దేశమంటే రాహుల్, మోడీయేనా?
వామపక్షాల ఆగ్రహం
10న హైదరాబాద్‌లో బహిరంగ సభ
సాక్షి, హైదరాబాద్: దేశమంటే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ, గుజరాత్ సీఎం నరేంద్రమోడీ కాదని వామపక్షాలు మండిపడ్డాయి. కుర్చీ కోసం కాట్లాడుకుంటున్న వీరిద్దరూ ప్రపంచ బ్యాంకు అనుయాయులు, రిలయెన్స్ అధినేత అంబానీ జేబులో మనుషులని ధ్వజమెత్తాయి. ప్రత్యామ్నాయ రాజకీయాలే తమ పోరాట పంథా అని స్పష్టం చేశాయి. ప్రజా సమస్యలు, పోరాటాల కార్యాచరణపై చర్చించేందుకు శుక్రవారమిక్కడ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు అధ్యక్షతన నాలుగు వామపక్ష పార్టీల నేతలు సమావేశమయ్యారు. కె.నారాయణ, కె.రామకృష్ణ (సీపీఐ), బండ సురేందర్‌రెడ్డి, దయానంద్, నరేందర్‌రెడ్డి(ఫార్వర్డ్‌బ్లాక్), జానకిరాములు, ఇ.రాజేందర్, అశోక్(ఆర్‌ఎస్పీ), వై.వెంకటేశ్వరరావు(సీపీఎం) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఓట్లు, సీట్ల వేటలో తెరమరుగైన సమస్యల్ని వెలుగులోకి తెచ్చి ప్రజల్లో చైతన్యం పెంచి ప్రత్యామ్నాయాన్ని నిర్మిస్తామని వామపక్షాలు ప్రకటించాయి. ఇందులో భాగంగా అక్టోబర్ 10వ తేదీన హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం లెఫ్ట్ నేతలు మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ సభకు సీతారాం ఏచూరి, సురవరం సుధాకర్‌రెడ్డి, అభోనీరాయ్ హాజరవుతారని నారాయణ తెలిపారు. కృష్ణా, గోదావరి బేసిన్‌లో గ్యాస్ దోపిడీ జరుగుతోందని రాఘవులు ఆరోపించారు. కేజీ బేసిన్‌ను జాతీయం చేయాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా అర్హులైన ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరారు.