
సాక్షి, అమరావతి: ఏపీఎస్ ఆర్టీసీలో ఎన్నికల సమీకరణలు రసవత్తరంగా మారుతున్నాయి. ఆర్టీసీలోని క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ (సీసీఎస్) పాలక మండలి ఎన్నికలు డిసెంబర్ 14న జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీకి దిగిన ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ)కు ఏపీ పీటీడీ ఆఫీస్ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఓస్వా) మద్దతును ప్రకటించింది. ఈ మేరకు శనివారం జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు ఓస్వా రాష్ట్ర అధ్యక్షుడు ఐఎల్ నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.శివప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు.
డిసెంబర్ 14న జరుగుతున్న సీసీఎస్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 129 డిపోలు, యూనిట్లు, ఆఫీసు కార్యాలయాల్లో పనిచేసే పీటీడీ ఆఫీస్ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేన్ (ఓస్వా) సభ్యులు అంతా ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ)కు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈయూ గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు జేఏసీగా రాష్ట్రవ్యాప్తంగా జరిపిన అన్ని పోరాటాల్లోనూ ఓస్వా భాగస్వామ్యం ఉందని పేర్కొన్నారు. 2017 వేతన సవరణ ఒప్పందంలో 25 శాతం తాత్కాలిక ఫిట్మెంట్ సాధించుకున్నామని, సిబ్బంది పదోన్నతుల కోసం పోరాడామని తెలిపారు.