Innovative schemes
-
రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు: సీఎస్
సాక్షి, హైదరాబాద్: ప్రజల ఆకాంక్షలు, అవసరాలకు తగ్గట్లు రాష్ట్రంలో అనేక వినూత్న పథకాలు అమలు చేస్తూ తెలంగాణ అన్ని రంగాల్లో శరవేగంగా పురోగమిస్తోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. తెలంగాణ ఏర్పడినప్పుడు 2014–15లో జీఎస్డీపీ రూ.4.16 లక్షల కోట్లు కాగా, 2021–22 నాటికి 130 శాతం వృద్ధితో రూ.11.55 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రూ.1.24 లక్షల నుంచి రూ. 2.78 లక్షలకు చేరిందన్నారు. 2014–15లో తలసరి ఆదాయంలో 11వ స్థానంలో ఉన్న తెలంగాణ 2021–22 నాటికి 3వ స్థానానికి చేరుకుందని చెప్పారు. జాతీయ భద్రత, వ్యూహాత్మక అధ్యయనం కోర్సులో భాగంగా ఎయిర్ వైస్ మార్షల్ తేజ్బీర్ సింగ్ నేతృత్వంలో ఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజీ ఫ్యాకల్టీ బృందం సోమవారం బీఆర్కేఆర్ భవన్‌ను సందర్శించి అధికారులతో సమావేశమైంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను ఈ బృందానికి సోమేశ్‌కుమార్ వివరించారు. వ్యవసాయం, నీటిపారుదల, పరిశ్రమలు, ఇతర వినూత్న కార్యక్రమాల్లో ప్రభుత్వం పెట్టుబడి వ్యయం పెంచడంతో రాష్ట్ర ఆదాయం పెరిగిందన్నారు. రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాను కూడా అమలు చేస్తుందని ఆయన తెలిపారు. పలు ఫ్లాగ్షిప్ కార్యక్రమాల గురించి అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
బస్సు ఎక్కు.. గిఫ్ట్ దక్కు!
మీరు విజయవాడ నగరం, లేదా కృష్ణా జిల్లాలోని ఆర్టీసీ బస్సుల్లో రెగ్యులర్‌గా ప్రయాణం చేసేవారా !.. అయితే మీకు సుఖవంతమైన ప్రయాణంతో పాటు, ఊహించని బహుమతులు కూడా అదనంగా దక్కనున్నాయి. అదెలా అంటారా.. ప్రయాణికుల సంఖ్య పెంచేందుకు ఆర్టీసీ ఎంపిక చేసిన రూట్లలో వినూత్నంగా కొన్ని గిఫ్ట్ ఐటమ్స్‌ను ఇవ్వనుంది. లక్కీడిప్ ద్వారా ఎంపికైన వారికి ఆ బహుమతులు దక్కనున్నాయి. మార్చి1 నుంచి ప్రారంభమైన ఈ వినూత్న పథకం ప్రయాణికులను ఎంతమేర ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.. సాక్షి, అమరావతి బ్యూరో: బస్సులో ప్రయాణించే వారి సంఖ్య పెంచడానికి ఏపీఎస్‌ఆరీ్టసీ సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళుతోంది. మరింతగా ఆదాయాన్ని ఆర్జించే లక్ష్యంతో బస్సు ప్రయాణికులకు బహుమతులను అందజేయనుంది. ఇందుకోసం ప్రాథమికంగా కొన్ని రూట్లను ఎంపిక చేసింది. ఆయా రూట్లలో తిరిగే బస్సుల్లో ప్రయాణించే వారు టిక్కెట్టు వెనక ఫోన్ నంబరు, చిరునామా రాసి దిగేటప్పుడు బాక్సులో వేయాల్సి ఉంటుంది. ఈ బస్సుల్లో టిక్కెట్లు వేయడానికి బాక్స్‌లను ఏర్పాటు చేస్తున్నారు. పదిహేను రోజులకొకసారి ఈ టిక్కెట్లను లాటరీ తీస్తారు. ఇందులో ముగ్గురిని విజేతలుగా ఎంపిక చేస్తారు. వారికి ఆకర్షణీయమైన (కుక్కర్లు, హాట్ బాక్స్‌లు, లంచ్ బాక్సులు వంటి) బహుమతులను అందజేస్తారు. ఈనెల1 నుంచే అమల్లోకి వచ్చిన వైనం.. ఈ గిఫ్ట్ స్కీమ్‌ను ఆదివారం నుంచి అమలుకు శ్రీకారం చుట్టారు. విజయవాడ ఆర్టీసీ రీజియన్ పరిధిలో తొలిదశలో 12 రూట్లలో తిరిగే బస్సుల్లో ఈ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న (ఆక్యుపెన్సీ 65–85 శాతం) రూట్లలోనే వీటిని ప్రవేశపెడుతున్నారు. ఈ రూట్లలో ఆటోల్లోనూ ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారు. వీరిని ఆర్టీసీ బస్సుల్లోకి మళ్లించేందుకు బహుమతులను ప్రకటించారు. ఈ గిఫ్ట్ ప్రయోగం విజయవంతమైతే వచ్చే నెల నుంచి మరిన్ని రూట్లకు ఈ స్కీమ్‌ను విస్తరించాలని ఆర్టీసీ అధికారులు యోచిస్తున్నారు. ప్రయాణికుల సంఖ్య పెంచేందుకే.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలు పెంచేందుకు గిఫ్ట్ స్కీమ్ ప్రవేశపెట్టాం. సురక్షితం కాని ఆటోల్లో పలువురు ప్రయాణిస్తున్నారు. ఇలాంటి వారు బస్సుల్లో ప్రయాణించేందుకు ఈ స్కీమ్ దోహదపడుతుంది. ప్రయాణికుల స్పందనను బట్టి త్వరలో మరిన్ని రూట్లకు ఈ స్కీమ్‌ను విస్తరిస్తాం. ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరుతున్నాం. –నాగేంద్రప్రసాద్, ఆర్ఎం, విజయవాడ రీజియన్ -
యువతతో స్వయం సహాయక సంఘాలు
- సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం - పైలట్ ప్రాజెక్ట్ కింద సదాశివపేట మండలం ఎంపిక సదాశివపేట రూరల్ :విధానంలో భాగంగా యువత కోసం వినూత్న పథకాలు కార్యక్రమాలను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా యువజన సంఘాలు, అధికారులు, జాతీయ యువజన అవార్డు గ్రహీతల అభిప్రాయాలు సేకరించింది. యువత సేవా కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా మండల స్థాయిలో ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. యువజన సంఘాలు, రక్తదాన శిబిరాలు, అవయవ దానాల పై అవగాహన సదస్సులు, మొక్కలు నాటే కార్యక్రమం హరితహారం, స్వచ్ఛ తెలంగాణ-స్వచ్ఛ భారత్, మిసన్ కాకతీయ, యోగా స్పోర్ట్స్, సాంస్కతి కార్యక్రమాలు నిర్వహించిన వారికి తగిన గుర్తింపు ఇవ్వనుంది. రిపబ్లిక్ డే, స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా జిలా, మండల స్థాయిలో అవార్డులను ఇచ్చి ప్రోత్సహించనుంది. సోషల్ మీడియా ద్వారా.. యువజన సంఘం వారి పేరు మీద ఫేస్బుక్ క్రియేట్ చేసి అందులో చేసే కార్యక్రమాలను పొందుపరిచారు. అలాగే ఈ-మెయిల్ ఐడీని సైతం క్రియేట్ చేయాలి. ప్రతి మండలానికి మండల పరిషత్ అధికారి మండల యువజన అధికారిగా వ్యవహరించనున్నారు. ఇకనుంచి యువజన వ్యవహారాలన్నీ మండల స్థాయిలో మండల పరిషత్ అధికారులు చూస్తారు. యువజన భవనాల నిర్మాణం... యువత సంస్థాగత తోడ్పాటు కోసం దేశంలో తొలిసారిగా యూత్ భవనాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంపీలు, ఎమ్మెల్యేల నియోజకవర్గ నిధుల నుంచి ఈ భవనాలను నిర్మించేందుకు వెసులుబాటు కల్పించింది. అందులోనే మల్టీలెవల్ ట్రైనింగ్ ఇచ్చేందుకు, గ్రంథాలయం ఉపయోగపడే విధంగా నిర్మించనున్నారు. యువతకు స్థానిక చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కల్పించనుంది. యువతకు మీ సేవ కేంద్రాలను కేటాయించేందుకు నిర్ణయం తీసుకోనున్నారు. యువజన సంఘ సభ్యులకు ప్రమాద బీమా కల్పించేందుకు నివేదిక రూపొందిస్తున్నారు. సదాశివపేట మండలం ఎంపిక... జిల్లాలో యువచేతన కార్యక్రమంలో భాగంగా 11 మండలాలను ఎంపిక చేశారు. అందులో సదాశివపేట మండలం ఎంపికైంది. ఈ మండలాల్లో పథకం విజయవంతమైతే దశలవారీగా విస్తరించనున్నారు. మండలాల వారు రిజిస్ట్రేషన్ యాక్టు ప్రకారం యూత్ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉండాలి. బ్యాంకు ఖాతా యువజన సంఘం పేరు మీదే ఉండాలి. క్లబ్‌లోని సభ్యులంతా 18 నుంచి 35 సంవత్సరాల వారై ఉండాలి. యువజన సంఘాలను పాతవైనా, కొత్తవైనా సంబంధిత గ్రామ కార్యదర్శి ద్వారా మండల అభివద్ధి అధికారి కార్యాలయంలో దరఖాస్తు అందజేయాలి. మరిన్ని వివరాలకు జిల్లాలోని సంగారెడ్డి జిల్లా యువజన సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించవచ్చు. యువతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి : సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వం యువత సంక్షేమం కోసం ప్రత్యేక దృష్టి పెట్టింది. యువత తమ కాళ్ల మీద తాము నిలబడే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. యువత కోసం అనేక పథకాలను అమలు చేయనుంది. సేవా కార్యక్రమాలను నిర్వహించే వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలను అందజేయాలని పరిశీలిస్తోంది. మొదటి పైలట్ ప్రాజెక్ట్ కింద జిల్లాలో 11 మండలాలను ఎంపిక చేశారని, వీటిలో సదాశివపేట మండలం ఎంపిక కావడం మండల యువతకు వరమన్నారు. -
సిద్దిపేట.. ఇక క్లీన్ సిటీ!
♦ మున్సిపాలిటీని ఎంపిక చేసిన కేంద్రం ♦ సమగ్రాభివృద్ధికి కొత్త ప్రణాళిక ♦ అన్ని వర్గాలచే టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు ♦ రూ. 144 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు ♦ దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం నివేదిక సిద్దిపేట జోన్: వినూత్న పథకాలు, ప్రయోగాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీకి కేంద్రం మరో అవకాశాన్ని కల్పించింది. శానిటేషన్‌ను ఆధారంగా పట్టణాన్ని సమగ్రాభివృద్ధి సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని ఐదు కార్పొరేషన్లను, ఐదు మున్సిపాలిటీలను ఎంపిక చేసింది. జిల్లా నుంచి సిద్దిపేటకు అవకాశం దక్కడం విశేషం. శానిటేషన్ టాస్క్‌ఫోర్స్ పేరిట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచన మేరకు సిద్దిపేట మున్సిపల్ అధికారులు శుక్రవారం కొత్త ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ ముఖ్యులుగా పట్టణంలోని విభిన్న వర్గాలకు చెందిన 30 మందితో టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసి తొలిసమావేశం నిర్వహించారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో సమగ్రాభివృద్ధి కోసం రూ. 144 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు అందజేసేందుకు భవిష్యత్తు ప్రణాళికను రూపొందించారు. ఇటీవల కేంద్రం తెలంగాణలోని 64 మున్సిపాలిటీల్లో లక్ష జనాబా ప్రతిపాదికను ప్రమాణికంగా తీసుకుని ఐదు మున్సిపాలిటీలను ఎంపిక చేసింది. వాటిలో సిద్దిపేటకు అవకాశం దక్కింది. ఇప్పటికే పట్టణంలో వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ ప్రక్రియలో ముందుకు సాగుతున్న సిద్దిపేట.. ఇంటింటికి తడి, పొడి చెత్తసేకరణతో పారిశుద్ద్యంపై ప్రత్యేక దృష్టిసారించింది. ఈ క్రమంలోనే పట్టణంలో కంపోస్ట్ యార్డు, డంప్‌యార్డుతో పాటు తడిపొడి చెత్త సేకరణ ఐటీసీ హబ్‌లాంటి వినూత్న ప్రయోగాలను కొన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలోనే శానిటేషన్‌ను వందశాతం సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కేంద్రం, రాష్ట్రం నుంచి వివిధ పథకాల ద్వారా విడుదలవుతున్న నిధుల వివరాలను, వాటి వినియోగాన్ని నివేదిక రూపంలో అందించాలని ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్తు ప్రణాళికపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు సిద్దిపేట మున్సిపల్ పాలకవర్గం అడుగు ముందుకేసింది. చైర్మన్, కమిషనర్ నేతృత్వంలో పట్టణంలోని స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు, మహిళ సంఘాలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసు శాఖకు చెందిన అధికారులచే టాస్క్‌పోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఆయా వార్డుల్లో ప్రజల ఆవసరాలను, మున్సిపల్ పరంగా చేపట్టాల్సిన గురుతర భాద్యతను సలహసూచనల రూపంలో టాస్క్ఫోర్సు నివేదిక రూపొందించాల్సి ఉంది. ముఖ్యంగా శానిటేషన్, నీటి సరఫరాపై ఇప్పటికే సఫలీకృత బాటలో ఉన్న మున్సిపల్‌కు కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం కింద సీవరేజి ప్లాంట్, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటుకు నిధులను కూడా కేటాయించారు. ఈ ప్రక్రియ విజయవంతం అయితే సిద్దిపేట పట్టణం స్మార్ట్సీటితో పాటు క్లిన్సిటీగా మారడం ఖాయం ఆ దిశగా భవిష్యత్తు ప్రణాళిక కోసం మున్సిపల్ అధికారులు రూ. 144 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదన నివేదికను అందించనున్నారు.