ఇటీవల స్వగ్రామం వచ్చినప్పుడు భార్య, కుమారుడితో సెల్ఫీ తీసుకుంటున్న మృతుడు బైరాగి (ఫైల్)
సాక్షి, ఇచ్ఛాపురం రూరల్: పది రోజుల కిందట కుమారుడితో ఆనందంగా గడిపిన ఆ తండ్రి ఇక ఆ బిడ్డకు లేడు. భార్యాపిల్లలతో కలిసి సరదాగా గడిపిన మనిషి మరి లేరు. ఇచ్ఛాపురం మండలం బిర్లంగి తోటూరు గ్రామానికి చెందిన దుంప అప్పారావు, లక్ష్మమ్మల మూడో సంతానం దుంప బైరాగి(28) ఆర్మీలో విధులు నిర్వహిస్తూ పిడుగుపాటుకు గురై శుక్రవారం మృతి చెందారు. బైరాగి ఎనిమిదేళ్ల క్రితం ఆర్మీ జవాన్‌గా రాజస్థాన్‌లో విధుల్లో చేరి రెండున్నరేళ్ల క్రితం దివ్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే తండ్రి మృతి చెందడంతో కుటుంబ బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్నాడు.
25 రోజుల కిందటే స్వగ్రామానికి సెలవుపై వచ్చిన బైరాగి 18 నెలల కుమారుడు యశ్వంత్‌ను క్షణం కూడా వదలకుండా గడిపాడు. పది రోజుల పాటు పిల్లా పాపలతో ఉండి పదిహేను రోజుల క్రితమే రాజస్థాన్ వెళ్లిపోయాడు. శుక్రవారం విధుల్లో ఉండగానే సాయంత్రం నాలుగు గంటల సమయంలో భార్య దివ్యతో వాట్సాప్‌లో మాట్లాడుతుండగా పెద్ద శబ్దం వినిపించి ఫోన్ కట్ అయిపోయింది. ఆ సమయంలోనే పిడుగు పడి బైరాగి మృతి చెందారు. ఈ విషయాన్ని శుక్రవారం అర్ధరాత్రి సంబంధిత అధికారులు కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో గ్రామం ఒక్క సారిగా విషాదంలో మునిగిపోయింది. ఆదివారం మృతదేహం స్వగ్రామానికి చేరుకుంటుందని బంధువులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment