APPSC: ఏపీపీఎస్సీలో ఇంటర్వ్యూలు రద్దు | Cancellation of interviews at APPSC | Sakshi
Sakshi News home page

APPSC: ఏపీపీఎస్సీలో ఇంటర్వ్యూలు రద్దు

Published Sun, Jun 27 2021 3:17 AM | Last Updated on Sun, Jun 27 2021 8:47 AM

Cancellation of interviews at APPSC - Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వోద్యోగాల భర్తీలో నిరుద్యోగ విద్యావంతులకు మేలు చేకూర్చేలా ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ)లో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం శనివారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కమిషన్‌ ద్వారా భర్తీచేసే అన్ని కేటగిరీల పోస్టులకూ ఇంటర్వ్యూలు నిర్వహించే విధానానికి స్వస్తి చెప్పింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ జీఓ 58ను జారీచేశారు. ఉద్యోగాల భర్తీలో పారదర్శకతకు పెద్దపీట వేయడం.. పోటీ పరీక్షల ప్రక్రియపై అభ్యర్థులకు నమ్మకం కలిగేలా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్తర్వులు వెలువడినప్పటి నుంచి సదరు ఆదేశాలు అమల్లోకి వస్తాయని జీఓలో పేర్కొన్నారు. దీంతో ఇక నుంచి ఏపీపీఎస్సీ రాత పరీక్షల్లో మెరిట్‌ ఆధారంగా మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత ఏపీపీఎస్సీలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కమిషన్‌ కోల్పోయిన ప్రతిష్ఠను తిరిగి నిలబెట్టేలా, సంస్థపట్ల నిరుద్యోగుల్లో నమ్మకం పెరిగేలా అనేక చర్యలు తీసుకున్నారు.

ఇంటర్వ్యూల పేరిట జరిగిన అక్రమాలకు చెక్‌ పెట్టేలా..
నిజానికి.. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించిన పోస్టుల భర్తీలో అనేక అవకతవకలు చోటుచేసుకోవడంతో అర్హులైన నిరుద్యోగ విద్యావంతులు ఎంతో నష్టపోయారు. ఇంటర్వ్యూల మాటున గత పాలకులు భారీగా అక్రమాలకు పాల్పడ్డారు. ఏ పోస్టులకు ఇంటర్వ్యూలు జరిగినా ఆ బోర్డు చైర్మన్‌గా ఏపీపీఎస్సీ చైర్మనే వ్యవహరించేలా చేశారు. తద్వారా తమకు నచ్చిన వారికి పోస్టులు కట్టబెట్టేలా అప్పటి పాలకులు వ్యవహరించారు. దీనివల్ల అర్హులైన వారికి తీరని అన్యాయం జరగడంతో పాటు కమిషన్‌ విశ్వసనీయత దెబ్బతింది. తాజాగా.. గ్రూప్‌1–2018 ఇంటర్వ్యూలకు ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ విధానాన్ని మార్చింది. ఇంటర్యూలకు ఒకటికి మించి బోర్డులు ఏర్పాటుచేయడంతో పాటు వాటిలోని సభ్యుల నుంచే ఒకరు చైర్మన్‌గా వ్యవహరించేలా చేసింది. తాము ఏ బోర్డులో ఉన్నామో చివరి నిమిషం వరకు కూడా సభ్యులకు కూడా ముందుగా తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అభ్యర్థులు తమ ఇంటర్వ్యూ రోజున కమిషన్‌ కార్యాలయానికి వచ్చి అక్కడ డబ్బాల్లో ఉన్న చిట్టీల నుంచి ఒకదాన్ని తీసుకుని అందులో ఏ బోర్డు నెంబర్‌ రాసి ఉంటే అక్కడికి ఇంటర్వ్యూకు వెళ్లేలా కొత్త విధానాన్ని తీసుకువచ్చారు. ఇప్పుడు జీఓ–58 ద్వారా అన్ని కేటగిరీల పోస్టులకూ ఇంటర్వ్యూ విధానాన్నే రద్దుచేస్తూ నిర్ణయం తీసుకోవడంతో నిరుద్యోగ విద్యావంతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. గతంలో ఇంటర్వ్యూల పేరుతో అనేక అక్రమాలు జరిగాయని, ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాత పరీక్షల్లో మెరిట్‌ సాధించే అభ్యర్థులకు పోస్టులు దక్కుతాయని ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో ఎంపిక
గత ప్రభుత్వం గ్రూప్‌–1తో పాటు అన్ని కేటగిరీల పోస్టులకూ ప్రిలిమ్స్, మెయిన్స్‌ను తప్పనిసరి చేసింది. అంతకుముందు.. ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తుండగా దాన్ని టీడీపీ సర్కారు రద్దుచేసి 1:15 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపికచేసేలా ఏపీపీఎస్సీకి అధికారం ఇచ్చింది. దీనివల్ల వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు నష్టపోయారు. పాత విధానాన్ని కొనసాగించాలని నిరుద్యోగులు ఎన్ని ఆందోళనలు చేసినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ విధానాన్ని మార్చి నిరుద్యోగులకు మేలు చేసేలా 1:50 నిష్పత్తిని తిరిగి ప్రవేశపెట్టించారు. గ్రూప్‌–1 మెయిన్స్‌లో ట్యాబ్‌ ఆధారిత ప్రశ్నపత్రాల ద్వారా పరీక్షలు నిర్వహించారు. దీనివల్ల అభ్యర్థులందరికీ ఒకేసారి ప్రశ్నపత్రం అందడంతో పాటు లీకేజీ వంటి అక్రమాలకు ఆస్కారం లేకుండా చేశారు. ఇదేకాక.. ఏపీపీఎస్సీ నిర్వహించే డిపార్టుమెంటల్‌ పరీక్షలలో గత ప్రభుత్వం నెగిటివ్‌ మార్కులు పెట్టింది. పదోన్నతులు, ఇతర ప్రయోజనాల కోసం ఈ పరీక్షలు రాసే ఉద్యోగులు దీనివల్ల నష్టపోయారు. వీటిని రద్దుచేయాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోకి రాగానే నెగిటివ్‌ మార్కులను రద్దుచేసింది.

రాత పరీక్షల్లోనూ గతంలో అక్రమాలు
ఇంటర్వ్యూల్లోనే కాదు.. ప్రిలిమ్స్, మెయిన్స్‌ పరీక్షలలో కూడా అనేక లోపాలతో పరీక్షల ప్రక్రియను టీడీపీ పాలకులు అస్తవ్యస్థం చేశారు. గతంలో జరిగిన గ్రూప్‌2–2018 ప్రిలిమ్స్‌లో ఏకంగా పరీక్ష ప్రారంభమైన కొద్ది క్షణాల్లోనే స్క్రీన్‌ షాట్లు బయటకు రావడంతో గందరగోళం నెలకొంది. విశాఖపట్నం, తదితర పరీక్ష కేంద్రాల్లో అక్రమాలకు తెరలేపారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పట్లో వీటిని నిలదీసిన వందలాది మంది నిరుద్యోగ అభ్యర్థులను పరీక్షల నుంచి తప్పించడంతో పాటు ఏకంగా కేసులు కూడా పెట్టించారు. గ్రూప్‌–1లో ఏకంగా 51 తప్పులు చోటుచేసుకోవడంతో ఆ పరీక్షలు న్యాయ వివాదాల మధ్య గందరగోళంలో పడ్డాయి. అలాగే, గ్రూప్‌–1 పోస్టులతో పాటు డిగ్రీ కాలేజీ లెక్చరర్‌ తదితర పోస్టులకు నిర్వహించిన ఇంటర్వ్యూల్లో భారీగా గోల్‌మాల్‌ జరిగింది. రాతపరీక్షల్లో మెరిట్‌లో ఉన్న అభ్యర్థులకు ఇంటర్వ్యూల్లో తక్కువ మార్కులు వేసి తమకు కావలసిన వారికి, డబ్బులు ముట్టచెప్పిన వారికి అత్యధిక మార్కులు వేసి పోస్టులు కట్టబెట్టారన్న విమర్శలు పెద్దఎత్తున వచ్చాయి. ఇలా గతంలో జరిగిన అక్రమాలెన్నెన్నో.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement