బ్యాంకు అప్రైజరే దొంగ!:మహేష్ బ్యాంకు చోరీ కేసు
హైదరాబాద్: ఏఎస్ నగర్లోని మహేష్ కో అపరేటివ్ బ్యాంక్ చోరీ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు బ్యాంకు అప్రైజర్ బ్రహ్మచారి, అతని భార్య, కుమారుడిని పో్లీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 4 కోట్ల 50 లక్షల రూపాయల విలువైలన 15కిలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
కేసు వివరాలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఈరోజు విలేకరులకు తెలిపారు. చోరీ సమయంలో నిందితుడు బ్యాంకులోని ఇతర అర్మరాలను ముట్టుకోకుండా, బంగారం తాకట్టు పెట్టే అర్మరాను మాత్రమే ముట్టుకున్నట్లు చెప్పారు. రెండు తాళం చేతులతో లాకర్లు తెరిచి నగలు ఎత్తుకెళ్లారు. దాంతో బ్యాంకు గురించి, లోపలి పరిసరాల గురించి బాగా తెలిసిన వారే చోరీకి పాల్పడినట్లు తాము అనుమానించినట్లు తెలిపారు. తొలుత బ్యాంకు సిబ్బంది అందరిపైన, బ్యాంకులో ఉద్యోగం మానివేసి వెళ్లినవారిపై కూడా నిఘా పెట్టామని చెప్పారు. ఈ కేసు విచారణలో బ్యాంకులోని సిసి కెమెరా పుటేజీలు బాగా ఉపయోగపడినట్లు తెలిపారు.
నెల రోజుల సిసి కెమెరా పుటేజీలను పరిశీలించినట్లు చెప్పారు. సిసి కెమెరా పుటేజీలలో నగలు దోచుకువెళ్లిన వ్యక్తి స్పష్టంగా కనిపించలేదు. అయితే అతని ఎత్తు, శరీ దారుఢ్యం ఆధారంగా ఆ వ్యక్తిని గుర్తించినట్లు తెలిపారు. ఒరిజినల్ తాళం చేతులు లేకుండా మారు తాళాలు తయారు చేయడం సాధ్యం కాదని ఆ తాళాలు తయారు చేసిన కంపెనీవారు తెలిపినట్లు చెప్పారు. మొత్తం ఏడు తాళాలు, రెండు సెట్లు ఉన్నాయి. బ్యాంకు పనిచేసే సమయంలో ఒరిజినల్ తాళాలను సీనియర్ అకౌంటెంట్ పక్కనున్న సొరుగులో నుంచి ఓ వ్యక్తి తీసిన దృశ్యాలు కూడా సిసి కెమెరాలో కనిపించాయి. ఆ వ్యక్తి తాళాల సెట్ తీసుకొని బాత్ రూమ్లోకి వెళ్లినట్లు ఆ దృశ్యాల ద్వారా తెలుసుకున్నట్లు కమిషనర్ చెప్పారు. సీనియర్ అకౌంటెంట్ సీటు పక్కనే అప్రైజర్ బ్రహ్మచారి కూర్చుంటాడు. అతనే ప్రధాన నిందితుడని పోలీస్ కమిషనర్ ఆనంద్ చెప్పారు. కీసర మండలం మాదాపురం గ్రామంలో బ్రహ్మచారి భార్య, కొడుకు ఉంటారు. వారికి అన్ని విషయాలు తెలుసునన్నారు. చోరీ చేసిన తరువాత బ్యాగ్ను కూడా వారే తీసుకువెళ్లినట్లు తెలిపారు. ఈ చోరీకి నిందితుడు ఆరు నెలల క్రితమే పక్కా ప్రణాళిక రూపొందించినట్లు ఆయన చెప్పారు.