National Mazdoor Union
-
ఏపీఎస్ ఆర్టీసీలో సమ్మె సైరన్
సాక్షి, విజయవాడ : ఏపీఎస్ ఆర్టీసీలో మళ్లీ సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ యాజమాన్యానికి నేషనల్ మజ్దూర్ యూనియన్ సమ్మె నోటీసులు ఇచ్చింది. నేషనల్ మజ్దూర్ యూనియన్ నేతలు 46 డిమాండ్లతో ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబుకు బుధవారం సమ్మె నోటీసులు ఇచ్చారు. కార్మికుల వేతన సవరణ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సిబ్బంది కుదింపు, గ్రాడ్యుటీ తగ్గింపు, అద్దె బస్సుల పెంపు నిర్ణయాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఆర్టీసీకి చెల్లించాల్సిన 670కోట్ల బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ఈనెల 22 తర్వాత సమ్మెకు దిగుతామని ఎన్ఎంయూ నేతలు హెచ్చరించారు. -
6 నుంచి ఆర్టీసీలో సమ్మె
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది. ఫిబ్రవరి 6 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించాయి. 50 శాతం ఫిట్మెంట్ ప్రకటించాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎంప్లాయీస్ యూనియన్ గతేడాది డిసెంబర్ 31న సమ్మె నోటీసిచ్చింది. దీనిపై ఆర్టీసీ యాజమాన్యం పలు దఫాలుగా కార్మిక సంఘాలతో చర్చలు జరిపింది. 20 శాతం కంటే ఫిట్మెంట్ ఇచ్చే ప్రసక్తే లేదని మంగళవారం జరిగిన చర్చల్లో తేల్చిచెప్పింది. దీంతో కార్మిక సంఘాలన్నీ కలసి జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ)గా ఏర్పడ్డాయి. బుధవారం ఆర్టీసీ హౌజ్‌లోని ఈయూ కార్యాలయంలో కార్మిక సంఘాల నేతలు సమావేశమై ఫిబ్రవరి 6 నుంచి నిరవధికంగా సమ్మెకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఈ నెల 25వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె సన్నాహక పోరాటాలను యూనియన్ నేతలు నిర్వహించనున్నారు. అలాగే ఈ నెల 26వ తేదీ నుంచి 28 వరకు డ్యూటీలకు వెళ్లే కార్మికులంతా డిమాండ్లతో కూడిన బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవ్వాలని, 28వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిపోల్లో ఒకరోజు సామూహిక నిరాహార దీక్షలు చేపట్టాలని జేఏసీ నిర్ణయించింది. అనంతరం 30వ తేదీన అన్ని ఆర్ఎంల కార్యాలయాల వద్ద సమ్మె సన్నాహక మహాధర్నాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా జేఏసీ నేతలు 13 సమ్మె డిమాండ్లను ప్రకటించారు. ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఆర్టీసీ బస్సులకు ఎంవీ ట్యాక్స్ రద్దు చేయాలని, నష్టాలు మొత్తం ప్రభుత్వమే భరించాలని, కచ్చితంగా 50 శాతం ఫిట్మెంట్ ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. కాగా, జేఏసీ పోరాటానికి వెలుపల నుంచి మద్దతిస్తామని నేషనల్ మజ్దూర్ యూనియన్ ప్రకటించినట్లు జేఏసీ కన్వీనర్ పి.దామోదరరావు తెలిపారు. చంద్రబాబు తీరుతోనే ఆర్టీసీకి నష్టాలు: రాజారెడ్డి చంద్రబాబు తీరుతోనే ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయని వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజారెడ్డి అన్నారు. చంద్రబాబు సభలకు, పోలవరం యాత్రలకు ఆర్టీసీ బస్సులను వినియోగించుకుంటూ ఒక్క పైసా చెల్లించడం లేదని విమర్శించారు. చంద్రబాబు ఖరీదైన బస్సును రూ.9 కోట్లతో కొనుగోలు చేసి ఆ భారం ఆర్టీసీపైనే మోపారని ధ్వజమెత్తారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే తప్ప మనుగడ సాధించలేదని ఆయన స్పష్టం చేశారు. -
టిమ్ బాధ్యతలు ఇస్తే అడ్డుకుంటాం
నెల్లూరు (టౌన్) : ఆర్టీసీ అద్దె బస్సుల్లో డ్రైవర్లకు కండక్టర్లు బాధ్యతలు అప్పజెప్పితే నేషనల్ మజ్దూర్ యూనియన్ అడ్డుకుంటుందని యూనియన్ రాష్ట్ర కార్యదర్శి రమణరాజు తెలిపారు. అద్దె బస్సులో టిమ్ డ్యూటీ అప్పజెప్పడంపై మంగళవారం యూనియన్ ఆధ్వర్యంలో టీ విరామ సమయంలో బస్డాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రమణరాజు మాట్లాడుతూ అద్దె బస్సులను కండక్టర్లతోనే నడపాలని డిమాండ్ చేశారు. -
పులివెందులలో వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ గెలుపు
పులివెందుల : పులివెందులలో వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ ఘన విజయం సాధించింది. పులివెందుల ఆర్టీసీ డిపోలో మొత్తం 466 ఓట్లు ఉన్నాయి. ఇందులో 12 ఓట్లు పోస్టల్ బ్యాలెట్లు. మిగిలిన 454 ఓట్లలో 452 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్‌కు 191 ఓట్లు రాగా, ఎంప్లాయీస్ యూనియన్‌కు 148 ఓట్లు వచ్చాయి. నేషనల్ మజ్దూర్ యూనియన్‌కు 94 ఓట్లు లభించగా, టీడీపీ అనుబంధ యూనియన్ కార్మిక పరిషత్‌కు కేవలం 15 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఎంప్లాయీస్ యూనియన్‌పై వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ 43 ఓట్ల తేడాతో గెలుపొందింది. యూనియన్ స్థాపించిన అతి తక్కువ కాలంలోనే పులివెందులలో వైఎస్ఆర్ మజ్దూర్ యూనియన్ గెలుపొందడం విశేషం. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శులు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, రాజుల భాస్కర్‌రెడ్డిలు ఇందుకు విశేష కృషి చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే ఆర్టీసీని తప్పకుండా ప్రభుత్వంలో విలీనం చేస్తారన్నారు. ఆర్టీసీ కార్మికులకు వైఎస్ఆర్ సీపీ అండగా ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని చెప్పారు. -
'ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి'
విజయవాడ (కృష్ణా జిల్లా) : రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికలకు సంబంధించి నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) మేనిఫెస్టో విడుదల చేసింది. విజయవాడలోని ఏపీఎన్జీవో అసోసియేషన్ కార్యాలయంలో ఎన్ఎంయూ రాష్ట్ర కమిటీ సమావేశం గురువారం జరిగింది. సమావేశంలో 54 హామీలతో రూపొందించిన మేనిఫెస్టోను యూనియన్ చైర్మన్ ఆర్వీవీఎస్వీ ప్రసాద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీని విలీనం చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలయ్యేలా చూస్తామన్నారు. డ్రైవర్‌ను కండక్టర్ విధులు నిర్వర్తించాలనే నిబంధనను ప్రవేశపెట్టి కండక్టర్ల వ్యవస్థ నిర్వీర్యం చేసే ఈయూ ఒప్పందాన్ని రద్దు పరుస్తామన్నారు. విజయవాడతోపాటు రాయలసీమ ప్రాంతంలోనూ తార్నాక తరహా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను యాజమాన్యం, ప్రభుత్వమే నిర్మించేలా ఒత్తిడి తెస్తామన్నారు. కార్మికుల నుంచి నెలకు రూ.100 మెడికల్ ఫండ్ రికవరీని నిలుపుదల చేస్తామని చెప్పారు. అన్ని జిల్లా కేంద్రాల్లో సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఈయూ గుర్తింపు కాలంలో రెగ్యులర్ కాకుండా మిగిలిపోయిన కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయించి కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దుకు కృషి చేస్తామని ఆయన చెప్పారు. రిటైరైన, చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు కనీస పోషణ నిమిత్తం నూతన పెన్షన్ సాధిస్తామన్నారు. పే స్కేల్ అలవెన్స్‌లు సకాలంలో ఇప్పించడంతో పాటు 2013 సంవత్సరంలోని పే స్కేల్ అరియర్స్ రిటైర్మెంట్తో సంబంధం లేకుండా నగదుగా ఇప్పించేందుకు కృషిచేస్తామన్నారు. మహిళా కార్మికులకు రెస్ట్ రూం సౌకర్యం మహిళా కార్మికులకు లేట్ ఆవర్స్ డ్యూటీలో ఉన్న ఇబ్బందులు తొలగించేందుకు.. డిపోలు, ముఖ్యమైన టెర్మినల్స్ వద్ద రెస్ట్ రూం సౌకర్యం కల్పించడం, అనారోగ్యంతో ఉన్న మహిళలకు ఓ.డీ ఇప్పిస్తామని ఎన్ఎంయూ నేత ప్రసాద్ హామీ ఇచ్చారు. ఒక రీజియన్ నుంచి మరో రీజియన్‌కు, జోన్లకు తాత్కాలిక బదిలీపై వచ్చిన కార్మికులను వారి కోరిక మేరకు పర్మినెంట్ ట్రాన్స్ఫర్ ఇప్పిస్తామన్నారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్మికులపై పనిభారం తగ్గించేందుకు కృషి చేస్తామన్నారు. గుర్తింపు ఎన్నికల్లో గెలిపిస్తే కార్మిక సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీని నిర్వీర్యం చేసే అద్దె బస్సుల విధానాన్ని రద్దు చేసేందుకు కృషి చేస్తామన్నారు. సమావేశంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చల్లా చంద్రయ్య, ముఖ్య ఉపాధ్యక్షుడు డీఎస్పీ రావు, కార్యదర్శులు తోట వెంకటేశ్వరరావు, ఎల్లయ్య, సంయుక్త కార్యదర్శులు తమ్మా లకా్ష్మరెడ్డి, పీవీవీ మోహన్, వివిధ జోన్ బాధ్యులు పాల్గొన్నారు. -
ఆర్టీసీలో మహిళా డైవర్లను నియమించాలి
నేషనల్ మజ్దూర్ యూనియన్ విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: యుద్ధ విమానాల్లో మహిళలను పైలట్లుగా నియమిస్తున్న తరుణంలో ఆర్టీసీలో మహిళలను డ్రైవర్లుగా నియమించకపోవడం విచారకరమని టీఎస్ ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ అభిప్రాయపడింది. 33 శాతం మహిళా డ్రైవర్ల పోస్టులు ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదని ఎన్ఎంయూ నాయకులు ఎం.నాగేశ్వర్రావు, లక్ష్మణ్, మౌలానా సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం డ్రైవర్ పోస్టుల్లో మహిళలకు 33 శాతం కోటా భర్తీ చేయాలని కోరారు. -
పోటాపోటీగా ఆర్టీసీ కార్మికుల ర్యాలీలు
కార్మిక శాఖ సహాయక కమిషనర్‌కు, అంబేద్కర్ విగ్రహానికి టీఎంయూ వినతి {పొఫెసర్ జయశంకర్ విగ్రహానికి ఈయూ, ఎన్ఎంయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్ నాయకుల వినతిపత్రం హన్మకొండ : ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. వరంగల్ రీజియన్‌లో యూనియన్లుగా విడిపోయి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. మంగళవారం ఏడో రోజు తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఒంటరిగా, ఎంప్లాయిస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, బహుజన కార్మిక సమాఖ్య జేఏసీగా నిరసన కార్యక్రవలు నిర్వహించారు. ఈ యూనియన్ల ఆధ్వర్యంలో కార్మికులు మౌన ప్రదర్శనగా ర్యాలీ తీశారు. ఆర్టీసీ రీజినల్ జేఏసీలోని ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, బహుజన కార్మిక సమాఖ్య ఆధ్వర్యంలో కార్మికులు హన్మకొండ జిల్లా బస్‌స్టేషన్ నుంచి హన్మకొండలోని ఏకశిల పార్కు వరకు మౌనప్రదర్శన, ర్యాలీ నిర్వహించారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు. సీఎంకేసీఆర్,మంత్రులు, ఆర్టీసీ యాజమాన్యంలో మార్పు తీసుకురావాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆయూ సంఘాల నాయకులు వెంకన్న, బి.వీరన్న, ఎన్.రాజయ్య, చింత రాంచందర్, బి.రఘువీర్, సి.హెచ్.యాకస్వామి, ఎన్.కొమురయ్య, కృష్ణ, సోము, శేఖర్ పాల్గొన్నారు. టీఎంయూ ఆధ్వర్యంలో.. తెలంగాణ మజ్దూర్ యూనియన్ హన్మకొండ జిల్లా బస్‌స్టేషన్ నుంచి హన్మకొండ బాలసముద్రంలోని కార్మిక శాఖ కార్యాలయం వరకు మౌన ప్రదర్శన జరిపి కార్మిక శాఖ సహాయ కమిషనర్ మొగిలయ్యకు వినతిపత్రం అందించారు. తమ వేతన సవరణ 2013 ఏప్రిల్‌తో ముగిసిందని, అప్పటి నుంచి ఇప్పటి వరకు వేతన సవరణ చేయకుండా యాజమాన్యం తమను ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తుందని, దీంతో తాము సమ్మె చేయాల్సి వచ్చిందని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. అనంతరం కార్మిక శాఖ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ తీశారు. అంబేద్కర్ విగ్రహానికి ప్రభుత్వం, ఆర్టీసీ యా జమాన్యం మనసు మార్చాలని కోరుతూ వినతిపత్రం అం దించారు. కార్యక్రమంలో టీఎంయూ రీజినల్ అధ్యక్షుడు జితేందర్‌రెడ్డి, కార్యదర్శి ఈఎస్ బాబు, ఎం.డీ.గౌస్, ఆర్.సాంబయ్య,జి.సత్తయ్య, ఎస్ఆర్కుమార్, ఆర్.వి.గోపాల్, రవీందర్, పాషా, జోషి, కె.ఎస్.కుమార్ పాల్గొన్నారు. డిపోలకే పరిమితమైన బస్సులు హన్మకొండ : ఆర్టీసీ కార్మికుల సమ్మెతో వరంగల్ రీజియన్‌లోని 9 డిపోల్లో బస్సులు 7వ రోజు బుధవారం డిపోలకే పరిమితమయ్యాయి. కార్మికులంతా సమ్మెలో ఉండటంతో బస్సులు బయటికి వెళ్లలేదు. 56 మంది తాత్కాలిక డ్రైవర్లు విధులకు హాజరుకావడంతో 56 ఆర్టీసీ బస్సులు, 194 అద్దె బస్సులు తిరిగాయి. ఏడో రోజు కూడా ఆర్టీసీ జిల్లాలో రూ.కోటి ఆదాయాన్ని కోల్పోయింది. నేడు ఆర్ఎం కార్యాలయం ముట్టడి సమ్మెలో భాగంగా బుధవారం హన్మకొండలోని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు టీఎంయూ రీజినల్ కార్యదర్శి ఈఎస్ బాబు, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఈదురు వెంకన్న తెలిపారు. కార్యక్రమంలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.