
ఆర్టీసీలో చర్చలు విఫలం
* 27 నుంచి కార్మిక సంఘాల నిరవధిక సమ్మె
* ఐఆర్ చెల్లింపునకు గడువు కోరిన యాజమాన్యం
* తిరస్కరించిన ఈయూ, టీఎంయూలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు 46 శాతం మధ్యంతర భృతి(ఐఆర్) చెల్లించాలనే డిమాండ్‌పై గుర్తింపు సంఘం ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ), తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) కూటమితో యాజమాన్యం శుక్రవారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఐఆర్ మంజూరుపై ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని, మరికొంత సమయం కావాలని యాజమాన్యం కోరింది. దీనికి కార్మిక సంఘాలు ఒప్పుకోలేదు.
‘ఈనెల 27న ఉదయం తొలి షెడ్యూలు నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు, సూపర్‌వైజర్స్ అసోసియేషన్లను కలుపుకొని నిరవధిక సమ్మెకు దిగుతాం’ అని ఈయూ ప్రధాన కార్యదర్శి కె.పద్మాకర్, టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి తెలిపారు. శుక్రవారం జరిగిన చర్చల్లో ఈయూ తరఫున ఎం.హనుమంతరావు, ఎస్.బాబు, రాజేంద్రప్రసాద్, కె.రాజిరెడ్డి, దామోదరరావు, టీఎంయూ నుంచి తిరుపతి, థామస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీలో కారుణ్య నియామకాలు
ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేపట్టడానికి ఎప్పటికప్పుడు ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు ఇవ్వనుంది. 2011కు ముందు చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వడానికి వీలుగా అనుమతి మంజూరు చేసింది. 2011 నుంచి దాదాపు 1400 మంది కార్మికులు చనిపోయారు. వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించడానికి వీలుగా ప్రభుత్వం ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనుంది. ప్రభుత్వ నిర్ణయం పట్ల ఎన్‌ఎంయూ అధ్యక్షుడు నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి మహమూద్‌లు హర్షం వ్యక్తం చేశారు.