
సాక్షి, హైదరాబాద్: ప్రజల ఆకాంక్షలు, అవసరాలకు తగ్గట్లు రాష్ట్రంలో అనేక వినూత్న పథకాలు అమలు చేస్తూ తెలంగాణ అన్ని రంగాల్లో శరవేగంగా పురోగమిస్తోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. తెలంగాణ ఏర్పడినప్పుడు 2014–15లో జీఎస్‌డీపీ రూ.4.16 లక్షల కోట్లు కాగా, 2021–22 నాటికి 130 శాతం వృద్ధితో రూ.11.55 లక్షల కోట్లకు పెరిగిందన్నారు.
రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రూ.1.24 లక్షల నుంచి రూ. 2.78 లక్షలకు చేరిందన్నారు. 2014–15లో తలసరి ఆదాయంలో 11వ స్థానంలో ఉన్న తెలంగాణ 2021–22 నాటికి 3వ స్థానానికి చేరుకుందని చెప్పారు. జాతీయ భద్రత, వ్యూహాత్మక అధ్యయనం కోర్సులో భాగంగా ఎయిర్ వైస్ మార్షల్ తేజ్బీర్ సింగ్ నేతృత్వంలో ఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజీ ఫ్యాకల్టీ బృందం సోమవారం బీఆర్‌కేఆర్ భవన్‌ను సందర్శించి అధికారులతో సమావేశమైంది.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను ఈ బృందానికి సోమేశ్‌కుమార్ వివరించారు. వ్యవసాయం, నీటిపారుదల, పరిశ్రమలు, ఇతర వినూత్న కార్యక్రమాల్లో ప్రభుత్వం పెట్టుబడి వ్యయం పెంచడంతో రాష్ట్ర ఆదాయం పెరిగిందన్నారు. రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాను కూడా అమలు చేస్తుందని ఆయన తెలిపారు. పలు ఫ్లాగ్‌షిప్ కార్యక్రమాల గురించి అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.