వైఎస్‌ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు : గుంటూరులో జరిగిన నారా హమారా – టీడీపీ హమారా సభలో 8 మంది ముస్లిం యువకులపై అక్రమ కేసులు బనాయించినందుకు నిరసనగా గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్థానిక పుట్టపర్తి సర్కిల్‌లో సామూహిక రిలే నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ఆయన బుధవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. ఈ దీక్షకు రిటైర్డు డీఐజీ ఇక్బాల్, మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, కడప నియోజకవర్గ ఎమ్మెల్యే అంజాద్‌బాషా, వైఎస్సార్‌సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్‌బాబు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. ఇక్బాల్ ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్షలో ఉంటారన్నారు.
గుంటూరులో ముస్లిం మైనారిటీ సదస్సు ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలను పిలిపించుకుని గత నాలుగేళ్లుగా ముస్లింల కుటుంబాలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోనందు వల్ల ముస్లిం యువకులు శాంతియుతంగా తాము ఉన్న స్థానంలో నుంచే ప్లకార్డుల ద్వారా ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేశారన్నారు. అందుకు సీఎం చంద్రబాబు కోపోద్రిక్తుడై తన తప్పులను వేలెత్తి చూపారనే ఉక్రోశంతో కేవలం ప్రశ్నించిన పాపానికి ఆ యువకుల పెడరెక్కలు విరచి కుక్కల్లాగా పోలీస్‌స్టేషన్‌కు ఈడ్చుకుపోయి, అర్ధనగ్నంగా లాఠీలతో, బూటు కాళ్లతో విచక్షణ రహితంగా కొట్టారని తెలిపారు. కొట్టింది పోలీసులే అయినా, కొట్టించింది ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు అని అన్నారు. బలమైన సెక్షన్లు పెట్టి కేసులు నమోదు చేశారన్నారు. దేశద్రోహం, ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర, సభను విధ్వంసం చేయడానికి ప్రయత్నించారని 505, 505(2), 120బీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారన్నారు.
రాష్ట్ర చరిత్రలోనే ప్రథమం
ఇలాంటి కేసులు పెట్టడం ఈ రాష్ట్ర చరిత్రలోనే ప్రథమమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎన్నో సభల్లో పౌరులు ప్లకార్డులను ప్రదర్శించి నిరసన తెలియజేశారన్నారు. అలాంటి వారిని పోలీసులు తాత్కాలికంగా అరెస్టు చేసి సభ అయిపోయిన తర్వాత 165 సెక్షన్ కింద స్టేట్‌మెంట్ నమోదు చేసుకుని ఇంటికి పంపేవారన్నారు.
అయితే ఈ ప్రభుత్వం మాత్రం ముస్లిం యువకులను కొట్టడం, దేశద్రోహం, విధ్వంసకర సంఘటనలకు సంబంధించిన బలమైన సెక్షన్లను నమోదు చేయడం ఇదే ప్రథమమని తెలిపారు. ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికే చెల్లుతుందన్నారు. ముస్లింలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడం ఓ తప్పు అయితే వారిని సభకు పిలిపించుకుని అవమానం చేసి సబ్ జైలుకు పంపడం మరో పెద్ద తప్పన్నారు. చంద్రబాబు చేసిన ఈ సంఘటనలకు ఏ ముస్లిం సోదరుడు కూడా క్షమించరన్నారు. ఎన్నికల్లో తప్పక శిక్షిస్తారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలు జీవించాలంటే ప్రజాస్వామ్యం బతకాల్సిన అవసరం ఉందని, ప్రజా స్వామ్యం బతకాలంటే చంద్రబాబు దిగిపోవాల్సిందేనని ఎమ్మెల్యే అన్నారు. ప్రజల పట్ల, ప్రజల హక్కుల పట్ల గౌరవం కలిగిన ఎమ్మెల్యేగా ఈ ప్రభుత్వం చేసిన పనికి సిగ్గుపడుతూ ముస్లిం కుటుంబాలకు జరిగిన అన్యాయానికి విచారం వ్యక్తం చేస్తున్నానన్నారు. చేసిన పనికి సిగ్గుపడకుండా ప్రభుత్వం అహంభావపూరితంగా వ్యవహరిస్తుండటంతో గురువారం సామూహిక రిలే నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించామన్నారు. దీక్షకు వందలాది మంది ప్రజా స్వామ్య వాదులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు హాజరవుతారని చెప్పారు.ప్రతి ఒక్కరూ ఈ దీక్షకు సంఘీభావం తెలపాలని, ప్రజా స్వామ్యం వైపు నిలబడి పోరాటం చేయాలని ఆహ్వానిస్తున్నానన్నారు. నా వినయ పూర్వక విజ్ఞప్తిని స్వీకరించి తనను బలపరుస్తారని ఆకాంక్షిస్తున్నానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment