దళపతులు నిర్ణయమయ్యారు. ఎన్నికల యుద్ధంలో వైఎస్సార్‌సీపీని విజయతీరం చేర్చేందుకు రెట్టించిన ఉత్సాహంతో ఉరకలెత్తుతున్నారు. మీ వెంటే మేమంటూ లక్షలాదిగా ఉన్న పార్టీ కార్యకర్తల సైన్యం కదం తొక్కుతోంది. బీసీలకు పెద్దపీట వేస్తూ.. సామాజిక న్యాయానికి సరికొత్త భాష్యం చెబుతూ.. పార్టీ సారధి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్థుల జాబితా ఆ పార్టీలో నవ్యోత్సాహం నింపింది. జిల్లాలోని 15 అసెంబ్లీ సీట్లలో ఏకంగా ఆరు బీసీలకు కేటాయించడం, మరో మూడు ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఆ ఉత్సాహంతో పార్టీ నేతలు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యంగా కదంతొక్కేందుకు సిద్ధమవుతున్నారు.
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర రాజకీయాల్లో ముందెన్నడూ లేనివిధంగా ఒకేసారి అభ్యర్థులందరినీ ప్రకటించి చరిత్ర సృష్టించిన వైఎస్సార్‌సీపీ.. బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట వేసి ప్రత్యర్థి పార్టీలకు సవాల్ విసిరింది. నామినేషన్ల ఘట్టం ప్రారంభానికి 24 గంటల ముందుగానే ఒకేసారి 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ అభ్యర్థుల జాబితాలను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇడుపులపాయలో ఆదివారం ప్రకటించారు. జిల్లాలోని మూడు లోక్‌సభ, 15 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల నిర్ణయంలో సామాజిక సమతూకం పాటించడం కొత్త జోష్ నింపింది. అభ్యర్థుల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మరీ ముఖ్యంగా జిల్లాలో మెజార్టీ సామాజికవర్గాలైన బీసీలకు అగ్రపీఠం వేశారు. అధికార టీడీపీ అంచనాలను తలకిందులు చేస్తూ ఆ వర్గాలకు ఎంపీ స్థానంతోసహా ఏడు సీట్లు కేటాయించారు. ఇక ఇతర సామాజికవర్గాల పరంగా చూస్తే కాపులకు రెండు, క్షత్రియులకు రెండు, బ్రాహ్మణులకు ఒకటి, రెడ్లకు ఒకటి, కమ్మకు ఒకటి, ఎస్సీలకు ఒకటి, ఎస్టీలకు మూడు సీట్లు కేటాయించారు. పార్టీ తరఫున నలుగురు మహిళలను చట్టసభలకు పంపించే అరుదైన అవకాశాన్ని కల్పించడం విశేషం. లోక్‌సభకు ఇద్దరు, అసెంబ్లీకి ఇద్దరు మహిళలను ఎంపిక చేశారు. అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి డాక్టర్ కాండ్రేగుల సత్యవతి, అరుకు లోక్‌సభ స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే గొడ్డేటి దేవుడు కుమార్తె గొడ్డేటి మాధవి, అలాగే భీమిలి అసెంబ్లీ నుంచి అక్కరమాని విజయనిర్మల, పాడేరు అసెంబ్లీకి మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి చిట్టినాయుడు కుమార్తె కొట్టగుళ్లి భాగ్యలక్ష్మికి అవకాశం కల్పించారు.
తొలిసారి8 మందికి ఛాన్స్
పార్టీ తరపున బరిలోకి దిగుతున్న వారిలో ఎనిమిది మందికి తొలిసారి ఎన్నికల బరిలో నిలవడం మరో విశేషం. మూడు లోక్‌సభ స్థానాల నుంచి బరిలోకి దింపిన అభ్యర్థులు కొత్తవారే. పాడేరు, అరుకు, విశాఖ తూర్పు, ఉత్తరం, పెందుర్తి అసెంబ్లీ అభ్యర్థులు కూడా ఎన్నికలకు కొత్తవారే. అదే విధంగా పార్టీనే నమ్ముకుని పార్టీ కోసం అహర్నిశలు పాటుపడుతున్న వారికి అగ్రపీఠం వేశారు. పార్టీ కో ఆర్డినేటర్లలో 16మందికి టికెట్లు కేటాయించారు. విశాఖ, అరుకు లోక్‌సభ టికెట్లను కో ఆర్డినేటర్లకే కేటాయించారు. అదే విధంగా విశాఖ దక్షిణం మినహా మిగిలిన వారందరూ కో ఆర్డినేటర్లుగా పనిచేసిన వారే. తనతో పాటు పార్టీ జెండాపై గెలుపొందిన ఇరువురు ఎమ్మెల్యేలు అధికార పార్టీ ప్రలోభా లకు లొంగి ఫిరాయింపులకు పాల్పడగా, తాను మాత్రం ప్రలోభాలకు గురికాకుండా పార్టీలోనే కొనసాగిన శాసనసభ పక్ష ఉపనేత బూడి ము త్యాలనాయుడు తిరిగి మాడుగుల సీటునే కేటాయించారు.
టీడీపీలో కానరాని సామాజిక న్యాయం
అధికార టీడీపీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం ఎక్కడా కన్పించలేదు. ఇప్పటి వరకు పది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను టీడీపీ ప్రకటించింది. మూడు పార్లమెంటు స్థానాలతో పాటు ఐదు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయలేక మల్లగుల్లాలు పడు తోంది. ఇప్పటివరకు ప్రకటించిన 10 స్థానాల్లో తొమ్మిది చోట్ల సిట్టింగ్‌లకే అవకాశం కల్పించింది. సామాజిక వర్గాల సమతూకం కూడా పాటించిన దాఖలాలు కన్పించలేదు. ఒకే ఒక్క మహిళకు ఇప్పటి వరకు ప్రకటించిన స్థానాల్లో అవకాశం కల్పించారు. ఇంకా ప్రకటించనున్న స్థానాల్లో కూడా మహిళలకు కేటాయించే అవకాశాలు కన్పించడంలేదని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు.
లోక్‌సభ అభ్యర్థులు
విశాఖæ–ఎంవీవీ సత్యనారాయణ(ఓసీ–కమ్మ)
అనకాపల్లిæ– డాక్టర్ కాండ్రెగుల సత్యవతి(బీసీ–గవర)
అరకు –గొడ్డేటి మాధవి(ఎస్టీ–కొండదొర)
అసెంబ్లీ అభ్యర్థులు
అనకాపల్లి – గుడివాడ అమర్‌నా«థ్ (కాపు)
యలమంచిలి– యూవీ రమణమూర్తి (ఓసీ–క్షత్రియ)
పాయకరావుపేట– గొల్ల బాబురావు(ఎస్సీ –మాల)
నర్సీపట్నం–పెట్ల ఉమాశంకర్ గణేష్(బీసీ–వెలమ)
చోడవరం– ధర్మశ్రీ(బీసీ–కాపు)
మాడుగుల– బూడి ముత్యాలనాయుడు(బీసీ–వెలమ)
పెందుర్తి–అన్నంరెడ్డి అధీప్‌రాజ్(బీసీ–వెలమ)
అరకు– శెట్టి పాల్గుణ(వాల్మీకి–ఎస్టీ)
పాడేరు–కొట్టగుల్లి భాగ్యలక్ష్మి(ఎస్టీ–భగత)
భీమిలి–అవంతి శ్రీనివాస్(కాపు)
విశాఖ తూర్పు– అక్కరమాని విజయనిర్మల(బీసీ–యాదవ్)
విశాఖ పశ్చిమ– మళ్ల విజయప్రసాద్(బీసీ–గవర)
విశాఖ దక్షిణ–ద్రోణంరాజు శ్రీనివాస్(ఓసీ–బ్రాహ్మణ)
విశాఖ ఉత్తర– కమ్మిల కన్నపురాజు(కె.కెరాజు)(ఓసీ–క్షత్రియ)
గాజువాక– తిప్పల నాగిరెడ్డి(రెడ్డి)
Comments
Please login to add a commentAdd a comment