విజయవాడ (కృష్ణా జిల్లా) : రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికలకు సంబంధించి నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్‌ఎంయూ) మేనిఫెస్టో విడుదల చేసింది. విజయవాడలోని ఏపీఎన్జీవో అసోసియేషన్ కార్యాలయంలో ఎన్‌ఎంయూ రాష్ట్ర కమిటీ సమావేశం గురువారం జరిగింది. సమావేశంలో 54 హామీలతో రూపొందించిన మేనిఫెస్టోను యూనియన్ చైర్మన్ ఆర్‌వీవీఎస్‌వీ ప్రసాద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీని విలీనం చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలయ్యేలా చూస్తామన్నారు. డ్రైవర్‌ను కండక్టర్ విధులు నిర్వర్తించాలనే నిబంధనను ప్రవేశపెట్టి కండక్టర్ల వ్యవస్థ నిర్వీర్యం చేసే ఈయూ ఒప్పందాన్ని రద్దు పరుస్తామన్నారు.
విజయవాడతోపాటు రాయలసీమ ప్రాంతంలోనూ తార్నాక తరహా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను యాజమాన్యం, ప్రభుత్వమే నిర్మించేలా ఒత్తిడి తెస్తామన్నారు. కార్మికుల నుంచి నెలకు రూ.100 మెడికల్ ఫండ్ రికవరీని నిలుపుదల చేస్తామని చెప్పారు. అన్ని జిల్లా కేంద్రాల్లో సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఈయూ గుర్తింపు కాలంలో రెగ్యులర్ కాకుండా మిగిలిపోయిన కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయించి కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దుకు కృషి చేస్తామని ఆయన చెప్పారు. రిటైరైన, చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు కనీస పోషణ నిమిత్తం నూతన పెన్షన్ సాధిస్తామన్నారు. పే స్కేల్ అలవెన్స్‌లు సకాలంలో ఇప్పించడంతో పాటు 2013 సంవత్సరంలోని పే స్కేల్ అరియర్స్ రిటైర్‌మెంట్‌తో సంబంధం లేకుండా నగదుగా ఇప్పించేందుకు కృషిచేస్తామన్నారు.
మహిళా కార్మికులకు రెస్ట్ రూం సౌకర్యం
మహిళా కార్మికులకు లేట్ ఆవర్స్ డ్యూటీలో ఉన్న ఇబ్బందులు తొలగించేందుకు.. డిపోలు, ముఖ్యమైన టెర్మినల్స్ వద్ద రెస్ట్ రూం సౌకర్యం కల్పించడం, అనారోగ్యంతో ఉన్న మహిళలకు ఓ.డీ ఇప్పిస్తామని ఎన్‌ఎంయూ నేత ప్రసాద్ హామీ ఇచ్చారు. ఒక రీజియన్ నుంచి మరో రీజియన్‌కు, జోన్‌లకు తాత్కాలిక బదిలీపై వచ్చిన కార్మికులను వారి కోరిక మేరకు పర్మినెంట్ ట్రాన్స్‌ఫర్ ఇప్పిస్తామన్నారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్మికులపై పనిభారం తగ్గించేందుకు కృషి చేస్తామన్నారు. గుర్తింపు ఎన్నికల్లో గెలిపిస్తే కార్మిక సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీని నిర్వీర్యం చేసే అద్దె బస్సుల విధానాన్ని రద్దు చేసేందుకు కృషి చేస్తామన్నారు. సమావేశంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చల్లా చంద్రయ్య, ముఖ్య ఉపాధ్యక్షుడు డీఎస్‌పీ రావు, కార్యదర్శులు తోట వెంకటేశ్వరరావు, ఎల్లయ్య, సంయుక్త కార్యదర్శులు తమ్మా లకా్ష్మరెడ్డి, పీవీవీ మోహన్, వివిధ జోన్ బాధ్యులు పాల్గొన్నారు.
'ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి'
Published Thu, Jan 21 2016 7:20 PM | Last Updated on Sun, Sep 3 2017 4:03 PM
Advertisement
Advertisement