ఇన్‌చార్జి డీఎస్పీ నాగేశ్వర రెడ్డితో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు
వైఎస్‌ఆర్ జిల్లా, మంగంపేట(ఓబులవారిపల్లె): కొన్ని సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగంపేట నిర్వాసితులు సోమవారం చేపట్టిన రిలే నిరాహార దీక్షలను ఏపీఎండీసీ అధికారులు పోలీసుల సాయంతో అడ్డుకున్నారు. దీక్షలకు మద్దతు ప్రకటించేందుకు వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ వత్తలూరు సాయికిశోర్‌రెడ్డితో కలిసి బయలుదేరిన ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, వైఎస్సార్‌సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబులను సైతం మార్గమధ్యంలోనే అడ్డుకోవడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు రెండు వందల మంది పోలీసు బలగాలను మోహరించి మంగంపేట పరిపాలన భవనం దారులన్నీ దిగ్బంధం చేసి అటువైపు ఎవరినీ అనుమతించలేదు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ ఏపీఎండీసీ ఎండీ వెంకయ్య చౌదరి ఓ ప్రభుత్వ అధికారిలా వ్యవహరించడం లేదని టీడీపీ నాయకుడిలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఏపీఎండీసీ ఎండీ మాటలు విని పోలీసులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసేందుకు సిద్ధపడ్డారా అని ప్రశ్నించారు. రిలే నిరాహారదీక్షల ద్వారా గ్రామాల ప్రజలు తమ సమస్యలు పరిష్కరించమని కోరడం తప్పా అని నిలదీశారు. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాల్సిన ఏపీఎండీసీ ఎండీ వెంకయ్యచౌదరి అందుకు విరుద్ధంగా తెలుగుదేశంపార్టీ నాయకుడిలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.
అతని మాటలు విని ప్రజా ప్రతినిధి అయిన తనను పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. వైఎస్సార్‌సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు మాట్లాడుతూ మంగంపేట నిర్వాసితుల రిలేనిరాహారదీక్షలను అడ్డుకునేందుకు ఏపీఎండీసీ ఎండీ వెంకయ్యచౌదరి ఇంతమంది పోలీసులను మోహరించి భగ్నం చేయడం అప్రజాస్వామ్యం అన్నారు. మంగంపేట ఏపీఎండీసీ ప్రారంభం అయిన నాటినుంచి వచ్చిన ఎండీలు ప్రజల సమస్యలు విని వాటినిపరిష్కరించే వారని, అయితే ప్రస్తుతం ఉన్న ఎండీ ప్రజల సమస్యలు సంవత్సరాలుగా పరిష్కారం చేయకుండా, న్యాయం చేయమని అడిగిన ప్రజలను అణగదొక్కేందుకు పోలీసుల సహకారం తీసుకోవడం తగదన్నారు. నిర్వాసితుల సంఘం ప్రతినిధి గల్లా శ్రీనివాసులు మాట్లాడుతూ తాము న్యాయపరంగానే ముందుకు వెళతామని మంగంపేట గనుల్లో ఏ విధంగా మైనింగ్ చేస్తారో చూస్తామన్నారు. కౌలూరు మధురెడ్డి మాట్లాడుతూ తమ డిమాండ్‌లు పరిష్కారం అయ్యేవరకు పోరాటం సాగిస్తామని తెలిపారు. మంగంపేట కాపుపల్లె, దళితవాడ, అరుంధతీవాడ గ్రామాల ప్రజలను ఏపీఎండీసీ కార్యాలయానికి వెళ్లకుండా పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకోవడంతో గుత్తిరెడ్డి హరినాథ్‌రెడ్డి, పులపత్తూరు రామసుబ్బారెడ్డి తదితర నాయకులు గ్రామాల ప్రజలతో కలిసి రోడ్డుపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
ఏపీఎండీసీ ఎండీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మంగంపేట, కాపుపల్లె, దళితవాడ, అరుంధతీవాడ, అగ్రహారం గ్రామస్తులకు 2013 ఆర్‌ఆర్ చట్టం ప్రకారం పునరావాసం కల్పించాలని, భూసేకరణలో జరిగిన తప్పులను సవరించాలని, నిర్వాసితులకు ఒప్పందం ప్రకారం డీజెడ్‌లు, ఇంటిపట్టాలు, ఉద్యోగభద్రత, కల్పించాలని డిమాండ్ చేశారు. ఏపీఎండీసీ కార్యాలయం వైపు దూసుకెళుతున్న మహిళలు, గ్రామస్తులు, నాయకులను రాజంపేట ఇన్‌చార్జి డీఎస్పీ నాగేశ్వరరెడ్డి సిబ్బందితో కలిసి అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గల్లా శ్రీనివాసులు, గుత్తిరెడ్డి హరినాథ్‌రెడ్డి, పులపత్తూరు రామసుబ్బారెడ్డి, వడ్డి సుబ్బారెడ్డి, కౌలూరు మధుసూదన్‌రెడ్డి, పోతుల లక్ష్మీనారాయణ, మధురెడ్డి, కౌలూరు బ్రహ్మానందరెడ్డి మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని పుల్లంపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నాయకులను అదుపులోకి తీసుకున్న వెంటనే కాపుపల్లె, దళితవాడ, అరుంధతీవాడ గ్రామాల ప్రజలు, మహిళలు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. దీంతో డీఎస్పీ నాగేశ్వర్‌రెడ్డి వారితో మాట్లాడి శాంతపరిచారు. కోర్టు ఉత్తర్వుల మేరకు రిలేనిరాహారదీక్షలు కొనసాగిస్తామని నిర్వాసితుల సంక్షేమసాధన కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. మంగంపేట లారీ, టిప్పర్ అసోసియేషన్ స్వచ్ఛందంగా రిలే నిరాహారదీక్షలకు మద్దతుగా లారీలను నిలిపివేసింది. అంతేకాకుండా త్రివేణీ ఎర్త్‌మూవర్స్‌లో పనిచేస్తున్న స్థానికులు కూడా రిలేనిరాహార దీక్షలకు మద్దతుగా తమ విధులను బహిష్కరించారు.
ప్రభుత్వ వైఖరితోనే మంగంపేట వాసులకు అన్యాయం
రైల్వేకోడూరు అర్బన్: రాష్ట్ర ప్రభుత్వ వైఖరితోనే మంగంపేట ముగ్గురాయి గనులలో పనిచేసే కార్మికులు, మిల్లుల యజమానులు, భూములిచ్చిన స్థానికులకు అన్యాయం జరుగుతోందని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఓబులేసు విమర్శించారు. స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం బాధ్యత విస్మరించి పరిపాలిస్తోందన్నారు. మిల్లులకు ప్రభుత్వ ముగ్గురాయి గతంలో లాగా సక్రమంగా సరఫరా చేసి ఉంటే మిల్లులు మూత పడే పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. తక్షణం ప్రభుత్వం స్పందించి గనులశాఖ మంత్రి, రెవెన్యూ మంత్రి, గ్రామ పరిరక్షణ కమిటీ, కార్మిక నాయకులు సమావేశమై చర్చలు జరిపి న్యాయం చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment