
కొత్త భవనాల ఖర్చెందుకు?: ఆర్‌కే
- మంగళగిరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల ధ్వజం
- అందుబాటులో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల నుంచే పరిపాలించండి
సాక్షి, హైదరాబాద్: తాత్కాలిక రాజధాని కార్యాలయాలను విజయవాడ, గుంటూరులో ఉన్న ప్రభుత్వ భవనాలలోనే నెలకొల్పాలని మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రకాశం బ్యారేజి నుంచి గుంటూరు మధ్య ఏర్పాటయ్యే తాత్కాలిక రాజధాని ప్రాంతాన్ని రెండు రోజుల్లో ప్రకటించి షెడ్ల నిర్మాణానికి టెండర్లు పిలుస్తామని పురపాలక మంత్రి పి.నారాయణ ప్రకటించటంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు.
అందుబాటులో ఉన్న చక్కటి ప్రభుత్వ భవనాల నుంచి పరిపాలన సాగించకుండా మళ్లీ ఈ దుబారా ఖర్చు ఎందుకని ప్రశ్నించారు. మంగళగిరి పరిసరాల్లో 10 వేల నుంచి 12 వేల ఎకరాల ప్రభుత్వ భూములున్నా పట్టించుకోకుండా తుళ్లూరులోని పచ్చని పొలాలను రైతుల నుంచి లాక్కోవటాన్ని ఆళ్ల తప్పుబట్టారు. తాత్కాలిక రాజధాని అయినా, శాశ్వతమైనదైనా ప్రభుత్వ భూముల్లో నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.
‘కేఈ’ ఉంటే ఆటలు సాగవనే..
భూ సమీకరణ వ్యవహారంలో రెవెన్యూ మంత్రి కె.ఇ.కృష్ణమూర్తిని ఎందుకు దూరంగా ఉంచుతున్నారని ఎమ్మెల్యే ఆళ్ల ప్రశ్నించారు. మంత్రి నారాయణ తన చేతిలో కీలుబొమ్మ కనుకే సీఎం చంద్రబాబు ఈ కీలక బాధ్యతలు అప్పగించారని దుయ్యబట్టారు. ఈ వ్యవహారంలో ఏవైనా లోటుపాట్లు ఉంటే అనుభవజ్ఞుడైన కేఈ అభ్యంతరం వ్యక్తం చేస్తారనే తాను చెప్పినట్లు నడుచుకునే నారాయణకు సీఎం ప్రాధాన్యం ఇచ్చారని వ్యాఖ్యానించారు.