ఆర్టీసీ బస్సులో అమర్చిన గిఫ్ట్‌బాక్స్
మీరు విజయవాడ నగరం, లేదా కృష్ణా జిల్లాలోని ఆర్టీసీ బస్సుల్లో రెగ్యులర్‌గా ప్రయాణం చేసేవారా !.. అయితే మీకు సుఖవంతమైన ప్రయాణంతో పాటు, ఊహించని బహుమతులు కూడా అదనంగా దక్కనున్నాయి. అదెలా అంటారా.. ప్రయాణికుల సంఖ్య పెంచేందుకు ఆర్టీసీ ఎంపిక చేసిన రూట్లలో వినూత్నంగా కొన్ని గిఫ్ట్ ఐటమ్స్‌ను ఇవ్వనుంది. లక్కీడిప్ ద్వారా ఎంపికైన వారికి ఆ బహుమతులు దక్కనున్నాయి. మార్చి1 నుంచి ప్రారంభమైన ఈ వినూత్న పథకం ప్రయాణికులను ఎంతమేర ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సి ఉంది..
సాక్షి, అమరావతి బ్యూరో: బస్సులో ప్రయాణించే వారి సంఖ్య పెంచడానికి ఏపీఎస్‌ఆరీ్టసీ సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళుతోంది. మరింతగా ఆదాయాన్ని ఆర్జించే లక్ష్యంతో బస్సు ప్రయాణికులకు బహుమతులను అందజేయనుంది. ఇందుకోసం ప్రాథమికంగా కొన్ని రూట్లను ఎంపిక చేసింది. ఆయా రూట్లలో తిరిగే బస్సుల్లో ప్రయాణించే వారు టిక్కెట్టు వెనక ఫోన్ నంబరు, చిరునామా రాసి దిగేటప్పుడు బాక్సులో వేయాల్సి ఉంటుంది. ఈ బస్సుల్లో టిక్కెట్లు వేయడానికి బాక్స్‌లను ఏర్పాటు చేస్తున్నారు. పదిహేను రోజులకొకసారి ఈ టిక్కెట్లను లాటరీ తీస్తారు. ఇందులో ముగ్గురిని విజేతలుగా ఎంపిక చేస్తారు. వారికి ఆకర్షణీయమైన (కుక్కర్లు, హాట్ బాక్స్‌లు, లంచ్ బాక్సులు వంటి) బహుమతులను అందజేస్తారు.
ఈనెల1 నుంచే అమల్లోకి వచ్చిన వైనం..
ఈ గిఫ్ట్ స్కీమ్‌ను ఆదివారం నుంచి అమలుకు శ్రీకారం చుట్టారు. విజయవాడ ఆర్టీసీ రీజియన్ పరిధిలో తొలిదశలో 12 రూట్లలో తిరిగే బస్సుల్లో ఈ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న (ఆక్యుపెన్సీ 65–85 శాతం) రూట్లలోనే వీటిని ప్రవేశపెడుతున్నారు. ఈ రూట్లలో ఆటోల్లోనూ ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారు. వీరిని ఆర్టీసీ బస్సుల్లోకి మళ్లించేందుకు బహుమతులను ప్రకటించారు. ఈ గిఫ్ట్ ప్రయోగం విజయవంతమైతే వచ్చే నెల నుంచి మరిన్ని రూట్లకు ఈ స్కీమ్‌ను విస్తరించాలని ఆర్టీసీ అధికారులు యోచిస్తున్నారు.
ప్రయాణికుల సంఖ్య పెంచేందుకే..
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలు పెంచేందుకు గిఫ్ట్ స్కీమ్ ప్రవేశపెట్టాం. సురక్షితం కాని ఆటోల్లో పలువురు ప్రయాణిస్తున్నారు. ఇలాంటి వారు బస్సుల్లో ప్రయాణించేందుకు ఈ స్కీమ్ దోహదపడుతుంది. ప్రయాణికుల స్పందనను బట్టి త్వరలో మరిన్ని రూట్లకు ఈ స్కీమ్‌ను విస్తరిస్తాం. ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరుతున్నాం.
–నాగేంద్రప్రసాద్, ఆర్‌ఎం, విజయవాడ రీజియన్
Comments
Please login to add a commentAdd a comment