మణిపూర్‌లో ఆర్మీ జవాన్ మృతి
- మిలిటెంట్ల దాడిలో చనిపోయినట్టు సమాచారం
- శోకసముద్రంలో బెన్నవోలు
చోడవరం: దేశ సేవ కోసం వెళ్లిన కొడుకు మిలిటెంట్ల దాడిలో చనిపోయాడని తెలిసి తల్లిదండ్రులు, బంధువులు శోకసముద్రంలో మునిగిపోయారు. మణిపూర్‌లో విధుల్లో ఉండగా ఆర్మీ జవాన్ మజ్జి శంకరావు(24) మృతి చెందినట్టు మంగళవారం సమాచారం రావడంతో బెన్నవోలులో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని బెన్నవోలుకు చెందిన మజ్జి శంకరరావు ఆర్మీలో 2010లో చేరాడు. ఐదేళ్లపాటు ఆర్మీ కమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న ఇతడు ఢిల్లీలోను విధులు నిర్వహించారు.
ఏడాది కిందట మణిపూర్ బదిలీ అయి అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. విధుల్లో ఉండగా మంగళవారం తెల్లవారు జామున మణిపూర్ మిలిటెంట్లు దాడిలో చనిపోయినట్టు కుటుంబసభ్యులు, బంధువులు భావిస్తున్నారు. మణిపూర్ ఆర్మీ క్యాంపస్ నుంచి ఫోన్‌ద్వారా మృతుడు అన్నయ్య రాజుకు సమాచారం రావడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతదేహం గురువారం స్వగ్రామానికి రావచ్చని భావిస్తున్నారు.
తమకు దిక్కెవరంటూ రోదన
కన్నకొడుకు మృతిచెందాడని తెలియడంతో తల్లిదండ్రులు సత్యవతి, సింహాచలం బోరున విలపిస్తున్నారు. కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్న కొడుకు ఆకస్మికంగా చనిపోయాడని తెలిసి తల్లి సత్యవతి బోరున విలపిస్తోంది. ఆమె రోదన అందరినీ కలిచివేస్తోంది.
త్వరలో వివాహం నిశ్చయం:
శంకరరావుకు బంధువు కుమార్తెతో వివాహం నిశ్చయించారు. ఈ ఏడాది చివర్లో పెళ్లికి ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు బంధువులు తెలిపారు. ఇంతలో ఘోరం జరిగిపోయిందంటూ బోరున విలిపించారు. గ్రామం శోకసముద్రంలో మునిగిపోయింది. అందరిలోనూ విషాదమే కనిపిస్తోంది. స్నేహితుడి అకాల మరణాన్ని అతనితో కలిసి చదువుకున్న మిత్రులు జీర్ణించుకోలేకపోతున్నారు.