'రాహుల్ నేతృత్వంలో రెండో స్వాతంత్య్ర పోరాటం'
హైదరాబాద్ :
నాడు ఆంగ్లేయులను క్విట్ ఇండియా చేసినట్లే నేడు బీజేపీని క్విట్ ఇండియా, టీడీపీని క్విట్ ఆంధ్రా చేయాల్సిన చారిత్రక ఆవశ్యకత ఉందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(ఏపీసీసీ) పేర్కొంది. అందుకు ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ నేతృత్వంలో రెండవ స్వాతంత్య్ర పోరాటం జరుగుతోందని తెలిపింది. జాతిపిత గాంధీ 69వ వర్థంతి సందర్భంగా హైదరాబాద్లోని ఇంధిరాభవన్లో ఏపీసీసీ నాయకులు మహాత్ముని చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షులు మాదాసు గంగాధరం, మాజీ మంత్రి శైలజానాథ్, ఉపాధ్యక్షులు ఎం సూర్యనాయక్, ప్రధాన కార్యదర్శులు గిడుగు రుద్రరాజు, జంగా గౌతమ్, రవిచంద్రారెడ్డి, కాంగ్రెస్ నాయకులు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గాంధీ భౌతికంగా మన మధ్యలేకున్నా ఆయన భావజాలం నిరంతరం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటుందని ఏపీసీసీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది.
'మహాత్మా గాంధీ ప్రపంచంలోనే ఓ విలక్షణ నాయకుడు. ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్క మహాత్ముడు ఆయనే గాంధీ. 69 సంవత్సరాల క్రితం ఇదే రోజు నాధూరాం గాడ్స్ జరిపిన కాల్పుల్లో మహాత్ముడు బలి అయ్యారు. అశాంతి, అసహనం, హింసా ప్రవృత్తితో అల్లాడుతున్న నేటి ప్రపంచానికి గాంధీ మార్గమే శ్రీరామరక్ష. సత్యం, అహింసా, సత్యాగ్రహం, అనే ఆయుధాల ద్వారా ఒక సామాన్యుడు కూడా అసమాన్యుడు కాగలడని మోహన్ దాస్ కరంచంద్ గాంధీ నిరూపించారు. మహాత్ముడు 1924-25 మధ్య భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉండటం ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు గర్వకారణం. నేడు దేశంలో గాంధీ వారసులకు గాడ్సే వారసులకు మధ్య రాజకీయ పోరు సాగుతోంది. అంతిమ విజయం గాంధీ వారసులదే అవుతుంది.
బీజేపీ ముక్త భారత్...టీడీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ తధ్యం. ఈ పోరాటంలో కాంగ్రెస్ శ్రేణులు వీరసైనికుల్లాగా పోరాడాలి. ఇదే మహాత్మునికి తాము అర్పించే నిజమైన నివాళి' అని ఏపీసీసీ పేర్కొంది.