Employees Union(EU)
-
డిసెంబర్ 14న ఆర్టీసీ ఎన్నికలు
సాక్షి, అమరావతి: ఏపీఎస్ ఆర్టీసీలో ఎన్నికల సమీకరణలు రసవత్తరంగా మారుతున్నాయి. ఆర్టీసీలోని క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ (సీసీఎస్) పాలక మండలి ఎన్నికలు డిసెంబర్ 14న జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీకి దిగిన ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ)కు ఏపీ పీటీడీ ఆఫీస్ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఓస్వా) మద్దతును ప్రకటించింది. ఈ మేరకు శనివారం జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు ఓస్వా రాష్ట్ర అధ్యక్షుడు ఐఎల్ నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.శివప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు. డిసెంబర్ 14న జరుగుతున్న సీసీఎస్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 129 డిపోలు, యూనిట్లు, ఆఫీసు కార్యాలయాల్లో పనిచేసే పీటీడీ ఆఫీస్ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేన్ (ఓస్వా) సభ్యులు అంతా ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ)కు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈయూ గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు జేఏసీగా రాష్ట్రవ్యాప్తంగా జరిపిన అన్ని పోరాటాల్లోనూ ఓస్వా భాగస్వామ్యం ఉందని పేర్కొన్నారు. 2017 వేతన సవరణ ఒప్పందంలో 25 శాతం తాత్కాలిక ఫిట్మెంట్ సాధించుకున్నామని, సిబ్బంది పదోన్నతుల కోసం పోరాడామని తెలిపారు. -
‘ఓడీ’.. కార్మిక సంఘాల్లో వేడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం ఇచ్చే ఆన్‌డ్యూటీ సదుపాయం రద్దయి ఏడాది కావస్తోంది. దీన్ని ఇప్పటి వరకు పునరుద్ధరించలేదు. అయితే దీనిపై ప్రభుత్వం ఎప్పటికైనా ఉత్తర్వులు జారీ చేస్తుందన్న ఉద్దేశంతో ప్రధాన ఉద్యోగ సంఘాల నేతలు ఆ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. కొన్ని సంఘాల నేతలు మాత్రం ఈ జాప్యం వెనుక ఉన్న ఆంతర్యం అంచనా వేసో, మరో కారణమో గానీ గత జూలై నుంచే విధులకు హాజరవుతున్నారు. తాజాగా ఆర్టీసీలో కార్మిక సంఘాలకు ప్రత్యామ్నాయంగా ఎంప్లాయిస్ వెల్ఫేర్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యం లో ఉద్యోగ సంఘాల నేతలు ఆలోచనల్లో పడ్డారు. ఇటు ఉపాధ్యాయులకు 54 సంఘాల ఉన్న నేపథ్యంలో గుర్తింపు సంఘం ఒకటే ఉంటే చాలన్న యోచనలో ప్రభుత్వం ఉందన్న వార్తలు రావడం ఆ సంఘాల నేతలను కలవరపరుస్తోంది. గతంలో 27 సంఘాలకు అవకాశం.. ప్రభుత్వ సర్వీసు రంగంలోని వివిధ శాఖల్లో పని చేసే ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీ సుకెళ్లి పరిష్కరించేలా కృషి చేసేందుకు సంఘాలు ఏర్పడ్డాయి. అందులో ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ తమ పరిధిలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేసి గుర్తింపు పొందిన సంఘాలకు శాశ్వ త సభ్యత్వం ఇచ్చింది. మరికొన్నింటికి ఏడాది ప్రాతిపదికన గుర్తింపు ఇచ్చింది. ప్రస్తుతం జా యింట్ స్టాఫ్ కౌన్సిల్లో టీఎన్జీవో, క్లాస్–4, ఎస్టీయూ, పీఆర్టీయూ–టీఎస్, యూటీఎఫ్, ట్విన్ సిటీస్ గవర్నమెంట్ డ్రైవర్స్ అసోసియేషన్, రెవెన్యూ సర్వీసు అసోసియేషన్, సెక్రటేరియట్ ఎంప్లాయిస్ అసోసియేషన్, తెలంగాణ గవర్నమెంట్ డ్రైవర్స్ అసోసియేషన్ వంటి కొన్ని సం ఘాలున్నాయి. ఏడాది కాల పరిమితితో మరికొ న్ని ఉన్నాయి. ఇలా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఉన్న సంఘాలతోపాటు అందులోని లేని వాటిని కలిపి మొత్తంగా 27 సంఘాలకు చెందిన రాష్ట్ర, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు గతేడాది ప్రభుత్వం ఆన్‌డ్యూటీ సదుపాయం కల్పించింది. గు ర్తింపు పొందిన సంఘాల రాష్ట్ర, జల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు 21 స్పెషల్ క్యాజువల్ లీవులు ఇచ్చింది. ఈ సదుపాయం కూడా గతేడాది డిసెంబర్‌తో ముగిసింది. మరోవైపు రాష్ట్రంలో ఇప్పుడు మొత్తంగా 180 వరకు సంఘాలున్నాయి. అందులో టీచర్లకు చెందినవే 57 ఉన్నాయి. ఈ నేపథ్యంలో సంఘాల విషయాన్ని ఏం చేయాలి.. సర్వీసు సెక్టార్‌లోనూ గుర్తింపు సంఘం వంటి నిబంధన సాధ్యమా? అన్న ఆలోచనలు ప్రభుత్వం చేస్తోంది. తాజాగా ఆర్టీసీ అంశం తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఉద్యోగ వర్గాల్లో తమ సంఘాల ఉనికిపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. -
ఆర్టీసీ సమ్మె విరమణ..!
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఎట్టకేలకు ఫుల్స్టాప్ పడింది. 47 రోజులపాటు సుదీర్ఘంగా కొనసాగిన సమ్మెను విరమించాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ బుధవారం సాయంత్రం ప్రకటించింది. బేషరతుగా కార్మికులను ప్రభుత్వం విధుల్లోకి తీసుకోవాలని, ఈ విషయమై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే.. సమ్మె విరమించి మళ్లీ విధుల్లోకి చేరుతామని ఆర్టీసీ జేఏసీ వెల్లడించింది. విధుల్లో చేరిన కార్మికులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, సమ్మెకు ముందున్న పరిస్థితులను సంస్థలో మళ్లీ కల్పించాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఎటువంటి ఆంక్షలు, నిబంధనలు లేకుంటేనే కార్మికులు మళ్లీ విధుల్లోకి చేరుతారని, కార్మికులు విధుల్లో చేరితే డ్యూటీ చార్జ్‌ల మీద మాత్రమే సంతకాలు పెడతారని ఆయన తెలిపారు. సమ్మె కొనసాగింపుపై ఆర్టీసీ కార్మిక సంఘాలు నిన్నటినుంచి తీవ్ర తర్జనభర్జనలకు లోనైన సంగతి తెలిసిందే. సమ్మె అంశాన్ని హైకోర్టు లేబర్ కోర్టుకు నివేదించడంతో.. సమ్మె కొనసాగింపుపై కార్మిక సంఘాలు పునరాలోచనలో పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ బుధవారం కూడా సమావేశమైంది. సమ్మె విషయమై లేబర్ కమిషన్‌కు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఈ సమావేశంలో నేతలు క్షుణ్ణంగా పరిశీలించారు. మరోవైపు కొనసాగింపు కార్మికుల్లో తీవ్ర భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. గత 47 రోజులుగా సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా సమ్మె కొనసాగించడం సమంజసం కాదని, ఇప్పటికే మూడు నెలలుగా జీతాలు లేక కార్మికుల కుటుంబాలు తీవ్ర అవస్థలు పడుతున్నాయని మెజారిటీ కార్మికులు అభిప్రాయపడటంతో సమ్మె విరమణకే జేఏసీ మొగ్గు చూపినట్టు కనిపిస్తోంది. అయితే, ఉద్యోగ భద్రతపై కార్మికుల్లో ఒక రకమైన ఆందోళన వ్యక్తమవుతోంది. కార్మికులు సమ్మె విరమణకు ఓకే చెప్పడంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
6 నుంచి ఆర్టీసీలో సమ్మె
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది. ఫిబ్రవరి 6 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించాయి. 50 శాతం ఫిట్మెంట్ ప్రకటించాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎంప్లాయీస్ యూనియన్ గతేడాది డిసెంబర్ 31న సమ్మె నోటీసిచ్చింది. దీనిపై ఆర్టీసీ యాజమాన్యం పలు దఫాలుగా కార్మిక సంఘాలతో చర్చలు జరిపింది. 20 శాతం కంటే ఫిట్మెంట్ ఇచ్చే ప్రసక్తే లేదని మంగళవారం జరిగిన చర్చల్లో తేల్చిచెప్పింది. దీంతో కార్మిక సంఘాలన్నీ కలసి జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ)గా ఏర్పడ్డాయి. బుధవారం ఆర్టీసీ హౌజ్‌లోని ఈయూ కార్యాలయంలో కార్మిక సంఘాల నేతలు సమావేశమై ఫిబ్రవరి 6 నుంచి నిరవధికంగా సమ్మెకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఈ నెల 25వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె సన్నాహక పోరాటాలను యూనియన్ నేతలు నిర్వహించనున్నారు. అలాగే ఈ నెల 26వ తేదీ నుంచి 28 వరకు డ్యూటీలకు వెళ్లే కార్మికులంతా డిమాండ్లతో కూడిన బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవ్వాలని, 28వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిపోల్లో ఒకరోజు సామూహిక నిరాహార దీక్షలు చేపట్టాలని జేఏసీ నిర్ణయించింది. అనంతరం 30వ తేదీన అన్ని ఆర్ఎంల కార్యాలయాల వద్ద సమ్మె సన్నాహక మహాధర్నాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా జేఏసీ నేతలు 13 సమ్మె డిమాండ్లను ప్రకటించారు. ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఆర్టీసీ బస్సులకు ఎంవీ ట్యాక్స్ రద్దు చేయాలని, నష్టాలు మొత్తం ప్రభుత్వమే భరించాలని, కచ్చితంగా 50 శాతం ఫిట్మెంట్ ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. కాగా, జేఏసీ పోరాటానికి వెలుపల నుంచి మద్దతిస్తామని నేషనల్ మజ్దూర్ యూనియన్ ప్రకటించినట్లు జేఏసీ కన్వీనర్ పి.దామోదరరావు తెలిపారు. చంద్రబాబు తీరుతోనే ఆర్టీసీకి నష్టాలు: రాజారెడ్డి చంద్రబాబు తీరుతోనే ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయని వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజారెడ్డి అన్నారు. చంద్రబాబు సభలకు, పోలవరం యాత్రలకు ఆర్టీసీ బస్సులను వినియోగించుకుంటూ ఒక్క పైసా చెల్లించడం లేదని విమర్శించారు. చంద్రబాబు ఖరీదైన బస్సును రూ.9 కోట్లతో కొనుగోలు చేసి ఆ భారం ఆర్టీసీపైనే మోపారని ధ్వజమెత్తారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే తప్ప మనుగడ సాధించలేదని ఆయన స్పష్టం చేశారు. -
ఏపీఎస్ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్
-
ఏపీఎస్ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో(ఏపీఎస్ఆర్టీసీ) సమ్మె సైరన్ మోగింది. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గుర్తింపు కార్మిక సంఘం ఎంప్లాయిస్ యూనియన్(ఈయూ) నేతలు సోమవారం ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబుని కలిసి సమ్మె నోటీసు అందజేశారు. ఈ సమ్మె నోటీసుకు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ కూడా మద్దతు ప్రకటించింది. ఈ నోటీసులో ఆర్టీసీ కార్మికులు తమ ప్రధాన డిమాండ్లను ప్రస్తావించారు. 50 శాతం వేతన సవరణతో పాటు అలవెన్సులు వంద శాతం పెంచాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని నోటీసులో పేర్కొన్నారు. సంస్థ నష్టాలకు అనుగుణంగా ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఆర్టీసీ కార్మికుల పదవి విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంచాలన్నారు. ఆర్టీసీ కొనుగోలు చేసే డీజిల్‌పై రాయితీ ఇవ్వాలని, ఖాళీ ఉద్యోగాల భర్తీ, కార్మికుల ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బలవంతంగా అమలు చేస్తున్న వీఆర్ఎస్ స్కీమ్ ఆపాలన్నారు. -
ఆర్టీసీలో అప్పుడే ఎన్నికల వే‘ఢీ’..!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికల వేడి మొదలైంది. ప్రస్తుతం ఉన్న గుర్తింపు యూనియన్ పదవీకాలం ఈనెల 7వ తేదీతో ముగిసింది. దీంతో తిరిగి ఎన్నికల హడావుడి మొదలైంది. ఏపీలో ఇప్పటికే ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయిన దరిమిలా ఇక్కడా అదే వాతావరణం నెలకొంది. దీంతో కొందరు యూనియన్ నేతలు అపుడే ప్రచారం కూడా మొదలుపెట్టారు. మంగళవారం అన్ని యూనియన్లు మోటారు వాహన సవరణ బిల్లు–2016కు వ్యతిరేకంగా సమ్మెలో పాల్గొన్నాయి. సాయంత్రానికి సమ్మె ముగియగానే పలు యూనియన్ల నేతలు ఎన్నికలపై దృష్టిసారించారు. కీలక నిర్ణయాల్లో..! ఆర్టీసీలో ప్రతీ రెండేళ్లకోసారి గుర్తింపు యూనియన్ ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల్లో విజయం సాధించిన యూనియన్ గుర్తింపు యూనియన్‌గా రెండేళ్లపాటు కొనసాగుతుంది. ఆర్టీసీ తీసుకునే పలు కీలక నిర్ణయాలు, చర్చలు, వివిధ కార్యక్రమాల్లో ఈ యూనియన్ సభ్యులకు అధికారికంగా ఆహ్వానం లభిస్తుంది. ఫలితంగా కార్మికుల సమస్యలు, ఇబ్బందులను నేరుగా సంస్థ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఈ యూనియన్‌కు దక్కుతుంది. పదవీకాలం ముగిసినా.. ఎన్నికలు నిర్వహించే వరకు ఈ యూనియనే ఆపద్ధర్మ గుర్తింపు యూనియన్‌గా కొనసాగుతుంది. 2013 నుంచి టీఎంయూనే..! ప్రస్తుతం గుర్తింపు యూనియన్‌గా ఉన్న తెలంగాణ మజ్దూర్ యూనియన్ 2013 నుంచి ఆర్టీసీలో తన హవా కొనసాగిస్తోంది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా పురుడుపోసుకున్న టీఎంయూ, ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) కలసి 2012 డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించింది. 2013 జనవరి 3న అధికారిక యూనియన్‌గా ఉత్తర్వులు వచ్చాయి. 2015 జనవరి 2తో వీరి పదవీకాలం ముగిసింది. తరువాత 2016 జూలైలో మరో సారి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో టీఎంయూ ఒంటరిగా పోటీ చేసి విజయం సాధించింది. మొత్తానికి ఐదున్నరేళ్లుగా టీఎంయూ అధికారిక యూనియన్‌గా ఉండటం విశేషం. గతానుభవాల దృష్ట్యా ఈ మారు ఎన్నికలు సకాలంలో జరుగుతాయా..లేదా వాయిదా పడుతాయా అనే చర్చకూడా కార్మికుల్లో సాగుతోంది. ఎందుకైనా మంచిదని కొన్ని సంఘాలు అప్పుడే సామాజిక మాధ్యమాల్లో తమ ప్రచారం ముందస్తుగానే ప్రారంభించేశాయి. ఎన్నికలు వాయిదా వేస్తే ఊరుకోమని హెచ్చరిస్తున్నాయి. -
ఆర్టీసీలో చర్చలు విఫలం
-
ఆర్టీసీలో చర్చలు విఫలం
* 27 నుంచి కార్మిక సంఘాల నిరవధిక సమ్మె * ఐఆర్ చెల్లింపునకు గడువు కోరిన యాజమాన్యం * తిరస్కరించిన ఈయూ, టీఎంయూలు సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు 46 శాతం మధ్యంతర భృతి(ఐఆర్) చెల్లించాలనే డిమాండ్‌పై గుర్తింపు సంఘం ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ), తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) కూటమితో యాజమాన్యం శుక్రవారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఐఆర్ మంజూరుపై ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని, మరికొంత సమయం కావాలని యాజమాన్యం కోరింది. దీనికి కార్మిక సంఘాలు ఒప్పుకోలేదు. ‘ఈనెల 27న ఉదయం తొలి షెడ్యూలు నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు, సూపర్వైజర్స్ అసోసియేషన్లను కలుపుకొని నిరవధిక సమ్మెకు దిగుతాం’ అని ఈయూ ప్రధాన కార్యదర్శి కె.పద్మాకర్, టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి తెలిపారు. శుక్రవారం జరిగిన చర్చల్లో ఈయూ తరఫున ఎం.హనుమంతరావు, ఎస్.బాబు, రాజేంద్రప్రసాద్, కె.రాజిరెడ్డి, దామోదరరావు, టీఎంయూ నుంచి తిరుపతి, థామస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీలో కారుణ్య నియామకాలు ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేపట్టడానికి ఎప్పటికప్పుడు ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు ఇవ్వనుంది. 2011కు ముందు చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వడానికి వీలుగా అనుమతి మంజూరు చేసింది. 2011 నుంచి దాదాపు 1400 మంది కార్మికులు చనిపోయారు. వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించడానికి వీలుగా ప్రభుత్వం ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనుంది. ప్రభుత్వ నిర్ణయం పట్ల ఎన్ఎంయూ అధ్యక్షుడు నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి మహమూద్‌లు హర్షం వ్యక్తం చేశారు.