పెరిగిన గ్రూప్-2 పోస్టులు
► 55 పోస్టుల పెరుగుదల
► నాన్‌ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లోనూ 177 పెరుగుదల
► హైదరాబాద్‌లోనూ పరీక్ష కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా విడుదల చేసిన గ్రూప్-2 నోటిఫికేషన్లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల సంఖ్య గతంలోకన్నా ఈసారి పెరిగింది. జూన్ 17న ఆర్థికశాఖ పదివేల పోస్టుల భర్తీకి అవకాశమిస్తూ జీఓ 110ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో 4,009 పోస్టులు ఏపీపీఎస్సీ ద్వారా, తక్కినవి పోలీసు రిక్రూట్‌మెంటు బోర్డు ద్వారా భర్తీచేయాలని నిర్దేశించింది. ఏపీపీఎస్సీకిచ్చిన పోస్టుల్లో గ్రూప్-1 పోస్టులు 94 పోస్టులు, గ్రూప్-2లో 750, గ్రూప్-3లో 1,000(పంచాయతీ కార్యదర్శులు), హోంశాఖలో 9 పోస్టుల భర్తీకి అవకాశం కల్పించింది. అయితే క్యారీ ఫార్వర్డ్‌తో గ్రూప్-2 పోస్టుల సంఖ్య 750 నుంచి 982కు పెరిగింది. అంటే అదనంగా 232 పోస్టులు పెరిగాయి. గతంలో ఎగ్జిక్యూటివ్ పోస్టుల సంఖ్య 387 కాగా ఈసారి వాటికి అదనంగా 55 కలిశాయి.
అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ పోస్టులు గతంలో 90 ఉండగా ఈసారి 96కు పెరిగింది. డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు 250 ఉండగా 253కు చేరింది. కొత్తగా ఏపీ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్‌టైల్స్ శాఖలో అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టులు 23, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్‌మెంట్ శాఖలో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పోస్టులు 8, ప్రొహిబిషన్, ఎకై యిజ్ శాఖలో సబ్‌ఇన్‌స్పెక్టర్ పోస్టులు 15 అదనంగా వచ్చి చేరాయి. మరోవైపు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులూ పెరిగాయి. గతంలో వీటి సంఖ్య 363 కాగా ఈసారి 540కి పెరిగింది.
అదనంగా 177 పోస్టులు కొత్తగా వచ్చి చేరాయి.రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం స్థానికతను వర్తింపచేయనున్నారు. 25వేలు దాటి దరఖాస్తులందితే స్క్రీనింగ్ టెస్టు నిర్వహిస్తారు. అర్హత సాధించిన వారిని 1:50 చొప్పున మెయిసకు ఎంపిక చేయనున్నారు. స్క్రీనింగ్ టెస్టును వచ్చేఏడాది ఫిబ్రవరి 26న, మెయిన్ టెస్టును మే 20, 21 తేదీల్లో నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లో స్పష్టంచేసింది. పరీక్షలకోసం ఏపీలోని 13 జిల్లాలతోపాటు హైదరాబాద్‌లోనూ కేంద్రాలు ఏర్పాటుచేయనున్నారు.