నచ్చిన రంగంలోనే మెచ్చుకోలు
- పిల్లల అభిరుచులను తల్లిదండ్రులు గౌరవించాలి
- ‘శ్రీప్రకాష్’ ముఖాముఖిలో సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్
పాయకరావుపేట, న్యూస్‌లైన్: యువత ఆశయాలకు తగ్గట్లుగా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే సత్ఫలితాలు వస్తాయని ప్రముఖ సినీ గేయ రచయిత చేగొండి అనంత్ శ్రీరామ్ అన్నారు. పాయకరావుపేట శ్రీప్రకాష్ విద్యా సంస్థలో బుధవారం సాయంత్రం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అనంత్ శ్రీరామ్ విద్యార్థులు సంధించిన పలు ప్రశ్నలకు బదులిస్తూ.. అబ్బాయి డాక్టర్, అమ్మాయి ఇంజనీర్ కావాలన్న దృక్పథంతో తల్లిదండ్రులు ఉండటంవల్ల 20 ఏళ్లపాటు అభివృద్ధి జరగలేదన్నారు.
ప్రతి విషయంపై అవగాహన ఉంటే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చునన్నారు. ఎవరికి ఇష్టమైన వృత్తి వారు ఎంచుకుంటే 75 శాతంమంది సంతోషంగా ఉంటారన్నారు. ఇదే దృక్పథంతో ఇంజనీరింగ్ విద్య మధ్యలో మానివేసి ఫిల్మ్ ఇండస్ట్రీకి పదేళ్ల క్రితం వచ్చానన్నారు. ఇప్పటి వరకు 558 పాటలు రచించానని, మొదటి సినిమాతోనే సింగిల్ కార్డు రచయితగా నిలిచానన్నారు. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్, టీఆర్‌ఎస్, లోక్‌సత్తా పార్టీలకు ప్రచార గీతాలు రాశానన్నారు.
ప్రస్తుత రాజకీయాలు తప్పును ప్రోత్సహిస్తున్నాయని, ఓట్లు అమ్ముడుపోవడం విచారకరమన్నారు. ప్రతి విద్యార్థి పదిమందిలో మార్పు తీసుకువస్తే చాలావరకూ వ్యవస్థ బాగుపడుతుందన్నారు. అనంతరం శ్రీప్రకాష్ విద్యా సంస్థల జాయింట్ సెక్రటరీ సీహెచ్ విజయ్ ప్రకాష్ అనంత్ శ్రీరామ్‌కు జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో వేటూరి సేవాపీఠం వ్యవస్థాపక కార్యదర్శి కె.ఆర్.జె.శర్మ తదితరులు పాల్గొన్నారు.