పులకింతల అరకు | Araku celebrations For Two Days | Sakshi
Sakshi News home page

పులకింతల అరకు

Published Sat, Feb 29 2020 11:07 AM | Last Updated on Wed, Mar 4 2020 11:46 AM

Araku celebrations For Two Days - Sakshi

అరకులోయ: మన్యం ప్రకృతి సొగసుల నిలయం.  ఎటుచూసినా పచ్చందాల కనువిందే. జలపాతాల గలగలలు.. కొండ కోనల్లో సాగే ప్రయాణాలు.. పలకరించే కాఫీతోటలు.. ఆకట్టుకునే గిరిజనుల సంప్రదాయాలు.. ఇలా ఒక్కటేమిటి ఎన్నో అందాల సమాహారం. అందుకే అరకులోయ ఆంధ్రాఊటీగా ఖ్యాతిగాంచింది. ప్రపంచ స్థాయి పర్యాటకుల  మది దోచుకుంది. ఇంతటి పేరుగాంచిన ‘లోయ’ భారీ ఉత్సవానికి ముస్తాబైంది. రెండురోజుల పాటు జరిగే  ‘అరకు ఉత్సవం’ నేడు ప్రారంభం కానుంది. ఈ ఉత్సవానికి రూ. కోటి రూపాయల ఖర్చుతో టూరిజం శాఖ భారీగా ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రా ఊటీ అందాలపై ప్రత్యేక కథనం. 

జలపాతాల హోరు..  పర్యాటకుల హుషారు...  
అనంతగిరి, అరకులోయ, డుంబ్రిగుడ మండలాల్లో జలపాతాలు పర్యాటకుల్ని ఆహా్వనిస్తున్నాయి. ఎత్తైన కొండల నుంచి జాలువారుతున్న నీటి ధారలు సందర్శకులకు వింత అనుభూతిని మిగులుస్తున్నాయి.  

కటికి జలపాతం:  
బొర్రాగుహలకు సమీపంలో ఉంది ఈ జలపాతం. 
దీని ఎత్తు 300 మీటర్లు.  
రైలు ప్రయాణంలో కూడా ఈ జలపాతం అందాల్ని వీక్షించొచ్చు.  
కటికి జలపాతం వద్ద తరచూ ట్రెక్కింగ్‌ క్యాంప్‌లు జరుగుతుంటాయి.

  

తాడిగుడ: అనంతగిరి మండల కేంద్రానికి సమీపంలో ఉంది తాడిగుడ జలపాతం.  
అమ్మ: అనంతగిరి–హుకుంపేట మండలాల సరిహద్దులోని వేలమామిడి సమీపంలో ఎత్తైన 
అమ్మ జలపాతం ఉంది.  మారుమూల ప్రాంతంలో ఉండడం.. రవాణా సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉండడంతో పర్యాటకులు అంత దూరం వెళ్లలేకపోతున్నారు.  

అరకులోయ మండలంలోని రణజిల్లెడ, డుంబ్రిగుడ మండలంలోని కొల్లాపుట్టు, చాపరాయి జలపాతాలు కూడా పర్యాటకుల్ని రా..రమ్మంటున్నాయి.  

రైలు ప్రయాణం  ఓ అద్భుతం...  
అరకులోయకు రైలు ప్రయాణం అద్భుతంగా సాగుతుంది. బోలెడు జ్ఞాపకాల్ని మిగులుస్తుంది. విశాఖలో ఉదయం 7 గంటలకు విశాఖ–కిరండోల్‌ పాసింజర్‌ రైలు బయల్దేరుతుంది. ఇందులో ప్రయాణమంటే పర్యాటకులకు అమితమైన ఇష్టం. కొండల నడుమ సాగే ఆహ్లాదకర ప్రయాణంతో పర్యాటకులు పరవశిస్తారు. విజయనగరం జిల్లా ఎస్‌.కోట సమీపంలోని బొడ్డవర ప్రాంతం నుంచి అరకులోయ సమీపంలోని కరకవలస వరకు రైలు ప్రయాణం ఎత్తైన కొండల నడుమ సాగుతుంది. కొండలను చీల్చి గుహలలో నిర్మించిన రైలు మార్గం పర్యాటకులను మరింత ఆకట్టుకుంటుంది. చిన్నారులు, విద్యార్థులంతా టన్నెల్స్‌ మధ్య రైలు ప్రయాణాన్ని చూసి తెగ సంబరపడతారు. పగలు కూడా ఈ కొండల మధ్య టన్నెల్స్‌ దాటే సమయంలో చీకటి ఆవరిస్తుంది. ప్రయాణికులకు ప్రత్యేక అనుభూతిని మిగులుస్తుంది.

 

ప్రత్యేకతలివే...  
ఈ మార్గంలో మొత్తం 52 టన్నెల్స్‌ ఉన్నాయి.  
బొర్రా–చిమిడిపల్లి స్టేషన్‌ల మధ్య 900 మీటర్ల పొడవైన భారీ టన్నెల్‌ ఉంది.  
ఈ టన్నెల్‌ను రైలు దాటేందుకు 20 నిమిషాలు పడుతుంది.
మిగతా టన్నెల్స్‌ 200 మీటర్ల లోపునే ఉంటాయి. 
ఘాట్‌ మార్గం కావడంతో రైలు ప్రయాణం నెమ్మదిగా సాగుతుంది.  
బొర్రా గుహలు మీదుగానే రైలు పట్టాలు ఉండడం మరో ప్రత్యేకత. 
రైలు ప్రయాణమంతా దట్టమైన అటవీ ప్రాంతం గుండా సాగుతుంది.  
ఎత్తైన కొండలు, ప్రకృతి అందాలు, అక్కడక్కడా దర్శనమిచ్చే జలపాతాలను చూస్తూ పర్యాటకులు మంత్ర ముగ్థులవుతారు.  

బాగు.. యాపిల్‌ సాగు...  
యాపిల్‌ సాగు అంటే అందరికీ కాశ్మీర్‌లోయ గుర్తొస్తుంది. అరకులోయ కూడా యాపిల్‌ సాగుకు అనుకూలంగా ఉంది. పాడేరు ఐటీడీఏ, హారీ్టకల్చర్‌ శాఖలు ప్రయోగాత్మకంగా అరకులోయ మండలంలోని పద్మాపురం, చినలబుడులో మూడేళ్ల క్రితం యాపిల్‌ సాగుకు గిరిజన రైతులను ప్రోత్సహించాయి. అరకులోయలోని చల్లని వాతావరణం యాపిల్‌ సాగుకు అనుకూలంగా ఉండడంతో రెండేళ్ల నుంచి ఇక్కడ సిమ్లా యాపిల్స్‌ విరగ్గాస్తున్నాయి. అలాగే స్టాబెర్రీ పంటకు అరకులోయ ఖ్యాతిగాంచింది.  

ఘాట్‌ రోడ్‌లో అందాలు భలే...  
విశాఖపట్నం నుంచి అరకులోయకు ఉన్న రోడ్డు మార్గంలో కూడా ప్రకృతి అందాలు పర్యాటకుల్ని పలకరిస్తాయి. కొండల నడుమ ఘాట్‌రోడ్డులో ప్రయాణం ఆహ్లాదకరంగా సాగుతుంది. ఎత్తైన గాలికొండ ప్రధాన ఆకర్షణ. అలాగే దారి మధ్యలో కాఫీతోటలు కనువిందు చేస్తాయి. ఈ తోటల్లో చల్లని వాతావరణం మధ్య ప్రయాణం ఒత్తిడిని దూరం చేస్తుంది.  

సంప్రదాయాలకు ప్రతీకలు...   
అరకులోయను సందర్శించే పర్యాటకులు, చిన్నారులకు గిరిజన మ్యూజియ, పద్మాపురం గార్డెన్‌లు ఘన స్వాగతం పలుకుతాయి.    
గిరిజన మ్యూజియంలో గిరిజన ఆచార సంప్రదాయాలను ప్రతిబింబించే కళాకృతులు ఉన్నాయి.  
ఇక్కడ బోటు షికారు కూడా ఏర్పాటు చేశారు.  
పద్మాపురం బొటానికల్‌ గార్డెన్‌లో పూలు, పండ్ల జాతుల మొక్కలతో పాటు ఔషధ మొక్కలు ఇక్కడ ప్రత్యేకం.   
ఇక్కడ టాయ్‌ట్రైన్‌లో ప్రయాణం చిన్నారులను ఆకట్టుకుంటుంది. 

గుహల అందాల చూడతరమా.. 
అనంతగిరి మండలంలోని బొర్రాగుహలు ప్రపంచ ఖ్యాతిగాంచాయి. వీటిని సందర్శించేందుకు విదేశీ పర్యాటకులు అధికంగా వస్తుంటారు. సహజసిద్ధంగా ఏర్పడిన బొర్రాగుహలు అరకులోయ అందాలకు ప్రధాన ఆకర్షణ. గుహలలో విభిన్న ఆకృతుల్లో శిలలు పర్యాటకుల్ని ఆలోచింపజేస్తాయి. పర్యాటక శాఖ ఈ గుహల్లో విద్యుత్‌ వెలుగుల్ని కూడా ఏర్పాటు చేసింది. పూర్వం బొర్రాగుహల అందాలను కాగడాల వెలుతురులో వీక్షించేవారు.

 

ఉత్సవానికి వేళాయె...
గత పాలకుల నిర్లక్ష్యంతో మూడేళ్లుగా ఉత్సవాలకు నోచుకోని పర్యాటక ప్రాంతం అరకులోయలో ఈ ఏడాది అరకు ఉత్సవ్‌–2020ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్వహించింది.  
శని, ఆదివారాల్లో ఈ ఉత్సవాలు జరగనున్నాయి.  
ఈ సంబరానికి అరకులోయలోని ఎన్టీఆర్‌ మైదానం వేదిక కానుంది.  
పర్యాటక శాఖ ఈ ఉత్సవాలను పర్యవేక్షిస్తోంది.  
ఈ ఉత్సవాలను విజయవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్, పాడేరు ఐటీడీఏ పీవో బాలాజీ, సబ్‌కలెక్టర్‌ వెంకటేశ్వర్‌లు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు.  
శుక్రవారం సాయంత్రం ఎనీ్టఆర్‌ మైదానాన్ని పాడేరు సబ్‌కలెక్టర్‌ వెంకటేశ్వర్, ఇతర టూరిజం అధికారులు సందర్శించారు. ఏర్పాట్లను పర్యవేక్షించారు.

 అందరికీ ఆహ్వానాలు
ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కురసాల కన్నబాబు, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, అరకు, పాడేరు ఎమ్మెల్యేలు చెట్టి పాల్గుణ, కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి తో పాటు, జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ అరకు ఉత్సవాలకు తరలిరావాలని జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ ఆహ్వానాలు పంపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement