సాక్షి, విశాఖపట్నం: అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి, కుసిరెడ్డి శివప్రసాద్ వివాహం ఘనంగా జరిగింది. కొయ్యూరు మండలం శరభన్నపాలెంలో ఎంపీ మాధవి స్వగృహంలో గురువారం రాత్రి 3.15 గంటలకు (తెల్లవారితే శుక్రవారం) జరిగిన ఈ పెళ్లికి బంధుమిత్రులతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. మేళతాళాలు, రంగు రంగుల విద్యుత్ దీపాల నడుమ సంప్రదాయబద్ధంగా వివాహం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి మాధవి తండ్రి, మాజీ ఎమ్మెల్యే దేముడు అభిమానులు శరభన్నపాలెం తరలి వచ్చారు.
పెళ్లిబాజాలు మోగే వరకు వధూవరుల్ని ఒక చోటకి తీసుకురాకపోవడం అక్కడి సంప్రదాయం కావడంతో.. ముహూర్తానికి గంట ముందు పెళ్లికుమారుడిని తీసుకొచ్చారు. ఈ సందర్భంగా బంధుమిత్రులు ఉత్సాహంగా నృత్యాలు చేశారు. దీంతో మాధవి స్వగ్రామమైన కొయ్యూరు మండలం శరభన్నపాలెంలోనూ, ఇటు వరుడు శివప్రసాద్ స్వగ్రామం గొలుగొండ మండలం కృష్ణదేవిపేట గురువారం రోజంతా సందడి వాతావరణం నెలకొంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు, నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ, మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబుతో పాటు పార్టీ నేతలు ఎంపీ మాధవిని ఆశీర్వదించారు. (చదవండి: ఒప్పించారు ఒక్కటయ్యారు)
Comments
Please login to add a commentAdd a comment