్లుగా చేశారని ఆయన ఎద్దేవా చేశారు.