![Approval of Lokayukta Amendment Bill - Sakshi](/styles/webp/s3/article_images/2019/07/27/sfvbbb.jpg.webp?itok=HhmQyIf1)
సాక్షి, అమరావతి: విపక్షం నిరసనలు, వాకౌట్ మధ్య ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త సవరణ బిల్లు – 2019ను శాసనసభ శుక్రవారం ఆమోదించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దూరదృష్టి, పారదర్శక పాలనకు ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులే నిదర్శనమని అధికారపక్ష సభ్యులు ప్రశంసించారు. లోకాయుక్త, న్యాయ పరిశీలన బిల్లుల ద్వారా ముఖ్యమంత్రి దేశానికే ట్రెండ్ సెట్టర్‌లా చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. లోకాయుక్త సవరణ బిల్లును ముఖ్యమంత్రి తరఫున డిప్యూటీ సీఎం, రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ సభలో ప్రవేశపెట్టారు. అనంతరం ఆర్థిక, శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బిల్లును ప్రతిపాదించగా సభ్యుల హర్షధ్వానాల మధ్య సభ ఆమోదించింది. బిల్లు గురించి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సభ్యులకు వివరించారు.
సుపరిపాలన దిశగా ఆదర్శవంతమైన బిల్లులు..
ఒకవైపు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం అద్భుతమైన చట్టాలు తెస్తూ మరోవైపు అవినీతి నిర్మూలన, సుపరిపాలన కోసం ముఖ్యమంత్రి ఆదర్శవంతమైన బిల్లులు ప్రవేశపెడుతున్నారని ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తెలిపారు. ‘గత ప్రభుత్వం కనీసం సమాచార ప్రధాన కమిషనర్‌ను కూడా నియమించలేదు. ఇటీవల వరకు కమీషనర్లను సైతం నియమించలేదు. గిరిజన సలహా మండలి లేదు. చివరివరకు మైనారిటీలకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదు’ అని పేర్కొన్నారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తుల కొరత ఉన్నందున వీరి స్థానంలో హైకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులను లోకాయుక్తగా నియమించుకోవడం కోసం చట్ట సవరణ అవసరమన్నారు. రిటైర్డ్ న్యాయమూర్తులు అందుబాటులో ఉన్నందున లోకాయుక్త నియామకానికి ఇబ్బంది ఉండదనే సదుద్దేశంతో చట్ట సవరణ చేస్తున్నామని వివరించారు. ‘లోకాయుక్త కేవలం అవినీతి కేసులను విచారించడానికి మాత్రమే కాదు. పరిపాలనలో అధికారుల తప్పిదాలు, నిర్లక్ష్యం లాంటివి కూడా విచారిస్తారు’ అని తెలిపారు. చంద్రబాబు అధికారంలో ఉన్నన్నాళ్లూ ఏమీ చేయకుండా రహస్య జీవోలతో కాలం గడిపారని విమర్శించారు. ఐదేళ్లుగా జరిగిన లోటుపాట్లపై లోకాయుక్త విచారిస్తుందన్నారు. కర్ణాటకలో లోకాయుక్త పలు కుంభకోణాలను నిగ్గు తేల్చిందని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment