సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది. ఫిబ్రవరి 6 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించాయి. 50 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎంప్లాయీస్ యూనియన్ గతేడాది డిసెంబర్ 31న సమ్మె నోటీసిచ్చింది. దీనిపై ఆర్టీసీ యాజమాన్యం పలు దఫాలుగా కార్మిక సంఘాలతో చర్చలు జరిపింది. 20 శాతం కంటే ఫిట్‌మెంట్ ఇచ్చే ప్రసక్తే లేదని మంగళవారం జరిగిన చర్చల్లో తేల్చిచెప్పింది. దీంతో కార్మిక సంఘాలన్నీ కలసి జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ)గా ఏర్పడ్డాయి. బుధవారం ఆర్టీసీ హౌజ్‌లోని ఈయూ కార్యాలయంలో కార్మిక సంఘాల నేతలు సమావేశమై ఫిబ్రవరి 6 నుంచి నిరవధికంగా సమ్మెకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు ఈ నెల 25వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె సన్నాహక పోరాటాలను యూనియన్ నేతలు నిర్వహించనున్నారు. అలాగే ఈ నెల 26వ తేదీ నుంచి 28 వరకు డ్యూటీలకు వెళ్లే కార్మికులంతా డిమాండ్లతో కూడిన బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవ్వాలని, 28వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిపోల్లో ఒకరోజు సామూహిక నిరాహార దీక్షలు చేపట్టాలని జేఏసీ నిర్ణయించింది. అనంతరం 30వ తేదీన అన్ని ఆర్‌ఎంల కార్యాలయాల వద్ద సమ్మె సన్నాహక మహాధర్నాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా జేఏసీ నేతలు 13 సమ్మె డిమాండ్లను ప్రకటించారు. ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఆర్టీసీ బస్సులకు ఎంవీ ట్యాక్స్ రద్దు చేయాలని, నష్టాలు మొత్తం ప్రభుత్వమే భరించాలని, కచ్చితంగా 50 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. కాగా, జేఏసీ పోరాటానికి వెలుపల నుంచి మద్దతిస్తామని నేషనల్ మజ్దూర్ యూనియన్ ప్రకటించినట్లు జేఏసీ కన్వీనర్ పి.దామోదరరావు తెలిపారు.
చంద్రబాబు తీరుతోనే ఆర్టీసీకి నష్టాలు: రాజారెడ్డి
చంద్రబాబు తీరుతోనే ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయని వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజారెడ్డి అన్నారు. చంద్రబాబు సభలకు, పోలవరం యాత్రలకు ఆర్టీసీ బస్సులను వినియోగించుకుంటూ ఒక్క పైసా చెల్లించడం లేదని విమర్శించారు. చంద్రబాబు ఖరీదైన బస్సును రూ.9 కోట్లతో కొనుగోలు చేసి ఆ భారం ఆర్టీసీపైనే మోపారని ధ్వజమెత్తారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే తప్ప మనుగడ సాధించలేదని ఆయన స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment