ఏపీఎన్జీవోల సమ్మెపై హైకోర్టులో బుధవారం వాదనలు ముగిశాయి.
ఏపీఎన్జీవోల సమ్మెపై హైకోర్టులో బుధవారం వాదనలు ముగిశాయి. రేపు కూడా వాదనలు కొనసాగనున్నాయి. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపించగా, ప్రభుత్వం తరఫున వీసీ.హెచ్.నాయుడు, ఏపీఎన్‌జీవోల తరఫున సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె చేస్తున్నారని, రాజకీయ అంశమైన రాష్ట్ర విభజన గురించి సమ్మె చేసే హక్కు ప్రభుత్వ ఉద్యోగులకు లేదంటూ హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది రవికుమార్, ఆల్ ఇండియా బీసీ, ఓబీసీ పార్టీ అధ్యక్షుడు టి.దానయ్య వేర్వేరుగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఏపీఎన్జీవో, ఇతర ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శిక్షార్హమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తోందంటూ హైకోర్టు మంగళవారం ఘాటు వ్యాఖ్యలు చేసింది. సమ్మె విషయంలో సర్కారు అనుసరిస్తున్న వైఖరిని తప్పుపట్టింది. ప్రభుత్వ చర్యలను గమనిస్తుంటే అవి సమ్మెను సమర్థిస్తున్నట్లు కనిపిస్తున్నాయంటూ అసహనం వ్యక్తం చేసింది.