పెదలబుడులో గోడల స్థాయిలో నిలిచిన సోమెలి అద్దు గృహ నిర్మాణం
ఉదాత్త హృదయంతో తమ ప్రాంతాన్ని ఎవరైనా ప్రముఖుడు దత్తత తీసుకుంటే హమ్మయ్యా.. ఊరు బాగు పడుతుందని ఊరట చెందుతాం. ఏకంగా సీఎం హోదాలో ఉన్న వ్యక్తే దత్తత తీసుకుంటే ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతుందోనని ఆశిస్తాం. విశాఖ జిల్లా అరకు లోయ మండలం పెదలబుడు పంచాయతీని దత్తత తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించగానే కల్మషం లేని ఆ అడవి బిడ్డలు కూడా అలాగే ఎంతో ఆనందించారు. తమ బతుకులు మారిపోతాయని, ఊరు రూపురేఖలు మారిపోతాయని సంబరపడ్డారు. కానీ ఐదేళ్లైనా వారి జీవితాల్లో ఎలాంటి మార్పు లేదు. ఇప్పుడక్కడ ముఖ్యమంత్రి పేరెత్తితే చాలు ‘ఇక నమ్మం బాబూ.. నమ్మం’ అని అంటున్నారు.
రోడ్లు లేవు.. నీళ్లూ కరువే..
గత ఎన్నికల అనంతరం స్మార్ట్ విలేజ్ పథకంలో భాగంగా ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకు లోయ ప్రాంతం ఉన్న పెదలబుడు పంచాయతీని తాను స్వయంగా దత్తత తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. పెదలబుడు మేజర్ పంచాయతీలో 21 శివారు గ్రామాలున్నాయి. 12,250 మంది జనాభా కాగా 7 వేల మంది ఓటర్లున్నారు. అత్యధిక గ్రామాల్లో అంతర్గత రోడ్లు, డ్రైన్లు, రక్షిత తాగునీరు లాంటి కనీస సౌకర్యాలు లేవు. అరకులో సైతం పైపై మెరుగులే తప్ప సరైన డ్రైనేజీ కూడా లేని దుస్థితి. 2016లో ఆదివాసీ దినోత్సవం రోజు అక్కడ అడుగు పెట్టిన సీఎం హామీల వర్షం కురిపించారు. ఆదివాసీ ఉత్సవాలంటూ లెక్కలేనన్ని వాగ్దానాలు చేసి ఏ ఒక్కటీ నిలబెట్టుకోలేదు.
ఆదర్శం మరచి అధ్వాన్నం..
పెదలబుడు పంచాయతీని చంద్రబాబు దత్తత తీసుకుని నాలుగున్నరేళ్లు దాటింది. పంచాయతీ పరిధిలోని గ్రామాలు కాదు కదా కనీసం పంచాయతీ కేంద్రాన్ని కూడా ఆదర్శవంతంగా తీర్చిదిద్దిన పాపాన పోలేదు. ఏ ఒక్క గ్రామంలోనూ డ్రైన్లు లేవు. ఎక్కడా ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేయలేదు. మంచినీటి పథకాలున్నా పని చేయని దుస్థితి నెలకొంది. రూ.6.25 కోట్లతో సిమెంట్ రోడ్లు నిర్మిస్తామని ఇచ్చిన హామీ ఆచరణకు నోచుకోలేదు. అరకులోయ పట్టణ పరిధిలోని కంఠబంసగుడ, పాత పోస్టాఫీస్ కాలనీ, శరభగుడ ప్రాంతాలలో ఒక్క సిమెంట్ రోడ్డు కూడా నిర్మించలేదు. స్కూళ్లకు వెళ్లే విద్యార్ధులు బురదలో నడవలేక అవస్థ పడుతున్నారు. రూ.5 కోట్లతో అరకులోయలో 16.5 కిలోమీటర్ల పొడవున అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్న హామీని గాలికి వదిలేశారు. అరకులోయ మెయిన్ రోడ్డు విస్తరణ–సుందరీకరణ పనులు కార్యరూపం దాల్చలేదు. పాణిరంగిణి గ్రామానికి సామాజిక భవనం, గ్రంథాలయ భవనం మంజూరు కాలేదు.
వైద్యం అందని ద్రాక్షే
అరకు ప్రాంతీయ ఆస్పత్రిలో 100 పడకలు ఉన్నప్పటికి పూర్తిస్థాయిలో వైద్యులు, స్పెషలిస్టులను నియమించ లేదు. 13 మంది వైద్యులు ఉండాల్సిన ఆస్పత్రి కేవలం ముగ్గురితోనే పని చేస్తోంది. అత్యవసర వైద్యం కోసం 117 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖ కేజీహెచ్‌కు పరుగులు తీయాల్సిందే.
కలగా ఉన్నత విద్య
సీఎం హామీ ఇచ్చినట్లుగా ఇంజనీరింగ్, బీఈడీ, నర్సింగ్, మహిళా డిగ్రీ కళాశాలల్లో ఏ ఒక్కటీ ఇంతవరకు ఏర్పాటు కాలేదు. రవ్వలగుడ ప్రాంతంలో గురుకుల స్పోర్ట్స్ స్కూల్‌కు సొంత భవనాలను నిర్మించలేదు. అరకు లోయలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు కాలేదు. ఏకలవ్య పాఠశాలలకు సొంత భవనాల నిర్మాణం జరగలేదు.
కానరాని పర్యాటకాభివృద్ధి..
అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు దక్కలేదు. కాఫీ సాగు చేస్తున్న గిరిజన రైతులకు గిట్టుబాటు ధర లభించక అప్పుల పాలవుతున్నారు. థింసా కళాకారులకు పింఛన్ సౌకర్యం లేదు. రూ.110 కోట్లతో అరకు టూరిజం సర్క్యూట్ ప్రతిపాదనల దశ దాటలేదు. అపరల్ పార్కు జాడ లేదు. ఏజెన్సీలో ఏ ఒక్క రైతుకు 90 శాతం రాయితీపై విత్తనాలు సరఫరా చేసినదాఖలాలు లేవు. – పంపాన వరప్రసాదరావుసాక్షి, విశాఖపట్నం
ఉత్త ‘గ్యాస్’.. కలగానే ఇళ్లు
ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ అందిస్తామన్న హామీ అమలు కాలేదు. ఇప్పటికి గ్యాస్ కనెక్షన్ లేని కుటుంబాలు 200కిపైగానే ఉన్నాయి. వ్యక్తిగత మరుగుదొడ్లు లేని వారు వందల్లో ఉన్నారు. నిర్మించుకున్న వారికి బిల్లులు చెల్లించలేదు. బిల్లులు అందక ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులు మూడేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అప్పులు చేసి కట్టుకున్న సుమారు 150 మందికి బిల్లులు చెల్లించలేదు. పలు గ్రామాలలో ఎన్టీఆర్ ఇళ్లు గోడలకే పరిమితమయ్యాయి. ఫైబర్‌గ్రిడ్ కోసం దాదాపు 2 వేల మంది దరఖాస్తు చేయగా కేవలం 750 కనెక్షన్లు మాత్రమే ఇచ్చారు.
ఇంటి నిర్మాణం ఆగిపోయింది
అష్ట కష్టాలు పడి చేపట్టిన ఇంటి నిర్మాణంప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో మధ్యలోనే నిలిచిపోయింది. ఎన్టీఆర్ గృహ నిర్మాణం కింద చేపట్టిన ఇంటి నిర్మాణం పూర్తికాక గుడిసెలో ఉంటున్నా. – సోమెలి అద్దు, పెదలబుడు
మోసగించారు
పెదలబుడు పంచాయతీ గ్రామమైన పానిరంగినిలో గ్రంథాలయం, సామాజిక భవనం నిర్మిస్తామని చెప్పి రెండేళ్లు కావస్తున్నా పనులు మాత్రం మొదలు కాలేదు.ఈ భవనాలకు నిధులు కూడా మంజూరు చేయలేని దుస్థితిలో చంద్రబాబు పాలన ఉంది. మాయ మాటలతో గిరిజనులను మోసం చేసారు. –శెట్టి రామారావు, పానిరంగిని గ్రామం
ఇంటింటికీ కుళాయిలు ఉత్తదే
తాగునీటికి ఇబ్బందులు పడుతున్నాం. ఇంటింటికి కుళాయిల ద్వారా సురక్షిత తాగునీరు పంపిణీ చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించి మూడేళ్లు కావస్తున్నా ఇచ్చింది లేదు. తాగునీరును మోసుకుంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. – కిల్లో మోని,బిష్ణుగుడ గ్రామం
Comments
Please login to add a commentAdd a comment