కావలి, న్యూస్‌లైన్ : కావలి కాలువ ఆయకట్టు పరిధిలో ఒక్క ఎకరా కూడా సాగునీరు లేక ఎండినా ఒప్పుకునేది లేదని వైఎస్సార్‌సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. శనివారం వైఎస్సార్‌సీపీ కావలి నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆయన కావలి కాలువ ఆయకట్టు పరిధిలో ఎండుతున్న పంట పొలాలను పరిశీలించారు. రైతుల నుంచి పంటల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ రైతులు ఎకరాకు రూ.10 వేలకు పైన పెట్టుబడి పెట్టి సాగు చేసుకుంటుంటే ఇప్పుడు నీరు లేక ఎండిపోవడం ఎంతో బాధాకరమన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి పంటలు ఎండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సంగం బ్యారేజీ ఆధునికీకరించి ఉంటే ఈ సాగునీటి కష్టాలు తప్పేవన్నారు. ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన కావలి కాలువలో నీటి పారుదల సామర్థ్యం తక్కువగా ఉందన్నారు. గత సీజన్‌లో కూడా సాగునీరు అందక పంటలు ఎండిపోయి, రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు.
కావలి కాలువ వెడల్పు చేసి వెయ్యి క్యూసెక్కులు పారించేలా చేస్తే రైతులకు సాగునీటి సమస్య ఉండదన్నారు. రాష్ట్రంలో రానున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కావలి కాలువ ఆధునికీకరణ చేస్తామన్నారు. ఆయకట్టు పరిధిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యను సోమశిల ప్రాజెక్టు ఎస్‌ఈ సోమశేఖర్‌తో ఫోన్‌లో ఎంపీ మాట్లాడారు. కలెక్టర్ శ్రీకాంత్ పంట పొలాలు ఎండకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు అధికారులకు సూచనలు ఇస్తున్నారన్నారు. కావ లి కాలువ ఆయకట్టు రైతులు పడుతున్న సమస్యలను అక్కడే ఉన్న కావలి ఆర్డీఓ వెంకటరమణారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. సంగం బ్యారేజీ వద్ద ఇసుక బస్తాలను వేసి ప్రస్తుతం నీటిని పారిస్తున్నామని ఆర్డీఓ ఎంపీ మేకపాటికి వివరించారు.
ఎక్కువ ఎత్తులో ఇసుక బస్తాలను వేస్తే బ్యారేజీ కొట్టుకుని పోయే పరిస్థితి ఉందని ఆర్డీఓ చెప్పారు. సమస్యలు ఎన్ని ఎదురైనా ఎట్టి పరిస్థితుల్లో రైతుల అందరి పంట పొలాలకు నీరు చేరేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ మేకపాటి ఆర్డీఓకు సూచించారు. కావలి కాలువ నుంచి కావలి చెరువుకు నీటిని విడుదల చేయకుంటే ఆయకట్టు పరిధిలోని పంట పొలాలు పూర్తిగా ఎండిపోతాయని రైతులు ఎంపీకి మొరపెట్టుకున్నారు. అక్కడే ఉన్న నీటిపారుదలశాఖ డీఈ శ్రీదేవిని దీనిపై ఎంపీ వివరణ అడిగారు. వెంటనే నీటిని నింపే ఏర్పాట్లను చేయాలని సూచించారు.
సాగు అవుతున్న పంట పొలాలు నీరు లేకుండా ఎండడం చూస్తూ ఎంతో ఆవేదన చెందుతున్నానని ఎంపీ మేకపాటి అన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, కావలి నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కావలి కాలువ అధికారులు అవగాహన రాహిత్యం వల్లే రైతులకు సాగునీటి సమస్య వచ్చిందన్నారు. ఐఏబీ సమావేశానికి ముందే కావలి కాలువ కింద ఉన్న చెరువులకు సోమశిల ప్రాజెక్టులోని నీటితో నింపి ఉంటే ఇప్పుడు రైతులు ఈ సమస్యను ఎదుర్కొనే పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఇప్పుడు కాలువలోని నీటిని వదలడంతో ఆయకట్టు పరిధిలోని రైతులందరికీ ఆ నీరు అందక సమస్య ఏర్పడిందన్నారు. ప్రతి సీజన్‌లో రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యను చూసి ఈ సారైనా ఓ ప్రణాళిక ప్రకారం అధికారులు ముందుకెళ్లి ఉంటే బాగుం డేదన్నారు. కావలి రూరల్ మండలంలోని సర్వాయపాళెం, గౌరవరం, బోగోలు మండలం పాతబిట్రగుంట, దగదర్తి మండలం నారాయణపురం గ్రామాల్లో సాగునీరు లేక ఎండుతున్న పంట పొలాలను మేకపాటి పరిశీలించారు.
కార్యక్రమంలో కావలి తహశీల్దార్ వెంకటేశ్వర్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కావలి పట్టణ నాయకులు పోనుగోటి శ్రీని వాసులురెడ్డి, కావలి రూరల్, అల్లూరు, బోగోలు, దగదర్తి మండలాల కన్వీనర్లు చింతం బాబుల్‌రెడ్డి, దండా కృష్ణారెడ్డి, పెంచలయ్య, గోగుల వెంకయ్య, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం అల్లూరు మండల కన్వీనర్ మన్నెమాల సుకుమార్‌రెడ్డి, నియోజకవర్గంలోని వైఎస్సార్‌సీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
ఎకరా ఎండినా ఒప్పుకోం
Published Sun, Dec 22 2013 4:53 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement