విశాఖ సిటీ: సార్వత్రిక సమరంలో ఒక్కో అభ్యర్థిది ఒక్కో చిత్రమైన పరిస్థితి. దీనికి కారణం 2009లో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన. ఈ ప్రక్రియ సజావుగానే సాగినా ఎన్నికల సమయంలో లోక్‌సభ నియోజకవర్గానికి వచ్చేసరికి ఏ గ్రామం తమ నియోజకవర్గ పరిధిలో ఉందో తెలుసుకోవడం కష్టంగా మారిందని ఎంపీ అభ్యర్థులు అంటున్నారు. రాష్ట్రంలోని 9 నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉంది.
నాలుగు జిల్లాల అరకు
అరకు ఏకంగా నాలుగు జిల్లాల సమాహారం. విశాఖ జిల్లా పాడేరు, అరకు అసెంబ్లీ స్థానాలతో పాటు విజయనగరం జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, కురుపాం, శ్రీకాకుళం జిల్లా పాలకొండ, తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం అసెంబ్లీ సెగ్మెంట్లు దీని పరిధిలో ఉన్నాయి.
ఈ స్థానాలు రెండేసి జిల్లాల్లో..
8 పార్లమెంట్ నియోజకవర్గాల్లో రెండు జిల్లాలకు చెందిన అసెంబ్లీ నియోజకవర్గాలు ఇమిడి ఉన్నాయి.
♦ విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గంలో ఆ జిల్లాకు చెందిన బొబ్బిలి, గజపతినగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, విజయనగరం అసెంబ్లీ స్థానాలుండగా శ్రీకాకుళం జిల్లాలోని రాజాం, ఎచ్చెర్ల సెగ్మెంట్లు ఉన్నాయి.
♦ విశాఖపట్నం ఎంపీ స్థానంలో విశాఖ ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ, గాజువాక, భీమిలి, విజయనగరం జిల్లా ఎస్.కోట అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి.
♦ రాజమండ్రి లోక్‌సభ స్థానంలో అనపర్తి, రాజానగరం, రాజమండ్రి రూరల్, రాజమండ్రి సిటీ, పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు, కొవ్వూరు, గోపాలపురం అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
♦ ఏలూరు పార్లమెంట్ స్థానంలో దెందులూరు, ఏలూరు, పోలవరం, ఉంగుటూరు, చింతలపూడి అసెంబ్లీ స్థానాలు, కృష్ణా జిల్లా నూజివీడు, కైకలూరు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి.
♦ బాపట్ల లోక్‌సభ స్థానంలో రేపల్లె, వేమూరు, బాపట్ల అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా, ప్రకాశం జిల్లాలోని పర్చూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు అసెంబ్లీ స్థానాలున్నాయి.
♦ రాజంపేట పార్లమెంట్ స్థానంలో వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన కోడూరు, రాజం పేట, రాయచోటి అసెంబ్లీ స్థానాలు, చిత్తూరు జిల్లా పీలేరు, తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు స్థానాలున్నాయి.
♦ నెల్లూరు ఎంపీ స్థానంలో కావలి, ఆత్మకూరు, కొవ్వూరు, నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ, ఉదయగిరి, ప్రకాశం జిల్లాలోని కందుకూరు ఉన్నాయి.
♦ తిరుపతి లోక్‌సభ స్థానం పరిధిలో తిరు పతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజక వర్గాలుండగా, నెల్లూరు జిల్లాలోని గూడూరు, సర్వేపల్లి, వెంకటగిరి, సూళ్లూరుపేట అసెంబ్లీ స్థానాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment