యువతతో స్వయం సహాయక సంఘాలు
- సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం
- పైలట్ ప్రాజెక్ట్ కింద సదాశివపేట మండలం ఎంపిక
సదాశివపేట రూరల్ :విధానంలో భాగంగా యువత కోసం వినూత్న పథకాలు కార్యక్రమాలను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా యువజన సంఘాలు, అధికారులు, జాతీయ యువజన అవార్డు గ్రహీతల అభిప్రాయాలు సేకరించింది. యువత సేవా కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా మండల స్థాయిలో ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది.
యువజన సంఘాలు, రక్తదాన శిబిరాలు, అవయవ దానాల పై అవగాహన సదస్సులు, మొక్కలు నాటే కార్యక్రమం హరితహారం, స్వచ్ఛ తెలంగాణ-స్వచ్ఛ భారత్, మిసన్ కాకతీయ, యోగా స్పోర్ట్స్, సాంస్కతి కార్యక్రమాలు నిర్వహించిన వారికి తగిన గుర్తింపు ఇవ్వనుంది. రిపబ్లిక్ డే, స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా జిలా, మండల స్థాయిలో అవార్డులను ఇచ్చి ప్రోత్సహించనుంది.
సోషల్ మీడియా ద్వారా..
యువజన సంఘం వారి పేరు మీద ఫేస్‌బుక్ క్రియేట్ చేసి అందులో చేసే కార్యక్రమాలను పొందుపరిచారు. అలాగే ఈ-మెయిల్ ఐడీని సైతం క్రియేట్ చేయాలి. ప్రతి మండలానికి మండల పరిషత్ అధికారి మండల యువజన అధికారిగా వ్యవహరించనున్నారు. ఇకనుంచి యువజన వ్యవహారాలన్నీ మండల స్థాయిలో మండల పరిషత్ అధికారులు చూస్తారు.
యువజన భవనాల నిర్మాణం...
యువత సంస్థాగత తోడ్పాటు కోసం దేశంలో తొలిసారిగా యూత్ భవనాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంపీలు, ఎమ్మెల్యేల నియోజకవర్గ నిధుల నుంచి ఈ భవనాలను నిర్మించేందుకు వెసులుబాటు కల్పించింది. అందులోనే మల్టీలెవల్ ట్రైనింగ్ ఇచ్చేందుకు, గ్రంథాలయం ఉపయోగపడే విధంగా నిర్మించనున్నారు.
యువతకు స్థానిక చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కల్పించనుంది. యువతకు మీ సేవ కేంద్రాలను కేటాయించేందుకు నిర్ణయం తీసుకోనున్నారు. యువజన సంఘ సభ్యులకు ప్రమాద బీమా కల్పించేందుకు నివేదిక రూపొందిస్తున్నారు.
సదాశివపేట మండలం ఎంపిక...
జిల్లాలో యువచేతన కార్యక్రమంలో భాగంగా 11 మండలాలను ఎంపిక చేశారు. అందులో సదాశివపేట మండలం ఎంపికైంది. ఈ మండలాల్లో పథకం విజయవంతమైతే దశలవారీగా విస్తరించనున్నారు. మండలాల వారు రిజిస్ట్రేషన్ యాక్టు ప్రకారం యూత్ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉండాలి. బ్యాంకు ఖాతా యువజన సంఘం పేరు మీదే ఉండాలి. క్లబ్‌లోని సభ్యులంతా 18 నుంచి 35 సంవత్సరాల వారై ఉండాలి. యువజన సంఘాలను పాతవైనా, కొత్తవైనా సంబంధిత గ్రామ కార్యదర్శి ద్వారా మండల అభివద్ధి అధికారి కార్యాలయంలో దరఖాస్తు అందజేయాలి. మరిన్ని వివరాలకు జిల్లాలోని సంగారెడ్డి జిల్లా యువజన సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించవచ్చు.
యువతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి : సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
రాష్ట్ర ప్రభుత్వం యువత సంక్షేమం కోసం ప్రత్యేక దృష్టి పెట్టింది. యువత తమ కాళ్ల మీద తాము నిలబడే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. యువత కోసం అనేక పథకాలను అమలు చేయనుంది. సేవా కార్యక్రమాలను నిర్వహించే వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలను అందజేయాలని పరిశీలిస్తోంది. మొదటి పైలట్ ప్రాజెక్ట్ కింద జిల్లాలో 11 మండలాలను ఎంపిక చేశారని, వీటిలో సదాశివపేట మండలం ఎంపిక కావడం మండల యువతకు వరమన్నారు.