సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల నియామక ప్రక్రియ ఊపందుకుంది. 1,225 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, 19 డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి సెప్టెంబర్‌లో వైద్య ఆరోగ్యశాఖ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడినా.. నిబంధనల ప్రకారం వైద్యుల భర్తీ ప్రక్రియను నవంబర్‌లో పూర్తి చేసేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు 12 వేల దరఖాస్తులు రాగా, డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు 3 వేల దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల పరిశీలనకు ఆరోగ్యశాఖ 10 కమిటీలను నియమించింది.
ఇప్పటివరకూ సుమారు 7 వేల దరఖాస్తుల పరిశీలన పూర్తయినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. మిగిలిన దరఖాస్తుల పరి శీలనను నెలాఖరుకు పూర్తిచేసి, నవంబర్ మొదటి వారంలో పోస్టులు భర్తీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. అయితే, రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో భర్తీ, పోస్టింగ్‌లు ఎలా ఉంటాయోనని అభ్యర్థులు కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆరు సూత్రాల పథకం, రాష్ట్రపతి ఆదేశాలు, రిజర్వేషన్లు, జోనల్ రిప్రజెంటేషన్ అన్నీ పరిగణనలోకి తీసుకునే పోస్టింగ్‌లు ఇస్తామని ఉన్నతాధికారి చెప్పారు.