
బాధితుడు యోగానంద
అనంతపురం సెంట్రల్: ఏపీఎస్పీ బెటాలియన్ హెడ్‌కానిస్టేబుల్ వీడియో పోలీసుశాఖలో కలకలం రేపుతోంది. బాధితుడు తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఓ వీడియో తీసుకొని సామాజిక మాద్యమాల్లో అప్‌లోడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో పోలీసుశాఖలో వైరల్‌గా మారింది. వీడియోలో బాధితుడు తెలిపిన వివరాలివి.‘‘ నా పేరు యోగానంద. 1990లో ఏపీఎస్పీ 2వ బెటాలియన్‌లో చేరాను. హాస్టల్‌లో ఉంటూ కష్టపడి చదువుకొని ఉద్యోగం సంపాదించా. మా నాన్న చిన్నప్పుడే చనిపోతే అమ్మ కట్టెలు కొట్టి నన్ను చదివించింది. ఏపీఎస్పీ బెటాలియన్‌లో అవినీతి అంతా అధికారులే చేస్తున్నారు. ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నించిందుకు అనేక పనిష్మెంట్‌లు అనుభవించా. ప్రస్తుతం ఏపీఎస్పీ 14 బెటాలియన్‌లో ఉంటున్నాను. నా పని నేను సక్రమంగా చేసుకుంటూ వెళుతున్నా. నాలుగు నెలల క్రితం అప్పటి ఏపీఎస్పీ కమాండెంట్ జగదీష్‌కుమార్ విజయవాడ శిక్షణకు పంపించారు.
అక్కడ శిక్షణలో గుండెనొప్పి(చెస్ట్‌పెయిన్), తల తిరగడం లాంటి లక్షణాలు కనిపించాయి. దీన్ని గమనించిన కమాండెంట్ జగదీష్‌కుమార్ నీవు చాలా లావున్నావు. తగ్గకపోతే సర్వీస్ నుంచి రిమూవ్ కాని పనిష్మెంట్‌కానీ చేస్తాను అని హెచ్చరించారు. రోజుకు ఒకటిన్నర గంట వాకింగ్ చేయమని ఆదేశించాడు. అందులో భాగంగా రోజూ వాకింగ్ చేస్తున్నా. ఒక రోజు అసిస్టెంట్ కమాండెంట్ ప్రభుకుమార్ చూసి వాకింగ్ కాదు నువ్వు పరిగెత్తాలని ఆదేశించాడు. తనకు ఆరోగ్యం బాగలేదు. పరిగెత్తితే చనిపోతా అని వివరించాను. చనిపోతే చనిపో.. ఎవరి కోసం అని అన్నాడు. సిక్‌లో వెళ్లినా జీతం రాదని మొరపెట్టుకున్నాను. అయితే తనతో ఆరŠుగ్యమెంట్ చేశానని గ్రౌండ్‌లోని అందరితో సంతకాలు చేయించి తనను సర్వీసు నుంచి రిమూవ్ చేయించారు. ఈ విషయాన్ని కమాండెంట్ దృష్టికి, రాయలసీమ డీఐజీ దృష్టికి తీసుకుపోయాను. నాలుగు నెలలవుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. కాళ్లు పట్టుకొని వేడుకున్నా నేను చేసింది ఒక వేళ తప్పే అయితే హెడ్‌కానిస్టేబుల్ నుంచి కానిస్టేబుల్ రివర్షన్ చేయండి. కాని నా కడుపు కొట్టకండి. నాపై ఐదుగురు ప్రాణాలు ఆధారపడ్డాయి. ఆడపిల్లలు చదువు, పెద్ద కూతురు వివాహం కూడా ఆగిపోతుందని మొరపెట్టుకున్నారు. అయినా నాలుగు నెలలవుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఈ విషయం ఇంట్లో చెప్పకుండా బయటబయటే తిరుగుతున్నా. తనకు న్యాయం చేయకపోతే భార్య పిల్లలతో కలిసి తనకు ఆత్మహత్యే శరణ్యం’’ అంటూ వీడియోలో బోరున విలపించారు. తనకు ఉద్యోగం లేకపోతే కుటుంబాన్ని పోషించలేనని కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ వీడియో ప్రస్తుతం పోలీసుశాఖలో అందరినీ కంటతడి పెట్టిస్తోంది. గత కమాండెంట్ జగదీష్ కుమార్ హయాంలో ఇలాంటి మంది బాధితులెందరోఉన్నారని బెటాలియన్ సిబ్బంది వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment